శుక్రవారం, 28 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

వచ్చే నెలలో జెడ్పి పాలనకు తెర

1 గంట క్రితం

Zilla Parishad general meeting
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 28, 2026, 04:51 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ముగిసిన ఆఖరి సర్వసభ్య సమావేశం

సమస్యలపై సభ్యుల నిలదీత

చివరి సమావేశంలోనూ ప్రజాప్రతినిధులు,అధికారులు డుమ్మా 

ప్రజాశక్తి- కాకినాడ :జిల్లా పరిషత్ పదవీకాలం వచ్చే నెలతో ముగియనున్న నేపథ్యంలో శుక్రవారం ఆఖరి సర్వసభ్య సమావేశం చైర్మన్ వి. వేణు గోపాల్ అధ్యక్షతన జరిగింది. పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుతెన్నులు, పెండింగ్లో ఉన్న సమస్యల పైనా పలువురు సభ్యులు ప్రభుత్వం, అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులకు నిధులను కేటాయించడంలో పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం వహిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏలేరు ఆధునీకరణ జరగకపోవడంతో రైతులు తీవ్రస్థాయిలో నష్టాలను ఎదుర్కొంటున్నారని,ధాన్యం కొనుగోలులో సమస్యలను పరిష్కరించాలని జడ్పీ వైస్ చైర్మన్, పిఠాపురం జడ్పిటిసి బుర్రా అను బాబు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులపై జిల్లా కలెక్టర్ హరిందిర ప్రసాద్ మాట్లాడుతూ.. ఏలేరు ద్వారా శివారు ఆయకట్టు వరకు నీరు అందిస్తామని ఏలేరు ఆధునీకరణకు కోసం రూ. 800 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించామన్నారు. రంపచోడవరం జడ్పిటిసి పండా వెంకటలక్ష్మి మాట్లాడుతూ భూపతిపాలెం ప్రాజెక్టు ఆయకట్టు క్రింద 11 వేల ఎకరాలకుగాను 4 వేల ఎకరాలకు మాత్రమే నీరు అందుతుందని, మిగిలిన విస్తీర్ణానికి నీరందించాలని, ఐటీడీఏ పరిధిలో ఉన్న పాఠశాలలు నేటికీ అధ్వాన్నంగా ఉన్నాయని, నాడు-నేడు పనులు చేపట్టాలన్నారు. 59 నెలలు పాటు పదవీ కాలాన్ని పూర్తి వేసుకున్నప్పటికీ సభ్యుల గౌరవ వేతనాల విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందని ధ్వజమెత్తారు. రౌతులపూడి జడ్పిటిసి గొల్లు లక్ష్మణ మూర్తి మాట్లాడుతూ పలుచోట్ల చెరువుల అభివృద్ధి పనులు, జల్ జీవన్ పనులు చేపట్టినా నిధులు మంజూరు కాలేదన్నారు. తొండంగి జడ్పిటిసి మెరుగు పద్మలత మాట్లాడుతూ తీర ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజానీకానికి వారానికి ఒకరోజు మాత్రమే త్రాగునీరు వస్తున్న పరిస్థితులను ఆమె వివరించారు. మామిడికుదురు జడ్పిటిసి కే.ఆంజనేయులు మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా వాటర్ ట్యాంకులను ఏడాది క్రితమే నిర్మించినా నేటికీ ప్రారంభించకపోవడంతో ప్రజలకు పూర్తిస్థాయిలో త్రాగునీరు అందడం లేదన్నారు. కొత్తపేట జెడ్పిటిసి జి రమాదేవి మాట్లాడుతూ కొత్తపేట సిహెచ్సిలో డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేసినా కనీస సౌకర్యాలు కల్పించి ప్రారంభించలేదన్నారు. పిహెచ్సిలో భవనం పెచ్చులు ఊడిపోతున్నా పట్టించుకోవడంలేదని మండల జడ్పిటిసి సిహెచ్ వెంకటలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ సభ్యులు లేవనెత్తిన సమస్యలన్నింటిపైన అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలపై ప్రభుత్వం దృష్టిని సారించాలని కోరారు. సభ్యులు ప్రస్తావించిన సమస్యలన్నింటిపైనా అధికారులు దృష్టిలో ఉన్నాయని, కొన్నింటికి నిధుల కొరత ఉందని, మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయని, సభ్యుల గౌరవ వేతనాలు 12 నెలల కాలానికి రూ. 42 లక్షల బకాయిలు ఉన్నాయని జెడ్పి సీఈఓ లక్ష్మణమూర్తి బదులిచ్చారు.

మరోవైపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముగ్గురు ఎంపీలు, 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఒక్కరు కూడా హాజరు కాకపోవడం శోచనీయం. కేవలం ఇద్దరు ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణ, పేరాబత్తుల రాజశేఖర్ మాత్రమే పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్