ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్: అభివృద్ధి చేశామని చెప్పి ఓట్లు అడిగే ధైర్యం లేక ఎస్ఐఆర్ పేరుతో ఓట్లు తొలగించి, దొడ్డిదారిన అధికారంలోకి వచ్చేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ప్రతి ఒక్కరూ దీనిపై అప్రమత్తంగా ఉండాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి రాంభూపాల్ అన్నారు. ఎస్ఐఆర్ పేరుతో ఓటరు జాబితా సవరణ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో అనంతపురం సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో, సిపిఎం నగర కార్యదర్శి వి.రామిరెడ్డి అధ్యక్షతన పాత ఆర్డిఒ కార్యాలయం ప్రాంగణంలో బుధవారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాంభూపాల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఎస్ఐఆర్ మొదటి విడతలో తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహించారని, 5.50 కోట్ల ఓట్లు తొలగింపునకు గురయ్యాయన్నారు. ప్రస్తుతం రెండో విడతలో 16 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ కార్యక్రమం నిర్వహించి మరో పది కోట్ల ఓట్లను తొలగించే కుట్రను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. ఎస్ఐఆర్ పేరుతో ముస్లిం, మైనార్టీలు, దళిత క్రిస్టియన్ల ఓట్లను తొలగించేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని తెలిపారు. ఓట్ల తొలగింపు జరిగితే భవిష్యత్తులో ప్రజలకు అందే సంక్షేమ పథకాలను కూడా తొలగించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. మునుముందు పౌరసత్వాన్ని కూడా కోల్పోయే పెను ముప్పు పొంచి ఉందన్నారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యం తీవ్ర ప్రమాదంలో కొట్టుమిట్టాడుతోందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటరు గుర్తింపు కార్డులు భద్రంగా పెట్టుకోవాలన్నారు. రాష్ట్ర ముతవల్లీల అధ్యక్షులు షకీల్ షఫీ మాట్లాడుతూ ఓటర్లు ప్రభుత్వాలను ఎన్నుకునే రోజు నుంచి ప్రభుత్వమే ఓటర్లను నిర్ణయించే దుస్థితికి దేశం పరిస్థితులు రావడం విచారకరమన్నారు. సిపిఎం సీనియర్ నాయకులు జి ఓబులు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మతతత్వ రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య చీలికలు తెస్తోందని విమర్శించారు. వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శివర్గ సభ్యులు వలి, ప్రకాష్, ముత్తుజ, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపునకు కుట్రలు
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 18, 2026, 01:03 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం








కామెంట్లు (0)