శుక్రవారం, 28 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కాకినాడ విలీన గ్రామాల ఉద్యమంలో భాగంగా సిపిఎం కరపత్రం విడుదల

1 గంట క్రితం

CPM leaders unveiling a pamphlet
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 28, 2026, 04:28 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ఇంటింటి ప్రచారానికి శ్రీకారం

ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ రూరల్ లోని ఆరు గ్రామాలను కాకినాడ కార్పొరేషన్ లో విలీనం చేసి కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలని స్థానిక శాసనసభ్యులు పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ఇవ్వాలని సిపిఎం కోరింది. ఈ మేరకు సిపిఎం చేపట్టిన విలీన గ్రామాల నిరవధిక ఉద్యమంలో భాగంగా ఆరు గ్రామాల్లో ఇంటింటికి కరపత్రం ప్రచారానికి ముద్రించిన కరపత్రాన్ని కలెక్టర్ కార్యాలయం వద్ద పార్టీ విడుదల చేసింది. పార్టీ రూరల్ కమిటీ కన్వీనర్ తిరుమలశెట్టి నాగేశ్వరరావు కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ నిస్వార్థ అధికారి, ప్రజా సేవకుడు ఎస్.ఆర్.శంకరన్ ఆశయాలకు అనుగుణంగా విలీన గ్రామాల ఉద్యమాన్ని చేపట్టామని, దీనికి ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ అడ్వకేట్ పేపకాయల రామకృష్ణ మాట్లాడుతూ పదిహేనేళ్లుగా గ్రామాలకు ఎన్నికలు లేకపోవడం న్యాయం కాదని, 73, 74 రాజ్యాంగ సవరణకు భిన్నమన్నారు. సహజంగా కాకినాడ నగరం విస్తరించాలన్నా, నూతనంగా అభివృద్ధి కావాలన్నా చుట్టుపక్కల గ్రామాలు విలీనం కాకుండా ఇది సాధ్యం కాదన్నారు. గ్రామాల విలీనానికి ఏ రాజకీయ పార్టీ వ్యతిరేకించడం లేదని, కానీ విలీన ప్రక్రియలో చొరవ చూపడం లేదని, కావున ఐక్యంగా అందరూ ఇందుకు కృషి చేయాలన్నారు. గ్రామాల విలీనానికి సిపిఎం చేపట్టిన ఉద్యమానికి మద్దతు తెలియజేసి ప్రజల విజ్ఞప్తిని పాలకులు నెరవేర్చాలని అయన కోరారు. ఆరు గ్రామాలకు చట్టబద్ధమైన ప్రజాపాలన లేకపోవడంతో రావలసిన నిధులు ఆగిపోయి అభివృద్ధి కుంటుపడిందని, ప్రజలు మౌలిక వసతులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక కార్యకర్త పూర్వ కాకినాడ కౌన్సిలర్ దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ మొదటి నుండి విలీన గ్రామాలను కార్పొరేషన్ లో విలీనం చేయాలని సిపిఎం నికరంగా ఉద్యమాలు కొనసాగిస్తూనే ఉందని కొనియాడారు. సిపిఎం నాయకులు చింతపల్లి అజయ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజలను చైతన్య పరిచేందుకే వేలాది కరపత్రాలు ఇంటింటికి పంపిణీ చేస్తామని తెలిపారు.

కార్యక్రమానికి ముందుగా మహనీయుడు ఎస్.ఆర్.శంకరన్ విగ్రహానికి మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు ఎం. రామ్మోహన్, టి నాగేశ్వరరావు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమాన్ని సిపిఎం నాయకులు పెద్దింశెట్టి రామకృష్ణ సమన్యయం చేయగా ప్రజా సంఘాల నాయకులు టి. రాజా, జుత్తుగ శ్రీనివాసరావు, సత్యనారాయణరెడ్డి, జోగా అప్పారావు, ఏ.వీ.కృష్ణాజీ, ఆర్ఎస్పీ నాయకులు సతీష్, నాని, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్