అట్లాంటా: అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో భారతీయ-అమెరికన్, గూగుల్ మాజీ అధికారిణి షీతల్ వ్రెజియన్‌ని ఆమె భర్త కాల్చి చంపారు. ఈ ఘటనలో వారి కుమారుడు జాసన్ గాయపడినట్లు అధికారులు తెలిపారు. జార్జియా రాష్ట్రంలోని కాబ్ కౌంటీ పరిధిలోని స్మిర్నా నగరంలోని లారెల్ క్రీక్ ట్రైల్‌లో ఉన్న నివాసంలో స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. కాబ్ కౌంటీ పోలీస్ డిపార్ట్‌మెంట్ తెలిపిన వివరాల ప్రకారం, రాత్రి 8 గంటలకు కొద్దిసేపటి ముందు ఇంట్లో కాల్పులు జరిగినట్లు అత్యవసర సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంట్లో షీతల్ వ్రెజియన్ తుపాకీ గాయాలతో పడి ఉండగా గుర్తించారు. ఆమెను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్థారించారు. కాల్పుల్లో గాయపడిన వారి కుమారుడు జాసన్‌కు చికిత్స అందిస్తున్నారు. అతని ఆరోగ్య పరిస్థితిపై అధికారులు పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఘటన అనంతరం షీతల్ భర్త కిర్క్ బి. వ్రెజియన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై హత్య, రెండు దాడి కేసులు, ఆయుధాన్ని కలిగి ఉండటం సహా మరో రెండు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం అతన్ని కాబ్ కౌంటీ అడల్ట్ డిటెన్షన్ సెంటర్‌లో నిర్బంధించారు.
ఈ ఘటనతో స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. దంపతుల ఇంటి సమీపంలో 20 ఏళ్లకు పైగా నివసిస్తున్న జోన్ ఆండర్సన్ మాట్లాడుతూ, "అక్కడ ఏం జరుగుతుందో మొదట అర్థం కాలేదు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడిందా అనుకున్నాను. ఇలాంటి ఘటన జరుగుతుందని ఊహించలేదు" అని స్థానిక మీడియాకు తెలిపారు. కాల్పులకు దారితీసిన కారణాలపై కాబ్ కౌంటీ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబ కలహాలా, లేక మరే ఇతర కారణాలున్నాయా అనే కోణంలో విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.








కామెంట్‌లు (0)