mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎస్‌ఐఆర్ పేరుతో అర్హులైన ఓటర్లను తొలగించే ప్రమాదం

2 రోజుల క్రితం

ch baburao
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 16, 2026, 05:03 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి – విజయవాడ: ప్రత్యేక సమగ్ర పరిశీలన (ఎస్‌ఐఆర్) పేరుతో అర్హులైన ఓటర్లను ఓటరు జాబితా నుంచి తొలగించే ప్రమాదం ఉందని, దీనికి కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ పూర్తి బాధ్యత వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సిహెచ్ బాబూరావు అన్నారు. సోమవారం విజయవాడలోని అజిత్‌సింగ్ నగర్, పాయికాపురం తదితర ప్రాంతాల్లో పర్యటించిన ఆయన, ఓటరు జాబితాల పరిశీలన చేపడుతున్న అధికార బృందాల పనితీరును సమీక్షించి స్థానిక ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2002 ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకుని ఎస్‌ఐఆర్ నిర్వహించడం వల్ల అనేక మంది ఓటు హక్కు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 2002 జాబితాలో లేని సుమారు 24 శాతం మంది, అంటే 42 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కొనసాగించుకోవడానికి అనేక పత్రాలు సమర్పించాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. సాధారణ ప్రజలకు సులభంగా అందుబాటులో లేని పత్రాలను తప్పనిసరి చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్ పేరుతో లక్షలాది మంది అర్హులైన ఓటర్లను తొలగించారని ఆరోపిస్తూ, రాష్ట్రంలోని పేదలు, బలహీన వర్గాలు, సామాన్య ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నదని పేర్కొన్నారు. పలు ప్రాంతాల్లో అధికారులు ఉదయం 10 గంటల తర్వాతే పరిశీలనకు వస్తుండటంతో ప్రజలు తమ ఉపాధి పనులకు వెళ్లిపోతున్నారని, అందువల్ల సిబ్బంది సంఖ్యను పెంచి ఉదయం 7 గంటల నుంచే పరిశీలన చేపట్టాలని సూచించారు. చిన్న అక్షర దోషాలు ఉన్నా 2002 ఓటరు జాబితాతో సరిపోల్చడం కష్టమవుతోందని, కొన్ని అధికార బృందాల వద్ద పూర్తి సమాచారం కూడా అందుబాటులో లేకపోవడం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రజలకు పత్రాల ప్రక్రియలో సహకరించేందుకు అదనపు సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. గ్రామ సభలు నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన ఆధారాలు అందుబాటులో లేకపోయినా గ్రామ సభల ధృవీకరణ ఆధారంగా ఓటు హక్కు కల్పించాలని కోరారు. రాష్ట్రంలో ఒక్క అర్హుడైనా ఓటు హక్కు కోల్పోతే అందుకు అధికార ఎన్డీఏ కూటమి బాధ్యత వహించాలని బాబురావు అన్నారు. కేంద్రంలో ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్న తెలుగుదేశం, జనసేన పార్టీలు బిజెపిని, సర్ ను, ఎన్నికల కమిషన్ ఏకపక్ష చర్యలను ఒక వైపున సమర్థిస్తూ, మరొకవైపున ఓటర్లను తొలగిస్తారని ఆందోళన వ్యక్తం చేయటం గర్హనీయమన్నారు. అలాగే దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఓటర్ల తొలగింపుపై స్పందించని వైసిపి కూడా తన బాధ్యత నుంచి తప్పించుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్నికల కమిషన్ చర్యలపై వైసీపీ ఇప్పటికైనా స్పష్టమైన వైఖరి ప్రకటించాలని కోరారు. ప్రజలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు అప్రమత్తంగా ఉండి అర్హులైన ఓటర్లను తొలగించే చర్యలను అడ్డుకోవాలని, ప్రజల్లో చైతన్యం కల్పించి ఓటు హక్కును పరిరక్షించేందుకు ఉద్యమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే ఎస్‌ఐఆర్ అమలులో తలెత్తుతున్న సమస్యలను ఎన్నికల కమిషన్ వెంటనే గుర్తించి, నిబంధనలను సవరించి అందరికీ ఓటు హక్కు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్