- విరిగిపడిన కొండచరియలు
- 11మంది మృతి
- హుబే ప్రావిన్స్‌లోని తుపానులు, భారీ ఈదురుగాలులు బీభత్సం
బీజింగ్ : చైనాలో రుతుపవన వర్షాలు సోమ, మంగళవారాల్లో తీవ్ర బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం, వరదలు వంటి వివిధ ఘటనల కారణంగా సుమారు 11 మంది మరణించారు. మరో 331 మంది గాయపడ్డారు. హుబే, గ్వాంగ్జీ ప్రాంతాల్లో కొందరు ప్రాణాలు కోల్పోయారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. ప్రభావిత ప్రజలను రక్షిత ప్రాంతాలకు తరలించారు. చైనా అధ్యక్షులు షీ జిన్‌పింగ్ పరిస్థితిని సమీక్షించి సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. వాయువ్య చైనాలోని గాన్సు ప్రావిన్స్ లాంగ్నన్ నగర పరిధిలోని నాన్హే టౌన్‌షిప్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 33 మంది మట్టిదిబ్బల కింద చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. ఇప్పటివరకు 17 మందిని సురక్షితంగా బయటకు తీసినట్లు ప్రభుత్వ మీడియా వెల్లడించింది. మిగిలిన 16 మందిని గుర్తించేందుకు నిరంతరం గాలింపు కొనసాగుతోందని తెలిపాయి. కొండచరియలు విరిగిపడటానికి గల కచ్చితమైన కారణాలను అధికారులు పరిశీలిస్తున్నారు. సహాయక చర్యల కోసం భారీ యంత్రాలు, ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. హువాంగ్‌గాంగ్‌లోని హువాంగ్‌జౌ ప్రాంతంలో 275 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా 408 మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హువాంగ్‌గాంగ్ నగరంలో భారీ గాలుల కారణంగా ఒక గిడ్డంగి పూర్తిగా ధ్వంసమైంది. పలుచోట్ల ట్రక్కులు బోల్తాపడగా, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. చెట్లు విరిగిపడటంతో రహదారులపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది.
దక్షిణ చైనాలోని గ్వాంగ్జీ ప్రావిన్స్‌లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. మైసాక్ తుపాను ప్రభావంతో కుండపోత వర్షాలు కురవడంతో విస్తృతంగా వరదలు సంభవించాయి. ఈ వరదల్లో నలుగురు మరణించగా, మరో ఎనిమిది మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం సాయంత్రం నాటికి సుమారు 48 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా, 55 వేల మందికిపైగా వరదల ప్రభావానికి గురయ్యారు.
బంగ్లాదేశ్‌లోనూ ఇదే పరిస్థితి
ఇదిలా ఉండగా బంగ్లాదేశ్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సంభవించిన కొండచరియల విపత్తులో ఐదుగురు పిల్లలతో సహా కనీసం 8 మంది రోహింగ్యా శరణార్థులు మృతి చెందారని అధికారులు తెలిపారు. ఆదివారం నుంచి అనేక కొండచరియలు విరిగిపడిడంతో సహాయక బృందాలు ఏడు మృతదేహాలను వెలికితీశారు.








కామెంట్‌లు (0)