- ఎపి రైతు సంఘం డిమాండ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాజధాని అమరావతి పరిధిలో బలవంతపు భూసేకరణ నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, సిఆర్డిఎ అధికారులు దౌర్జన్యంగా రైతుల భూములలోని పంటలను యంత్రాలతో ధ్వంసం చేసి భూములను స్వాధీనం చేసుకోవడాన్ని సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె.ప్రభాకర్ రెడ్డిలు ఆదివారం ఒక ప్రకటనలో త్రీవంగా ఖండించారు. రాజధాని ప్రాంతంలో ఉన్న బహిరంగ మార్కెట్ ధరకు, ప్రభుత్వం రైతులకు చెల్లిస్తామంటున్న పరిహారానికి పెద్ద మొత్తంలో తేడా ఉన్నదన్నారు. బహిరంగ మార్కెట్లో ధరకు అనుగుణంగా రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రైతులతో చర్చించి, ఆమోదంతోనే ప్రభుత్వం భూములు తీసుకోవాలన్నారు. రైతులపై దౌర్జన్యం చేసి భూములు లాక్కోవడం ప్రభుత్వానికి మంచిది కాదని, ప్రజాస్వామ్య ప్రక్రియ పాటించాలని కోరారు. శాశ్వతంగా భూములు కోల్పోయే రైతులకు గరిష్ట ప్రయోజనం కలిగేలా ప్రభుత్వ విధానం ఉండాలన్నారు. ఒకవైపు మా ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అంటూ ప్రచారం చేసుకుంటూ మరోవైపు ఆ రైతుల పంట పొలాలను ధ్వంసం చేయడాన్ని ఖండించారు.








కామెంట్‌లు (0)