శుక్రవారం, 28 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

అమరవీరుల స్ఫూర్తితో యువత ప్రజా ఉద్యమాల్లోకి రావాలి

1 గంట క్రితం

CPM State Secretary V. Srinivasa Rao paying tribute to the martyrs
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 28, 2026, 05:37 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

ప్రజాశక్తి-ఎన్టీఆర్ : బషీర్‌బాగ్ అమరవీరుల స్ఫూర్తితో యువతరం ప్రజా ఉద్యమాల్లోకి రావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు.బషీర్‌బాగ్ అమరవీరుల 27వ వర్థంతి సంస్మరణ సభ విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ముందుగా బషీర్బాగ్ అమరవీరులు రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి చిత్రపటాలకు పూలమాలలు వేసి వామపక్ష నాయకులు నివాళలులు అర్పించారు. అనంతరం వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. బషీర్‌బాగ్ కాల్పుల ఘటనలో అమరులైన ముగ్గురు ఉద్యమకారుల త్యాగాలను స్మరించుకుంటూ, నేటి యువతరం ప్రజా సమస్యలపై పెద్ద ఎత్తున ఉద్యమాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ప్రపంచ బ్యాంకు సూచించిన సంస్కరణల పేరుతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ రంగంలో తీసుకొచ్చిన విధానాలు, విద్యుత్ ఛార్జీల పెంపు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు జరిగాయని గుర్తుచేశారు. వామపక్షాల ఆధ్వర్యంలో సాగిన పోరాటాలతో పాటు, కాంగ్రెస్ కూడా ఉద్యమాల్లో భాగస్వామ్యమైందని తెలిపారు. ఈ పోరాటంలో భాగంగా 2000 ఆగస్టు 28న జరిగిన బషీర్‌బాగ్ చలో అసెంబ్లీ కార్యక్రమంలో పోలీసు కాల్పులలో ముగ్గురు ఉద్యమకారులు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారని గుర్తుచేశారు. బషీర్‌బాగ్‌లో ఎగిరిన పోరాట జెండా నేడు ఢిల్లీలోనూ ఎగురుతోందని అన్నారు. భారతదేశ భవిష్యత్తు నేటి యువతరం చేస్తున్న పోరాటాలపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. దేశాన్ని తమ దుష్ట విధానాలతో మార్చవచ్చని భావిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంటి పాలకుల విధానాలకు యువతరం ప్రజా ఉద్యమాల ద్వారా అడ్డుకట్ట వేయాలని పిలుపునిచ్చారు. సమానత్వం, ప్రజాస్వామ్యం, ప్రజా సంక్షేమం ఆధారంగా నవ భారత నిర్మాణానికి యువత ముందుకు రావాలని ఆయన కోరారు.

CPM State Secretary V. Srinivasa Rao paying tribute to the martyrs

సంస్కరణల పేరుతో దేశాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెబుతున్న పాలకులు వాస్తవానికి దేశ వనరులను విదేశీ, ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తూ ప్రజా ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పాలనా విధానాలను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని, గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ప్రజానుకూలమైన విధానాలను అవలంబించాలని సూచించారు. ప్రస్తుత విధానాల్లో మార్పు లేకుండా కొనసాగితే ప్రజల్లో అసంతృప్తి మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇప్పటికే ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, వ్యవసాయ రంగ సంక్షోభం, కరువు పరిస్థితులు, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, నిరుద్యోగ సమస్య వంటి అనేక సమస్యలు ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని పేర్కొన్నారు. విద్యుత్ రంగంలోనే కాకుండా వివిధ రంగాల్లో కొనసాగుతున్న ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా యువతరం ఐక్యంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. బషీర్‌బాగ్ అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరోసారి ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని కోరారు. బషీర్‌బాగ్ అమరవీరుల స్ఫూర్తితో ప్రజా హక్కుల పరిరక్షణ కోసం, ప్రజానుకూల విధానాల కోసం యువతరం ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సంస్కరణ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్.బాబురావు, వై. వెంకటేశ్వరరావు, వి. ఉమామహేశ్వరరావు, కే.సుబ్బరావమ్మ, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు పద్మ, సిపిఐ నాయకులు ఖాదర్ బాషా, సిపిఎం నగర నేతలు బోయి సత్య బాబు, బి.రమణ రావు, పి.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్