సోమవారం, 14 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రజాస్వామ్యాన్ని యువత పరిరక్షించాలి

3 రోజుల క్రితం

vsr
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 11, 2026, 01:10 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- సీతారాం ఏచూరి వర్థంతి సభలో వి.శ్రీనివాసరావు

ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి : ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, దీనిని పరిరక్షించడానికి యువత ముందుకు రావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కోరారు. సిపిఎం ‌పూర్వ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ద్వితీయ వర్థంతి సభ గురువారం నెల్లూరులోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా ‘సోషలిజమే ప్రత్యామ్నాయం’ అనే అంశంపై సెమినార్‌ ‌నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సీతారాం ఏచూరి ఉన్నత కుటుంబంలో జన్మించినప్పటికీ, తన జీవితం చివరి వరకూ పీడిత, తాడిత జనం కోసమే పోరాటం చేశారని కొనియాడారు. ఢిల్లీలోని జెఎన్‌‌యులో ఎస్‌ఎఫ్‌ఐ ఉద్యమాన్ని నడిపించి, దేశ యువతకు దిక్సూచిగా మారారని గుర్తుచేశారు. నేటికీ దేశంలో ఆ ఉద్యమ స్ఫూర్తి కొనసాగుతోందని, ఇటీవల జరిగిన 'జెన్ జీ' ఉద్యమాల్లోనూ యువత, విద్యార్థులు ముందుండి నడిపించారని తెలిపారు. ఆయా పోరాటాల్లో వామపక్ష విద్యార్థి సంఘాలు పోషించిన పాత్రను దేశమంతా గుర్తించిందనన్నారు. నేడు దేశవ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాలే ప్రజాసమస్యలపై ఉద్యమాలను ముందుకు తీసుకెళ్తున్నాయని తెలిపారు. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో అనేక జాతీయ సంస్థలను ప్రారంభిస్తే, నేడు మోడీ ప్రభుత్వం వాటిని ప్రైవేటు, కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతోందని విమర్శించారు. ఫలితంగా దేశంలో పేదలు మరింత పేదలుగా, ధనికులు మరింత ధనికులుగా మారిపోతున్నారని తెలిపారు. మోడీ పాలనలో కార్పొరేట్ శక్తులకు సుమారు రూ.16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారని విమర్శించారు. మోడీ అధికారంలోకి రాకముందు స్విస్ బ్యాంకుల్లో భారతీయులకు చెందిన రూ.24 లక్షల కోట్ల నల్లధనం ఉందని, దాన్ని ఇండియాకు తీసుకొస్తామని చెప్పారని గుర్తుచేశారు. కానీ, ఇప్పుడు కేవలం రూ.ఆరు వేల కోట్లు మాత్రమే అక్కడ ఉందని, మిగిలిన డబ్బు ఎక్కడికి వెళ్లిందని ప్రశ్నించారు. ఆ నల్లధనమే మళ్లీ విదేశీ పెట్టుబడుల రూపంలో దేశంలోకి వస్తోందని విమర్శించారు. ఇక్కడే పరిశ్రమలు పెట్టి, ప్రభుత్వం నుంచి భారీగా రాయితీలు పొందుతున్నారన్నారు. మరోవైపు మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు పెంచేందుకు బిజెపి కుట్రలు చేస్తోందన్నారు. దేశంలో యువత ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తోందని, కానీ మోడీ ఆ ప్రశ్నలను సహించలేకపోతున్నారని విమర్శించారు. బీహార్‌లో ఆరేళ్ల చిన్నారి అడిగిన ప్రశ్నలకు కూడా మోడీ సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. గతంలో 60 శాతం మంది యువత మోడీకి అనుకూలంగా ఓటు వేశారని, అయితే ఇటీవల కాలంలో ఆయన పాలనపై వారికున్న భ్రమలు పూర్తిగా తొలగిపోయాయన్నారు. నేటి దేశ రాజకీయాల్లో సీతారాం ఏచూరి లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని, ఆయన ఒక గొప్ప ప్రపంచ మార్క్సిస్ట్ మేధావి అని కొనియాడారు. అనేక విషయాలపై అధ్యయనం చేయడంతోపాటు పార్లమెంటు లోపల, వెలుపల సూటిగా ప్రశ్నించే వారని గుర్తుచేశారు. దేశ శ్రేయస్సు కోసం, పీడిత ప్రజల హక్కుల కోసం ఆయన నెలకొల్పిన విప్లవ స్ఫూర్తి నేటి యువతకు ఎంతో ఆదర్శం కావాలని కోరారు. ఈ సభకు సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్ అధ్యక్షత వహించారు. రాష్ట్ర కమిటీ సభ్యులు మన్నూరు భాస్కరయ్య, జెఎస్ ట్రస్ట్ చైర్మన్ చండ్ర రాజగోపాల్ పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్