ఆదివారం, 12 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

రెండేళ్ల కూటమి పాలనలో జిల్లాకు ఒరిగిందేమీలేదు : సిహెచ్.బాబూరావు

2 గంటల క్రితం

Nothing has been achieved for the district during the two years of the alliance's rule: Ch. Babu Rao.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 12, 2026, 05:26 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

విజయవాడ : గత రెండు రోజులుగా కొండపల్లిలో సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యకర్తల శిక్షణా శిబిరాల ముగింపు సందర్భంగా నేడు జరిగిన పత్రిక విలేకరుల సమావేశంలో బాబురావు, జిల్లా కార్యదర్శి డీవీ.కృష్ణ మాట్లాడారు. బాబురావు, డివి కృష్ణ మాట్లాడుతూ .... రెండేళ్ల కూటమి పాలనలో ఎన్టీఆర్ జిల్లాకు ఒరిగిందేమీ లేదని, జిల్లాపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో రెండేళ్ల కూటమి ప్రభుత్వం, కేంద్రంలో 12 ఏళ్ల ఎన్డీఏ పాలన కొనసాగుతున్నప్పటికీ ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఎన్టీఆర్ జిల్లా క్యాపిటల్ రీజియన్ పరిధిలో అత్యధిక మండలాలు ఉన్న జిల్లా. రాజధాని అమరావతికి సంబంధించిన అనేక కార్యకలాపాలు విజయవాడ కేంద్రంగా ఇప్పటికీ కొనసాగుతున్నప్పటికీ, ఈ రెండేళ్లలో జిల్లాకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదన్నారు. ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు మాత్రమే లబ్ధి పొందారని, సాధారణ ప్రజలకు మాత్రం న్యాయం జరగలేదని విమర్శించారు. జిల్లాలో అభివృద్ధి కంటే అవినీతి, అక్రమాలు పెరిగాయని, మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై స్పందించడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు కూడా ఎన్టీఆర్ జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. క్యాపిటల్ రీజియన్ పేరుతో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలను అభివృద్ధి చేస్తామని తెలుగుదేశం పార్టీ చెబుతుండగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారం చేసుకుంటోందన్నారు. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం కానీ, ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం కానీ సీఆర్డీఏ పరిధిలో చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏదీ చేయలేదని పేర్కొన్నారు. గతంలో ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ కూడా ఎన్టీఆర్ జిల్లాలో గణనీయమైన అభివృద్ధి చేయలేదని విమర్శించారు. జిల్లాలోని కూటమి నాయకులు ఒకరిపై ఒకరు అవినీతి, అక్రమాల ఆరోపణలు చేసుకుంటున్నారని, వాటిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. గతంలో కేశినేని నాని, ప్రస్తుతం కేశినేని చిన్ని టీడీపీ తరఫున ఎంపీలుగా ఎన్నికయ్యారని గుర్తు చేస్తూ, ఆరోపణలపై నిగ్గు తేల్చి, ప్రభుత్వం బాధ్యత వహించి, చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో మౌలిక సమస్యలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. వందల మందికి ఉపాధి కల్పించే ఒక్క కొత్త పరిశ్రమను కూడా తీసుకురాలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఎన్టీఆర్ జిల్లాలో ఎంతమందికి కొత్త ఉద్యోగాలు కల్పించిందో వెల్లడించాలని డిమాండ్ చేశారు. రెండేళ్లలో ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. ఈ పాలనలో ఏ వర్గం ప్రజలు సంతృప్తిగా లేరని, అధికార పార్టీ నాయకులు మాత్రమే లబ్ధి పొందుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం ప్రచార కార్యక్రమాలు, ఈవెంట్ల నిర్వహణకే పరిమితమైందని, వాస్తవ అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదన్నారు. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలను పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. ఉపాధి హామీ పథకంలో పని దినాలను సగానికి తగ్గించినా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. కొత్త పరిశ్రమలు రాకపోగా, విజయవాడ ఆటోనగర్ ఇండస్ట్రియల్ ఏరియా, ఇబ్రహీంపట్నం, కొండపల్లి పారిశ్రామిక ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న పరిశ్రమలు మూతపడుతున్నాయని, దీంతో వేలాది మంది ఉపాధి కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ కొండూరు, గంపలగూడెం మండలంలో కిడ్నీ వ్యాధితో 300 మంది మరణించారు. ఇంకా మరణిస్తూనే ఉన్నారు. అయినా ప్రజారోగ్యాన్ని పాలకులు గాలికి వదిలేసారు. వినగడప వద్ద కట్టలేరు వంతెన, ఇతర అనేక బ్రిడ్జిలు నిర్మాణానికి నోచుకోలేదు. భూసేకరణ పై ఉన్న శ్రద్ధ పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయింపు, గృహ నిర్మాణంపై లేదు. ప్రజా సమస్యలపై తమ పార్టీ ఇప్పటికే అనేక రూపాల్లో పోరాటం చేస్తోందని, రాబోయే రోజుల్లో ప్రజలను కలుపుకొని మరింత ఉధృతంగా ఉద్యమాలు చేపట్టి, ప్రజాప్రతినిధులను నిలదీస్తామని హెచ్చరించారు. ఈ ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ జిల్లా సిపిఎం కార్యదర్శి కామ్రేడ్ డివి. కృష్ణ, కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఎన్ సి హెచ్. శ్రీనివాస్, పి వి. ఆంజనేయులు, కొండపల్లి సిపిఎం పట్టణ కార్యదర్శి యం మహేష్, సీనియర్ నాయకులు ఎ విఠల్ రావు తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్