ఇండియా బ్లాక్ నేతల పిటిషన్పై విచారణ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలు, ఓటర్ల పేర్ల తొలగింపులో చోటుచేసుకున్న అవకతవకలను సవాల్ చేస్తూ ఇండియా బ్లాక్ నేతలు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. భారత ఎన్నికల సంఘం (ఈసిఐ), ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషీలకు నోటీసులు ఇచ్చింది. గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం 46 పిటిషన్లను కలిపి విచారించింది. ఇండియా బ్లాక్ దాఖలు చేసిన పిటిషన్లోని అంశాలపై సమాధానం ఇవ్వాలని ప్రతివాదులను ఆదేశించింది. అయితే పిటిషన్ దాఖలు చేసిన వారిలో ఒకరి ప్రవర్తనపై తదుపరి విచారణ సందర్భంగా ప్రశ్నిస్తామని ప్రధాన న్యాయమూర్తి మౌఖికంగా వ్యాఖ్యానించారు. ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియలో పారదర్శకత పాటించడం లేదని, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించే ప్రమాదం ఉందని పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితాల నుంచి తొలగించిన పేర్లపై స్వతంత్రంగా ఆడిట్ నిర్వహించాలని కోరారు. ఇందుకోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలని విన్నవించారు. ఈ నెల 12న లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్ష నేతలు సుప్రీంకోర్టు వైపు నిరసన ప్రదర్శనగా వెళ్లిన అనంతరం ఈ పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే.
ఢిల్లీ పోలీస్ కమిషనర్ క్షమాపణ..
రాజధానిలో రవాణా, ప్రజా రాకపోకలపై ఆంక్షలకు సంబంధించి సుప్రీంకోర్టు అక్టోబర్ 9, 11 తేదీలలో జారీ చేసిన మధ్యంతర ఆదేశాలను పాటించలేదని ఆరోపిస్తూ ఢిల్లీ అధికారులపై దాఖలైన ధిక్కార పిటిషన్ల విచారణ జరిగింది. ధర్మాసనం ముందు దాఖలు చేసిన రెండు అఫిడవిట్లలో, ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్, కోర్టు ఆదేశాలను పాటించడంలో ఏదైనా లోపం జరిగినట్లుగా భావించినట్లయితే దానికి బేషరతుగా సంపూర్ణ క్షమాపణలు చెప్పారు. అయితే, కోర్టు ఆదేశాలను "ఉద్దేశపూర్వకంగా లేదా కావాలని పాటించకపోవడం మాత్రం జరగలేదని" విన్నవించారు. ధిక్కార నోటీసును రద్దు చేయాలని ఆయన కోరారు. ధిక్కార నోటీసులకు ప్రతిస్పందనల్లో క్షమాపణను చేర్చామని సొలిసిటర్ జనరల్ (ఎస్జి) తుషార్ మెహతా స్పష్టం చేశారు. ప్రభుత్వం వాస్తవాల ఆధారంగా తన చర్యలను సమర్థించుకుంటోందని ఆయన నొక్కి చెప్పారు. "మీడియా ఏమి చేస్తుందనేది అప్రస్తుతం. మేము మీడియా కోసం విచారణలు జరపడం లేదు" అని సిజెఐ సూర్య కాంత్ వ్యాఖ్యానించగా, సొలిసిటర్ జనరల్ సమర్పణను బట్టి చూస్తే, ఆ క్షమాపణ షరతులతో కూడి ఉన్నట్లు కనిపిస్తోందని జస్టిస్ బాగ్చి వ్యాఖ్యానించారు.







కామెంట్లు (0)