ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి నాయకులను పలు అక్రమ కేసులతో టిడిపి కూటమి ప్రభుత్వం వేధిస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. గుంటూరులోని తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ సిఎం జగన్, పలువురు మాజీ మంత్రులపైనా ఎఐ వీడియోలతో అత్యంత అవమానకరంగా పోస్టులు పెడుతుంటే ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని, తామేదైనా రాజకీయ విమర్శ చేస్తే వెంటనే కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయ విమర్శలు వ్యంగంగా చెయ్యడం సాధారణమని ఆయన తెలిపారు. అధికార పార్టీకి ఒక న్యాయం... ప్రతిపక్షానికి మరొక న్యాయమా అని ప్రశ్నించారు. తనపైనా, వైఎస్ జగన్‌పైనా పెట్టిన సోషల్ మీడియా పోస్టింగ్‌లపై ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు కేసు నమోదు చెయ్యలేదన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా ఎందుకు వ్యవహరించలేకపోతున్నారని ప్రశ్నించారు. ఎన్‌టిఆర్ సిఎంగా ఉన్నప్పుడు ఆయనపై వ్యంగంగా అనేక సినిమాలు తీశారని, ఎన్‌టిఆర్‌ను పోలిన వేషధారణతో క్యారెక్టర్‌తో హీరో కృష్ణ సినిమాలు తీశారని, కానీ ఎన్‌టిఆర్ ఎప్పుడు ఎవరిపైనా కేసులు పెట్టలేదని గుర్తుచేశారు. అద్దంకి వద్ద పోలీసుల కారులో గంజాయి దొరికిందన్నారు. పోలీసులే గంజాయి అమ్మి అధికారులకు డబ్బు ఇస్తున్నారని, సత్తెనపల్లి, చిలకలూరిపేట, రేపల్లె ప్రాంతాలలో పేకాట క్లబ్బులు నడుస్తున్నాయని, గుంటూరులోని ఒక కీలకమైన పోలీసు అధికారికి వాటాలు వెళ్తున్నాయని ఆరోపించారు.








కామెంట్‌లు (0)