జులై తొలివారంలో తల్లికి వందనం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో వేసవి సెలవులు అనంతరం పాఠశాలలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 24 నుంచి బడులకు వేసవి సెలవులు ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రతియేటా బడులు ప్రారంభమయ్యే నాటికి సిద్ధమవుతుండగా, ఇప్పటి వరకు రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సిఇఆర్‌టి) అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేయకపోవడం గమనార్హం. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లలో యూనిఫాం, బ్యాగు, బూట్లు అందించడం లేదు. పశ్చిమ దేశాల్లో నెలకొన్న యుద్ధం కారణంగా నెలరోజులు ఆలస్యంగా అందిస్తామని సమగ్రశిక్ష ఇప్పటికే వెల్లడించింది. కిట్‌లోని పాఠ్యాంశ పుస్తకాలు, నోట్ పుస్తకాలు, డిక్షనరీ వంటివి అందిస్తామని వెల్లడించింది. మెగా పిటిఎం నాటికి మిగిలిన వస్తువులను అందిస్తామని చెప్పింది. గతేడాది పాఠశాలలు ప్రారంభం రోజునే అమలు చేసిన తల్లికి వందనం కూడా ఈ ఏడాది ఆలస్యం కానుంది. ఈ పథకం అమలు చేసేందుకు నిధుల కొరత ఉందని అధికారులు చెబుతున్నారు. అవసరమైన నిధులను ఆర్థికశాఖ సమీకరించు కుంటోందని అంటున్నారు. జులై తొలివారంలో తల్లుల ఖాతాల్లో ఈ పథకం నిధులను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో గదుల కొరత
కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో తరగతి గదుల కొరత వేధిస్తోంది. రాష్ట్రవ్యాపంగా 9,654 ప్రాథమిక పాఠశాలలను మోడల్‌గా మార్చిన ప్రభుత్వం ప్రతి తరగతికి ఒక టీచర్‌ను కేటాయించింది. ఇందుకు అవసరమైన తరగతి గదులను మాత్రం పట్టించుకోలేదు. ఈ పాఠశాలల్లో సుమారు 20 వేల అదనపు తరగతి గదులు అవసరమని అంచనా వేసిన విద్యాశాఖ అందుకు సుమారు రూ.560 కోట్లు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదలు పంపింది. ఈ ప్రతిపాదనలను ఆమోదించిన ప్రభుత్వం నిధుల మంజూరుకు ఆదేశాలిచ్చిందే తప్ప నిధులు విడుదల చేయలేదు. దీంతో ఒకే గదిలో రెండు, మూడు తరగతులను బోధించాల్సిన పరిస్థితి నెలకొంది.
బోధనేతర పనులు ఈ ఏడాదైనా మినహాయిస్తారా?
ఉపాధ్యాయులకు బోధనేతర పనుల నుంచి ఈ ఏడాదైనా మినహాయింపు ఇస్తారా? లేదా? అని ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు. ఈ పనుల నుంచి మినహాయింపు ఇస్తామని చెబుతున్న ప్రభుత్వం.. ఆచరణలో మాత్రం పాటించడం లేదు. యాప్‌ల పేరుతో విద్యార్థుల హాజరు, మరుగుదొడ్లు నిర్వహణ ఫొటోలు, విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసే ఫొటోలు, కిట్ల పంపిణీ వంటి ఫొటోలను యాప్‌లలో అప్‌లోడ్ చేయాలని ఉపాధ్యాయులకు వివిధ పనులను అప్పగిస్తోంది. ఈ బోధనేతర పనులను మినహాయించిన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు.









కామెంట్‌లు (0)