mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బిసి రిజర్వేషన్లపై వినతుల స్వీకరణ

1 రోజు క్రితం

bc
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 18, 2026, 12:39 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

పారదర్శకంగా జరగడం లేదు : ఎమ్మెల్సీ చంద్రగిరి

ప్రజాశక్తి-గుంటూరు : గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థల్లో బిసి రిజర్వేషన్ల అమలుకు సంబంధించి అధ్యయనం నిర్వహిస్తున్న డెడికేటెడ్‌ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా బుధవారం గుంటూరులోని ఎస్ఆర్ శంకరన్ హాల్‌లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, బిసి సంఘాల నుండి వినతులు సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని స్థానిక సంస్థలలో బిసి రిజర్వేషన్ల కల్పన, బిసి సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత, స్థానిక పాలనలో వారి ప్రాతినిధ్యం పెంపు తదితర అంశాలపై అభిప్రాయాలను సేకరించారు. వివిధ వర్గాల నుంచి అందిన వినతులు, సూచనలను సమగ్రంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక సంస్థలలో బిసి రిజర్వేషన్లకు సంబంధించిన వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి, అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని సమగ్ర నివేదిక రూపొందించడం ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశమని చైర్మన్ పేర్కొన్నారు. అన్ని గ్రామాల్లోని ఎస్‌‌సి, ఎస్‌‌టి, బిసి జనాభా వివరాలు అందజేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డిఆర్‌ఒ ఖాజావలి, ఆర్ డిఒ శ్రీనివాస రావు, జిల్లా బిసి వెల్ఫేర్ అధికారి మయూరి, జడ్‌‌పి సిఇఒ జ్యోతిబసు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


​వివిధ సంఘాల వినతులు..

కమిషన్‌ ‌చైర్మన్‌‌కు అనేక బిసి సంఘాలు వినతులు అందజేశాయి. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో బిసి రిజర్వేషన్ల నిర్ణయం పారదర్శకంగా జరగట్లేదన్నారు. ఎవరికి సీటు కావాలో వారి రిజర్వేషన్‌ ‌వస్తుందని ఆరోపించారు. సంచార జాతాలు ఎక్కడ ఉన్నా వారికి ఓటు హక్కు కల్పించే చర్యలు తీసుకోవాలని కోరారు. ఎపి బిసి చైతన్య సమితి నాయకులు సిహెచ్ వాసు మాట్లాడుతూ స్థానిక సంస్థల్లోనూ బిసిలకు ఎబిసిడి వర్గీకరణ ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. ఎపి బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకరరావు మాట్లాడుతూ రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగించి, జనాభా దామాషా ప్రకారం బిసి రిజర్వేషన్లు పెంచే విధంగా సిఫార్సు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. బిసిలకు న్యాయం జరగాలంటే జనగణనలో కుల గణన తప్పనిసరిగా జరగాలన్నారు. రెండు దశల్లో జరిగే జనగణనలో మొదటి దశలో బిసి గృహగణన కాలం లేకపోవటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. బిసిల స్థితిగతులను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. విద్య, ఉద్యోగ రంగాల రిజర్వేషన్లను వర్గీకరించినట్లే, స్థానిక రిజర్వేషన్లను ఎబిసిడిలుగా వర్గీకరించాలన్నారు. కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు, యువజన రాష్ట్ర అధ్యక్షులు పారేపల్లి మహేష్, ప్రధాన కార్యదర్శి కొల్లూరి హనుమంతరావు, వివిధ బిసి సామాజిక తరగతులకు చెందిన నాయకులు వినతులు అందజేశారు. ​


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్