ఆదివారం, 12 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

హైకోర్టు ఉత్తర్వులు ధిక్కరించిన కూటమి ప్రభుత్వం

2 గంటల క్రితం

ycp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 12, 2026, 07:01 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- వైసిపి లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : హైకోర్టు ఉత్తర్వులను కూటమి ప్రభుత్వం ధిక్కరించిందని, రైతుల భూములపై కూటమి ప్రభుత్వ దండయాత్ర చేస్తూ పచ్చని పంటపొలాలను బుల్డోజర్లతో ధ్వంసం చేయడం దుర్మార్గమని వైసిపి లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం. మనోహర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉండవల్లిలో రైతుల పట్ల కూటమి ప్రభుత్వం అమానుషంగా వ్యవహరించిందని మండిపడ్డారు. పోలీసులు బుల్డోజర్లను పెట్టి సన్న, చిన్నకారు రైతుల పచ్చని పంటలను ధ్వంసం చేస్తూ, బలవంతంగా భూములను లాక్కోవడం అత్యంత దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ భూసేకరణ ప్రక్రియపై హైకోర్టులో రిట్ పిటిషన్ పెండింగ్‌లో ఉండగా, న్యాయస్థానం తుది తీర్పు ఇవ్వకముందే ప్రభుత్వం వీకెండ్‌ను ఎంచుకుని పక్కా వ్యూహంతో ఈ భూకబ్జాకు పాల్పడిందని అన్నారు. న్యాయస్థానాల పట్ల కనీస గౌరవం లేకుండా కోర్టు ధిక్కారానికి పాల్పడుతున్న కూటమి ప్రభుత్వ రాక్షస చర్యలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు. రైతులు తమ అభ్యంతరాలు చెప్పినా కనీసం పరిగణనలోకి తీసుకోకుండా, వాటిని రిజెక్ట్ చేసి హడావిడిగా రోడ్డు వేస్తున్నారని తెలిపారు. సీడ్ యాక్సెస్ రోడ్డులో జరిగింది 2 ఎకరాల 78 సెంట్ల భూసేకరణ మాత్రమే కాదని, రైతుల జీవనాధారంపై ప్రభుత్వం చేసిన దండయాత్రని విమర్శించారు. కేవలం 10, 30, 40 సెంట్లు ఉన్న సన్న చిన్నకారు రైతుల పొట్టలు కొట్టి, వారికి ప్రత్యామ్నాయం చూపకుండా అప్పటికప్పుడు అవార్డు ప్రకటించి భూములు లాక్కున్నారని తెలిపారు. జొన్నచేను, అరటి చెట్లు సాగులో ఉండగానే బుల్డోజర్లు పెట్టి ధ్వంసం చేస్తుంటే రైతుల ఆర్తనాదాలు భయంకరంగా ఉన్నాయని తెలిపారు. కనీసం రైతులకు ముందుగా పూర్తి వివరాలు చెప్పలేదు, అవార్డు కాపీలు ఇవ్వలేదు, ఏ భూమి ఎంత ధరకు నిర్ణయించారో తెలపలేదు. రైతులు కోర్టును ఆశ్రయిస్తారనే భయంతో, వర్కింగ్ డేస్‌లో కాకుండా పక్కా వ్యూహంతో వీకెండ్‌ను ఎంచుకుని బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.ఇది చట్టబద్ధమైన భూసేకరణా లేక వీకెండ్ చూసుకుని కూటమి ప్రభుత్వం చేసిన భూకబ్జానా అని ప్రశ్నించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్