వాషింగ్టన్ : దోమల ‘విఐపి లిస్ట్’లో మీ పేరుందా ? ఇదేం ప్రశ్న అని అనుకోకండి .. దోమలు కూడా 'విఐపి లిస్ట్' తయారు చేసుకుంటాయట! అందులో మీ పేరు ఉంటే, పక్కనే పది మంది ఉన్నా మిమ్మల్నే వెతుక్కుంటూ వస్తాయని శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. కానీ దానికి కారణం మీ రక్తం తీయగా ఉండటం కాదు, మీ శరీరమే వాటికి ఆహ్వానం పంపుతుందట. ఇదే విషయాన్ని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఒక వ్యక్తి శరీరం విడుదల చేసే కార్బన్ డయాక్సైడ్, శరీర వేడి, చర్మం నుంచి వచ్చే వాసనలు, చర్మంపై ఉండే సూక్ష్మజీవులు వంటి అనేక జీవసంబంధ సంకేతాల ఆధారంగానే దోమలు తమ లక్ష్యాన్ని ఎంచుకుంటాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయని స్పష్టం చేశారు. ఆడ దోమలు మాత్రమే మనుషులను కుడతాయి. గుడ్ల అభివృద్ధికి అవసరమైన ప్రోటీన్‌ను రక్తం ద్వారా పొందేందుకు అవి మనుషులపై దాడి చేస్తాయి. దాదాపు 10 మీటర్ల దూరం నుండి ఒక వ్యక్తి శ్వాస ద్వారా విడుదల చేసే కార్బన్ డయాక్సైడ్‌ను గుర్తించి, దాని ఆధారంగా అతడిని వెతకడం ప్రారంభిస్తాయి. పెద్దవారు పిల్లల కంటే ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ విడుదల చేయడంతో వారినే ఎక్కువగా కుడుతుంటాయి. శరీర వేడి కూడా దోమలను ఆకర్షించే ప్రధాన కారణాల్లో ఒకటి. గర్భిణీ స్త్రీలు, వ్యాయామం చేసినవారు, అధిక శారీర శ్రమ చేసిన వారి నుండి ఎక్కువ వేడి, కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది. దీంతో వారిని దోమలు లక్ష్యంగా ఎంచుకుంటాయి. అలాగే అధిక బరువు ఉన్న వారిలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. చర్మంపై ఉండే సూక్ష్మజీవులు కార్బోహైడ్రేట్లు, కొవ్వు ఆమ్లాలు, పెప్టైడ్‌లను విచ్ఛిన్నం చేసి అస్థిర సేంద్రీయ సమ్మేళనాలు (విఒసిఎస్)గా మారుస్తాయి. వీటిలో అమ్మోనియా, లాక్టిక్ ఆమ్లం, ముఖ్యంగా కార్బాక్సిలిక్ ఆమ్లాల వాసన దోమలను బలంగా ఆకర్షిస్తుందని పరిశోధనలు నిర్ధారించాయి.
64 మంది వ్యక్తుల చర్మం నుండి వచ్చే వాసనలను పరీక్షించగా.. అధిక కార్బాక్సిలిక్ ఆమ్లాలు విడుదల చేసే వ్యక్తుల వైపే దోమలు ఎక్కువగా ఆకర్షితులయ్యాయని అమెరికాలోని రాక్‌ఫెల్లర్ విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనం తెలిపింది. చర్మంపై ఉండే సూక్ష్మజీవుల రకం కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. నెదర్లాండ్స్‌లోని వాగెనింగెన్ విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం, మలేరియా దోమలను ఎక్కువగా ఆకర్షించే వ్యక్తుల చర్మంపై ప్రత్యేక రకమైన బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటాయి. కవలలపై చేసిన పరిశోధనల్లో కూడా దోమలను ఆకర్షించే లక్షణాలు కొంతవరకు జన్యుపరంగా సంక్రమిస్తాయని వెల్లడైంది. అయితే దోమ కాటు అందరికీ ఒకే విధంగా ప్రభావం చూపదు. కొందరికి చిన్న ఎర్రటి మచ్చ మాత్రమే వస్తే, మరికొందరికి పెద్ద బొబ్బలు, తీవ్రమైన దురద, వాపు కనిపిస్తాయి. ఇది వారి రోగనిరోధక వ్యవస్థ, జన్యుపరమైన లక్షణాలపై ఆధారపడి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో తామే ఎక్కువగా దోమల బారిన పడుతున్నామని కొందరికి అనిపించినా, వాస్తవానికి వారి శరీరం దోమల కాటుకు ఎక్కువగా స్పందించడం కూడా ఒక కారణం కావచ్చు. అంటే దోమలను ఆకర్షించడంలో "తీపి రక్తానికి ఎటువంటి సంబంధం లేదని తేలింది. ఏదేమైనా ప్రతి ఒక్కరూ దోమల నివారణ చర్యలు పాటించడం అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దోమల ‘విఐపి లిస్ట్’లో మీ పేరుందా ?
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 12, 2026, 06:04 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)