మార్పు రాకపోతే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవంటున్న కాకినాడ జిల్లా పోలీసులు
ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్‌ల పరిధిలో రౌడీషీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నివారణ, ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. కౌన్సెలింగ్ సందర్భంగా రౌడీషీటర్లకు చట్టాన్ని గౌరవిస్తూ బాధ్యతాయుతమైన జీవనం గడపాలని సూచించడం జరిగిందన్నారు. వ్యక్తిగత కక్షలు, భూ వివాదాలు, బెదిరింపులు, దౌర్జన్యాలు, జూదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సంఘ విద్రోహ కార్యకలాపాలు వంటి ఎలాంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడరాదని హెచ్చరించడం జరిగిందన్నారు. నేరాలకు దూరంగా ఉండి ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కుటుంబ సభ్యులతో కలిసి గౌరవప్రదమైన జీవితం గడపాలని సూచించడం జరిగిందన్నారు. రౌడీషీటర్ల ప్రతి కదలికపై జిల్లా పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతున్నారని, ఎవరైనా మళ్లీ నేర కార్యకలాపాలకు పాల్పడినట్లు గుర్తించినట్లయితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైన నిబంధనల మేరకు బైండోవర్ చర్యలు, ఇతర చట్టపరమైన చర్యలు కూడా చేపడతామని హెచ్చరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, స్టేషన్ హౌస్ అధికారులు పాల్గొని తమ పరిధిలోని రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించి, పలు సూచనలు చేశారన్నారు.







కామెంట్‌లు (0)