గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

టర్కీలో నాటో వ్యతిరేక నిరసనలు

2 రోజుల క్రితం

turkey
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 07, 2026, 06:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- వామపక్ష కార్యకర్తల అరెస్ట్‌

అంకారా : టర్కీ రాజధాని అంకారాలో మంగళ, బుధ వారాలలో నాటో(ఎన్‌‌ఎటిఎఒ) శిఖరాగ్ర సదస్సు జరగనున్న నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీ ( టికెపి) నేతృత్వంలో ఆదివారం నిరసన ప్రదర్శన జరిగింది. వంద మందికి పైగా ప్రదర్శకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని టికెపి తెలిపింది. నాటో సదస్సుకు 32 టర్కీ మిత్రదేశాల నాయకులు, నాటో భాగస్వామ్య దేశాల అధికారులు హాజరవుతారు. సమావేశాలను పురస్కరించుకొని రాజధాని అంకారాలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. ప్రదర్శనలను నిషేధించారు. పలు ప్రాంతాలలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. రహదారులు మూసివేశారు. భద్రతా వలయాలను ఛేదించుకొని ప్రధాన కిజిలే స్క్వేర్‌ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించామని టికెపి ఓ ప్రకటనలో తెలియజేసింది.

మిన్నంటిన నినాదాలు

'హంతకుడా...నాటో...దేశం విడిచిపో', 'నాటోకు ప్రవేశం లేదు' వంటి నినాదాలతో కిజిల్‌ స్క్వేర్‌ మార్మోగిపోయింది. ప్రదర్శకులు జెండాలు చేతపట్టుకొని భారీగా తరలి వచ్చారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. టికెపి ఆధ్వర్యంలో ఇస్తాంబుల్‌లోని తక్సిమ్‌ స్క్వేర్‌ నుంచి డోల్మాబాహే వరకూ మరో ప్రదర్శన జరిగింది. కాగా కడికోరు జిల్లాలో కూడా వామపక్ష బృందాలు వేర్వేరుగా రెండు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. భారీ పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ ఇస్తాంబుల్‌లో ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోలేదు. నాటోకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు అనేక ప్రాంతాలలో సమావేశమయ్యామని టీకేపీ సెక్రటరీ జనరల్‌ కెమల్‌ ఒకుయన్‌ చెప్పారు. అంకారాను నాటోకు అప్పగించబోమని, రాజధానిని మౌనంగా ఉండనివ్వబోమని చాటిచెప్పామని అన్నారు. కాగా టర్కీలో ఉగ్రవాదుల ఏరివేత పేరుతో అధికారులు స్వతంత్ర మీడియా సంస్థల ప్రతినిధులు, హక్కుల కార్యకర్తలు, విద్యావేత్తలను అదుపులోకి తీసుకుంటున్నారు. గత నెలలో అంకారాలో 103 మందిని అరెస్ట్‌ చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్