న్యూయార్క్ : అమెరికాలో భారత సంతతికి చెందిన 17 ఏళ్ల రిధి చౌహాన్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. న్యూయార్క్‌లోని క్వీన్స్ ప్రాంతంలోని బెంజమిన్ ఎన్. కార్డోజో హైస్కూల్‌లో నిర్వహిస్తున్న నేవీ జూనియర్ రిజర్వ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ కార్ప్స్ (NJROTC) కార్యక్రమంలో అత్యున్నత క్యాడెట్ హోదాను కైవసం చేసుకున్న ఆమె, సుమారు 300 మంది క్యాడెట్లతో కూడిన బెటాలియన్‌కు 'బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్'గా బాధ్యతలు చేపట్టింది.
ఈ బాధ్యతల్లో భాగంగా రిధి వారానికి నాలుగు రోజుల పాటు క్యాడెట్ల డ్రిల్ ప్రాక్టీస్, శిక్షణ, వివిధ కార్యకలాపాలు, సంక్షేమాన్ని పర్యవేక్షిస్తోంది. ఇందుకోసం ప్రతిరోజూ ఉదయం 7 గంటలకు ముందే పాఠశాలకు చేరుకుంటోంది. అమెరికా నేవీ సహకారంతో నిర్వహించే ఈ కార్యక్రమం విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, బృంద స్ఫూర్తిని పెంపొందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.
రిధి గతంలో అకడమిక్ కమాండర్, స్టెమ్ (STEM) కమాండర్, ప్లాటూన్ లీడర్ వంటి కీలక హోదాల్లో సేవలందించింది. ఆమె నాయకత్వంలో పాఠశాల బృందం వరుసగా రెండేళ్లపాటు జాతీయ స్థాయి లీడర్‌షిప్ అండ్ అకడమిక్ బౌల్ పోటీల రెండో రౌండ్‌కు అర్హత సాధించింది. అలాగే యూనిట్ కోసం తొలి 'సీపెర్చ్' అండర్‌వాటర్ రోబోట్ నిర్మాణంలో క్యాడెట్లకు నాయకత్వం వహించింది. తన పదవీకాలంలో 200 మందికిపైగా సహచర క్యాడెట్లకు మార్గనిర్దేశం చేసింది.
రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన కుటుంబానికి చెందిన రిధి తల్లిదండ్రులు రుచికా చౌహాన్, దిలీప్ చౌహాన్. విద్య, సేవ, నాయకత్వం పట్ల కుటుంబం అందించిన ప్రోత్సాహంతో పాటు బీఏపీఎస్ స్వామినారాయణ్ సంప్రదాయం నుంచి పొందిన ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయని ఆమె తెలిపింది. ఈ మూడేళ్ల శిక్షణలో నాయకత్వం అంటే ఇతరుల జీవితాలపై సానుకూల ప్రభావం చూపడమేనని నేర్చుకున్నానని పేర్కొంది. భవిష్యత్తులో యునైటెడ్ స్టేట్స్ నేవల్ అకాడమీలో చేరి నేవల్ ఆఫీసర్‌గా దేశానికి సేవలందించడమే తన లక్ష్యమని రిధి వెల్లడించింది.







కామెంట్‌లు (0)