గురువారం, 15 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఉద్యమకేంద్రంగా జంతర్‌మంతర్‌ పునరుద్ధరించాల్సిందే

1 గంట క్రితం

ఉద్యమకేంద్రంగా 
జంతర్‌మంతర్‌ పునరుద్ధరించాల్సిందే 
- సిఇసిగా జ్ఞానేష్‌ తక్ష‍ణమే రాజీనామా
- నిరసనకారులను విడుదల చేయాలి
- మీడియా సమావేశంలో విద్యార్థి, యువజన, పౌర సంఘాల నేతల డిమాండ్‌ 
- భారీ సంఖ్యలో హాజరైన మీడియా ప్రతినిధులు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 16, 2026, 12:24 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

  • సిఇసిగా జ్ఞానేష్‌ తక్ష‍ణమే రాజీనామా

  • నిరసనకారులను విడుదల చేయాలి

  • మీడియా సమావేశంలో విద్యార్థి, యువజన, పౌర సంఘాల నేతల డిమాండ్‌

  • భారీ సంఖ్యలో హాజరైన మీడియా ప్రతినిధులు

ప్ర‌జాశ‌క్తి - న్యూఢిల్లీ బ్యూరో : ​శాంతియుత నిరసనలకు ఉద్యమకేంద్రంగా ఉన్న జంతర్‌మంతర్‌ను నిర్దేశిత నిరసనల కేంద్రంగా అధికారిక గుర్తింపును తొలగిస్తూ కేంద్రం ఢీనోటిఫై చేయడాన్ని విద్యార్థి, యువజన, ప్రజా, పౌర సంఘాల నేతలు తీవ్రంగా ఆక్ష‍ేపిం చారు. తక్ష‍ణమే జంతర్‌మంతర్‌ను అధికారిక ఉద్యమ కేంద్రంగా పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. అలాగే కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సిఇసి) తక్ష‍ణమే రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)ను రద్దు చేయాలని, ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమైన ఎన్నికల సంఘాన్ని ప్రక్ష‍ాళన చేయాలని పునరుద్ఘా టించారు. ఇదే డిమాండ్‌తో కొంతకాలంగా ఢిల్లీలోనూ, దేశంలోని అనేక చోట్ల ఆందోళనలను చేస్తున్న యువతను, విద్యార్థులను, సామాజిక కార్యకర్తలను అక్రమంగా నిర్బంధించారని, వారందరినీ తక్ష‍ణమే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు న్యూఢిల్లీ లోని ప్రెస్‌క్లబ్‌ ఆఫ్‌ ఇండియాలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రఖ్యాత న్యాయకోవిదులు ప్రశాంత్‌ భూషణ్‌, విలక్ష‍ణ నటులు ప్రకాష్‌ రాజ్‌, కాక్రోచ్‌ జనతా పార్టీ (సిజెపి) వ్యవస్థాపకులు అభిజిత్‌ ధీప్కే, భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) నేత ఐషీఘోష్‌, అఖిల భారత విద్యార్థి సంఘం (ఎఐఎస్‌ఎ) అధ్యక్ష‍ులు నేహా బోరా తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి భారీ సంఖ్యలో మీడియా ప్రతినిధులు హాజరవ్వడంతో ఆ ప్రాంగణమంతా కిక్కిరిసిపో యింది. సిజెపి వ్యవస్థాపకులు ధీప్కే మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌ అక్రమాలకు బాధ్యత వహించి సిఇసి జ్ఞానేష్‌కుమార్‌ రాజీనామా చేయాలని, పోలీసుల క్రూరత్వానికి ముగింపు పలకాలని, సిజెపి నేతలు అశుతోష్‌ రంకా, సౌరవ్‌ దాస్‌ సహా అక్రమ నిర్బంధంలో ఉన్న నిరసనకారులందరినీ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అక్రమాలకు పాల్పడిన జ్ఞానేష్‌కుమార్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రక్ష‍ిస్తున్నారని, దీనినిబట్టి ఆయన, ఆయన పార్టీ ఎన్నికల్లో గెలుపొందడానికి జ్ఞానేష్‌కుమార్‌ సహాయం చేశారని, ఇప్పుడు చేస్తున్నారని తామెందుకు భావించరాదని ప్రశ్నించారు. భారత జాతీయ పతాకం మువ్వన్నెల జండాను ఎగురవేయడాన్ని కూడా నేరంగా చూస్తున్నారంటే? జ్ఞానేష్ కుమార్‌ను రక్ష‍ించడానికి వారు (బిజెపి పాలకులు) ఎంతకు దిగజారారో అర్థమవుతోందన్నారు. ఆంక్ష‍లు, బారీకేడ్లలో ఢిల్లీని స్థభించజేశారని, రైళ్లను రద్దు చేసి, మెట్రో స్టేషన్లను మూసివేసి నగర వాసులను నానాయాతనకు గురిచేశారని, దేశ రాజధాని నగరాన్ని భారత్‌-పాక్‌ సరిహద్దును తలపించేసేలా ఆంక్ష‍లు విధించారని గుర్తు చేశారు. సైనిక బలగాలను సైతం రప్పించి..ఢిల్లీ నడివీధుల్లో విద్యార్థి, యువజన సంఘాల నేతలను,. ప్ర‌తిప‌క్షాల‌ అధినేతలను, మాజీ ముఖ్య‌మంత్రుల‌ను ఈడ్చుకుంటూ దుర్మార్గపు దాడులకు పాల్పడ్డారని తెలిపారు. ‘ఇదంతా ఎవరి కోసం? జ్ఞానేష్‌ రక్ష‍ణ కోసమే కదా? ఎందుకంతలా ఆయనను రక్ష‍ిస్తున్నారు?’ అని ధీప్కే నిలదీశారు.

​అక్రమాల సాక్ష్యాధారాలను ధ్వంసం చేసేందుకే ఎస్‌ఐఆర్‌ : ప్ర‌కాష్ రాజ్‌

బిజెపి అధికారంలోకి వచ్చిననాటి నుంచి జరిగిన అన్ని ఎన్నికల్లోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయని, ఇప్పుడు ఆ అక్రమాలను బయటపెట్టే సాక్ష్యాధారాలు ఒక్కొక్కొటిగా బయటపడుతుండటంతో వాటిని ధ్వంసం చేసేందుకే ఎస్‌ఐఆర్‌ ‌తీసుకొచ్చారని విలక్షణ నటులు, సామాజిక కార్యకర్త ప్రకాష్‌ ‌రాజ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌ఐఆర్‌ అనేది కేవ‌లం ఓట‌ర్ల‌ను ఓట‌రు జాబితా నుండి తొల‌గించేందుకు తీసుకొచ్చినది కాదని, గత ఎన్నిక‌ల అవ‌క‌త‌వ‌క‌ల‌కు సంబంధించిన సాక్ష్యాల‌ను తుడిచిపెట్టే ప్ర‌య‌త్నమని ఆయన చెప్పారు. ఇందంతా ఒక కుట్రపూరితంగా సాగుతోందని విమర్శించారు. మైనార్టీలు, పేదలు, దళిత, గిరిజన ఓటర్లను ‘నిశ్శబ్దంగా తొలగిస్తున్నారు’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఎన్నిక‌లు స‌క్ర‌మంగా జ‌రిగేందుకే పోరాటం : ప్ర‌శాంత్ భూష‌ణ్‌

ఎన్నిక‌లు స‌క్ర‌మంగా జ‌రిగేలా చూడటానికే తాము పోరాడుతున్నామ‌ని సుప్రీంకోర్టు సీనియ‌ర్ న్యాయ‌వాది ప్రశాంత్ భూష‌ణ్‌ అన్నారు. తమ నిరసనలను దేశంలో పాలన మార్పు కోసమే చేస్తున్నవాటికి మోడీ సర్కార్‌ అంటోందని, అందులో ఏమాత్రం సందేహం లేదని, తాము ఈ నిరంకుశ ప్రభుత్వం మారాలని కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. ప్రజల బాగుకోరని ప్ర‌భుత్వాలను మార్చేయడం అనేది ప్ర‌తి పౌరుడి ప్రజాస్వామ్య హ‌క్కు అని ఉద్ఘాటించారు. నిర‌స‌న‌ల‌ను అణ‌చివేయ‌డానికి ఎంత ప్ర‌య‌త్నిస్తే, ప్ర‌జ‌లు రెట్టింపు ఉత్సాహంతో వీధుల్లోకి వ‌స్తార‌ని హెచ్చరించారు. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌భుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేయడం నేరం కాబోదని, ఎన్నిక‌లు స‌క్ర‌మంగా జ‌రిగేందుకు తమ పోరాటమని తెలిపారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులు, యువతపై పోలీసులు సాగించిన దాడులను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ..ఇది ప్రజా ప్రభుత్వం కానేకాదని, ‘గూండా రాజ్‌’ అని విమర్శించారు.

​బిజెపి గెలుపునకు జ్ఞానేష్ స‌హాయంః ఐషీఘోష్‌

దేశ‌వ్యాప్తంగా బిజెపి గెల‌వడానికి సిఇసి జ్ఞానేష్ కుమార్ స‌హాయం చేశార‌ని ఎస్ఎఫ్ఐ అఖిల భార‌త స‌హాయ కార్య‌ద‌ర్శి ఐషీఘోష్ విమ‌ర్శించారు. అక్రమాలతో అధికారంలోకి వచ్చిన బిజెపిపై విద్యార్థులకు, యువతకు నమ్మకం లేదని, ప్ర‌జ‌ల‌ పైనే తమకు న‌మ్మ‌కం ఉంద‌ని ఆమె తెలిపారు. ప్ర‌జాస్వామ్యాన్ని ప‌రిర‌క్షించుకోవ‌డానికి పౌరులంద‌రూ ఏకం కావాల‌ని పిలుపునిచ్చారు. ‘బిజెపిపై మాకు ఆశల్లేవు. ప్ర‌జ‌ల‌పైనే మా ఆశలన్నీ..అంద‌రం ఐక్యం అవ్వాల్సిన స‌మ‌యం ఇది. భ‌గ‌త్ సింగ్ పోరాడి, గాంధీ త్యాగం చేసిన ఈ దేశాన్ని మ‌నం కాపాడుకోవాలి’’ అని ఆమె పిలుపునిచ్చారు. బిజెపి ఏలుబడిలో అత్యాచారాలకు పాల్పడిన దుండగులను పూలమాలలతో సత్కరిస్తున్నారని, అదే దేశం కోసం, వ్యవస్థ ప్రక్షాళన కోసం శాంతియుత పోరాటం చేస్తున్నవారిపై లాఠీలు ఝులిపిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాత్రికేయులపైనా దాడులు : నేహా బోరా

నిరసనలను కవర్ చేస్తున్న పాత్రికేయులను సైతం బిజెపి ప్రభుత్వ యంత్రాగం, పోలీసు బలగాలు వేధింపులకు గురిచేస్తున్నారని ఎఐఎస్ఎ అధ్యక్షులు నేహా బోరా విమర్శించారు. పోలీసుల దాడులను కవర్‌ ‌చేస్తున్న పాత్రికేయులపైనా దాడులు జరిగాయని, వారి కెమెరాలను లాగేసుకున్నారని ఆమె అన్నారు. ఢిల్లీ ఎసిపి వివేక్ భగత్ ఒక మహిళా జర్నలిస్టును లైంగికంగా వేధించారని, దీనిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లితే ఆమెపైనే అక్రమ కేసులు బనాయించారని గుర్తు చేశారు. ఈ సమావేశం అనంతరం న‌టుడు ప్ర‌కాష్ రాజ్. రాజ్‌ఘాట్‌ను సంద‌ర్శించి మహాత్మాగాంధీ స్మారకం వద్ద నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మ‌హాత్మా గాంధీజీ సూచించిన శాంతియుత బాటలోనే ఓటు హ‌క్కు కోసం తమ పోరాటం కొన‌సాగుతుంద‌ని అన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్