నియంత్రకు ఢిల్లీ హైకోర్టు నిరాకరణ
అడ్డుకునేందుకు బిజెపి ప్రభుత్వం కుట్రలు
16, 17 తేదీల్లో సెంట్రల్ పార్క్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటన
భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన ఢిల్లీ పోలీసులు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సిజెపి ఆధ్వర్యంలో గురువారం లెహ్రా దో తిరంగా ఆందోళన కార్యక్రమంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితులతోనైనా అడ్డుకోవాలని బిజెపి ప్రభుత్వాలు గట్టి ప్రయత్నిస్తున్నాయి. కన్నాట్ ప్లేస్ వద్ద ఉన్న సెంట్రల్ పార్క్‌లో లెహ్రా దో తిరంగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు సిజెపి జాతీయ కన్వీనర్ అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. దీనికోసం కార్యకర్తలు, దేశభక్తులు జాతీయ జెండాలతో రావాలని దీప్కే పిలుపునిచ్చారు. మరోవైపు ఢిల్లీ పోలీసుల హామీతో ఈ నిరసనను నిరోధించడానికి ఢిల్లీ హైకోర్టు గురువారం నిరాకరించింది. ఈ కార్యక్రమం సందర్భంగా ఎలాంటి ఆందోళన తలెత్తకుండా, ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు కోర్టుకు హామీ ఇచ్చారు. ఈ హామీని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. సిజెపి నిరసనను వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని వ్యాపార సంఘం పలికా బజార్ వ్యాపారులు వేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. హైకోర్టు నిర్ణయానికి కొన్ని నిమిషాల తరువాత కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్‌ను రెండు రోజుల పాటు మూసి వేస్తూ న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుంది. మున్సిపల్ కార్పొరేషన్లో బిజెపి అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. పరిపాలనా కారణాలతో ఈ నెల 16, 17 తేదీలలో సెంట్రల్ పార్క్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అధికారులు ఎలా చెప్పినా సిజెపి త్రివర్ణ పతాక యాత్ర నేపథ్యంలో సెంట్రల్ పార్క్‌ను మూసివేసే నిర్ణయం తీసుకున్నట్లు విమర్శకులు భావిస్తున్నారు. మరోవైపు గురువారం సాయంత్రం నుంచే కన్నాట్ ప్లేస్, జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీ పోలీసులతో పాటు , పలు పారామిలిటరీ బలగాల కంపెనీలను మోహరించారు. భారీగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. సెంట్రల్ పార్కును మూసివేశారు, కాబట్టి నిరసనకారులు ఇటువైపు రావొద్దని పోలీసు అధికారులు ప్రకటించారు.
కాగా, పలికా బజార్ వ్యాపారులు తమ పిటిషన్లో సిజెపి ఆందోళన వల్ల తమ వ్యాపారం దెబ్బ తింటుందని, తాము భారీగా నష్టపోతున్నామని పేర్కొన్నారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని, పోలీసులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీనిపై ఢిల్లీ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ నితిన్ వాసుదేవ్ సంబ్రే, జస్టిస్ సంజయ్ శర్మ ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారణ జరిపి ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు గురువారం బదులిచ్చారు. సిజెపి ఆందోళన విషయంలో తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని కోర్టుకు తెలిపారు. ఎలాంటి ఆందోళన తలెత్తకుండా, ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని కోర్టుకు హామీ ఇచ్చారు. తగిన నిఘా, భద్రత ఏర్పాటు చేశామని, అవసరమైతే దీప్కేపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కోర్టుకు పోలీసులు వివరించారు. దీంతో ఈ ఆందోళన చేపట్టకుండా చూడాలంటూ పిటిషనర్లు చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో సిజెపి ఆందోళన చేయకుండా నిరోధించేలా తాము ఆదేశాలు జారీ చేయలేమని పేర్కొంది.







కామెంట్లు (0)