స్వస్థలమైన మషద్‌లో ఖననం
భారీగా హాజరైన ప్రజలు
టెహ్రాన్ : ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ భౌతికకాయం గురువారం ఉదయం ఆయన జన్మస్థలమైన మషద్ నగరానికి చేరుకుంది. అక్కడి పవిత్ర ఇమామ్ రెజా దర్గా ప్రాంగణంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంతకుముందు ఇరాన్ నుండి బయలుదేరిన ఆయన శవపేటికకు భద్రతగా ఒక యుద్ధ విమానం ఎస్కార్ట్‌గా వచ్చింది. ఇరాక్ లోని నజాఫ్, కర్బలా నగరాల్లో జరిగిన అంత్యక్రియల ఊరేగింపులో మిలియన్ల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. దీంతో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. ఈ కారణంతో మషద్‌లో జరగాల్సిన అంతిమ సంస్కారాలు ఎనిమిది గంటల పాటు ఆలస్యమయ్యాయి. మషద్‌లో వేలాది మంది ప్రజలు ఇరాన్ జెండాలు, ఖమేనీ చిత్రపటాలు, నినాదాలతో కూడిన ప్లకార్డులు పట్టుకుని అంతిమయాత్రలో పాల్గొన్నారు. బంగారు గోపురంతో ప్రసిద్ధి చెందిన ఇమామ్ రెజా దర్గా దగ్గర భారీగా భక్తులు, మద్దతుదారులు చేరుకుని ఖమేనీకి తుది నివాళులర్పించారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు ఇమామ్ రెజా మందిరం సమీపంలో ఖమేనీ అంత్యక్రియలు నిర్వహించారు. అమెరికా దాడుల వల్ల అంత్యక్రియల షెడ్యూల్‌లో మార్పులేమీ లేవని, కేవలం జనం రద్దీ వల్లే ఆలస్యమైందని ఇరాన్ అధికారులు స్పష్టం చేశారు. అంత్యక్రియల సందర్భంగా కొందరు మద్దతుదారులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘‘మా సుప్రీం లీడర్ రక్తంపై ప్రమాణం చేస్తున్నాం.. ట్రంప్‌ను చంపుతాం’’ అంటూ నినదించారు. ఖమేనీ పార్థివదేహాన్ని గత వారం రోజులుగా టెహ్రాన్, ఖోమ్, ఇరాక్‌లోని నజఫ్, కర్బలా వంటి పవిత్ర నగరాల్లో ప్రజల సందర్శనార్థం తీసుకెళ్లారు. ప్రతి చోట భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని షియా మత ప్రార్థనలు, నినాదాల మధ్య నివాళులర్పించారు. అనంతరం మసద్‌కు తరలించి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఖమేనీ మరణానంతరం కొత్త సుప్రీం లీడరైన ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ భద్రతా కారణాల దృష్ట్యా బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అయితే, తన తండ్రి మరణించిన దాడిలో మొజ్తబా కూడా గాయపడటంతో, ఆయన ప్రస్తుతం ప్రజల ముందుకు రావడం లేదని పలువురు భావిస్తున్నారు.








కామెంట్‌లు (0)