ప్రముఖ నటుడు, గాయకుడు దిల్జీత్ దోసాంజ్ ప్రధాన పాత్రలో దర్శకుడు హనీ ట్రెహాన్ రూపొందించిన 'సట్లజ్' 2026 జూలై 3న జీ5 ఓటీటీలో విడుదలైంది. అయితే రెండు రోజులకే భారత్‌లో నిలిపివేశారు. దీంతో సినిమా కంటే దాని చుట్టూ నెలకొన్న వివాదమే పెద్ద చర్చగా మారింది. ఈ చిత్రానికి మొదట 'ఘల్లూఘారా' అని పేరు పెట్టారు. తర్వాత 'పంజాబ్ '95'గా మార్చారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ)తో మూడేళ్లకు పైగా సాగిన వివాదం తర్వాత చివరకు 'సట్లజ్' పేరుతో ఓటీటీలో విడుదల చేశారు.
'సట్లజ్' పంజాబ్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందింది. ఇందులో దిల్జీత్ దోసాంజ్ ఖల్రా పాత్ర పోషించారు. పంజాబ్‌లో ఉగ్రవాద వ్యతిరేక చర్యలు తీవ్రంగా సాగిన కాలంలో అదృశ్యమైన వ్యక్తుల ఆచూకీ కోసం పోరాడిన వ్యక్తి కథే ఇది. ఒక కుటుంబం ఎదుర్కొన్న విషాదంతో మొదలైన అన్వేషణ, వేలాది కుటుంబాల బాధను ప్రపంచం ముందుకు తీసుకొచ్చిన ఉద్యమంగా ఎలా మారిందో సినిమాలో చూపించారు.
జస్వంత్ సింగ్ ఖల్రా ఎవరు?
జస్వంత్ సింగ్ ఖల్రా 1952లో జన్మించారు. మొదట బ్యాంకు ఉద్యోగిగా పనిచేశారు. తర్వాత మానవ హక్కుల ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 1980ల చివరి నుంచి 1990ల మధ్య పంజాబ్‌లో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక చర్యల సమయంలో అదృశ్యమైన వ్యక్తుల వివరాలను సేకరించడం ప్రారంభించారు. అమృత్‌సర్, తరణ్‌తారన్ తదితర ప్రాంతాల శ్మశానాల రికార్డులను పరిశీలిస్తూ వేలాది గుర్తుతెలియని మృతదేహాల దహనాలపై ఆధారాలు సేకరించారు. పంజాబ్‌లో సుమారు 25 వేల మంది అక్రమంగా హత్యకు గురై గుర్తుతెలియని వ్యక్తులుగా దహనం చేయబడ్డారని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగానూ చర్చకు దారితీశాయి. 1995 సెప్టెంబర్ 6న అమృత్‌సర్‌లోని తన ఇంటి ముందు నుంచి ఖల్రాను అపహరించారు. తర్వాత ఆయన హత్యకు గురైనట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. ఈ కేసులో పంజాబ్ పోలీసుకు చెందిన ఆరుగురు అధికారులకు జీవిత ఖైదు విధించారు. 2011లో సుప్రీంకోర్టు కూడా ఆ శిక్షలను సమర్థించింది. దీంతో ఈ కేసు భారతదేశంలో మానవ హక్కుల చరిత్రలో అత్యంత కీలకమైన కేసుల్లో ఒకటిగా నిలిచింది.
సెన్సార్‌తో మొదలైన వివాదం
'సట్లజ్' వివాదం ఓటీటీతో మొదలైంది కాదు. సినిమా పూర్తయిన తర్వాత 'పంజాబ్ '95' పేరుతో సీబీఎఫ్‌సీకి పంపించారు. అయితే సీబీఎఫ్‌సీ సుమారు 127 మార్పులు, కత్తిరింపులు సూచించినట్లు దర్శకుడు హనీ ట్రెహాన్ వెల్లడించారు. జస్వంత్ సింగ్ ఖల్రా పేరు మార్చడం, 'పంజాబ్ పోలీసు' అనే పదాన్ని తొలగించడం, ఇందిరా గాంధీ పేరును ప్రస్తావించకుండా ఉండడం, కొన్ని సంభాషణలు, హింసాత్మక దృశ్యాలు, ప్రదేశాల పేర్లను తొలగించడం వంటి సూచనలు ఉన్నాయని చిత్రబృందం తెలిపింది. ఈ మార్పులను అంగీకరించడానికి దర్శకుడు నిరాకరించడంతో సినిమా థియేటర్లలో విడుదల కాలేదు. మూడేళ్లకు పైగా ఎదురుచూసిన తర్వాత చిత్రబృందం మరో మార్గాన్ని ఎంచుకుంది. 'పంజాబ్ '95' పేరును 'సట్లజ్'గా మార్చి ఓటీటీలో విడుదల చేసింది. దీనికి కారణం థియేటర్లు, ఓటీటీలకు వేర్వేరు నిబంధనలు ఉండటమే. థియేటర్లలో విడుదలయ్యే ప్రతి సినిమాకు 'సినిమాటోగ్రాఫ్ చట్టం–1952' ప్రకారం సీబీఎఫ్‌సీ సర్టిఫికెట్ తప్పనిసరి. కానీ ఓటీటీ వేదికలు 'ఐటీ రూల్స్–2021' పరిధిలో పనిచేస్తాయి. అందువల్ల సీబీఎఫ్‌సీ అనుమతి లేకుండానే సినిమాలను ప్రసారం చేసే అవకాశం ఉంది. అయితే విడుదలైన 48 గంటల్లోనే కేంద్ర ప్రభుత్వం జీ5కు ఈ చిత్రాన్ని నిలిపివేయాలని ఆదేశించింది.
ఈ నిర్ణయాన్ని చిత్రబృందం తీవ్రంగా వ్యతిరేకించింది. 'జస్వంత్ సింగ్ ఖల్రా పేరు మార్చమంటారు... పంజాబ్ పోలీసు పేరు తీసేయమంటారు... సినిమా పేరు మార్చమంటారు... ఇలా అన్నీ మార్చేస్తే అసలు కథలో మిగిలేది ఏమిటి?' అని దర్శకుడు హనీ ట్రెహాన్ ప్రశ్నించారు. దిల్జీత్ దోసాంజ్ కూడా 'ఒక్క కట్ చేసినా నేను ఈ సినిమాను ప్రచారం చేసేవాడిని కాదు' అని స్పష్టం చేశారు. పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, శిరోమణి అకాలీ దళ్, శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ ఈ చిత్రాన్ని ఓటీటీ నుంచి తొలగించడాన్ని వ్యతిరేకించాయి. 'చరిత్రను నిషేధించలేరు. పంజాబ్ గతాన్ని ప్రజల నుంచి దాచకూడదు' అని పేర్కొన్నాయి. ఆప్ మాత్రం పంజాబ్ చరిత్రలోని చీకటి అధ్యాయాలను కొత్తతరం తెలుసుకోకుండా బీజేపీ, కాంగ్రెస్ కలిసి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించింది.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'సట్లజ్ సినిమా కాదు... అది ఎప్పటికీ మానని గాయం. అధికారంలో ఉన్నవారిని అసౌకర్యానికి గురిచేసే కళ తన పని చేసినట్టే' అని వ్యాఖ్యానించారు. 'జస్వంత్ సింగ్ ఖల్రాకు జరిగినది ఈ సినిమాకు జరగనివ్వొద్దు' అని కూడా విజ్ఞప్తి చేశారు.
భారత్‌లో సినిమాలపై వివాదాలు కొత్తవి కావు. 'బ్యాండిట్ క్వీన్', 'ఫైర్', 'ఉడ్తా పంజాబ్', 'పద్మావత్', బీబీసీ రూపొందించిన 'ఇండియాస్ డాటర్' వంటి చిత్రాలు కూడా సెన్సార్ వివాదాలు, కోర్టు కేసులు, నిషేధాలను ఎదుర్కొన్నాయి. అయితే 'సట్లజ్' ప్రత్యేకత ఏమిటంటే... థియేటర్లలో విడుదల కాకముందే సెన్సార్ వివాదంలో చిక్కుకోవడం, ఓటీటీలో విడుదలైన 48 గంటల్లోనే నిలిపివేయబడటం. దీంతో వ్యక్తీకరణ స్వేచ్ఛ, చారిత్రక వాస్తవాల చిత్రణ, జాతీయ భద్రత, ప్రభుత్వ నియంత్రణ మధ్య సమతుల్యం ఎలా ఉండాలనే ప్రశ్న మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది.
- ప్రజాశక్తి సినిమా డెస్క్








కామెంట్‌లు (0)