- ఉత్తర కొరియా మంత్రితో భేటీలో చైనా అధ్యక్షులు జిన్‌పింగ్ ఉద్ఘాటన
బీజింగ్ : చైనా, ఉత్తర కొరియాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల వృద్ధి తమ తమ దేశాల సోషలిస్టు ప్రయోజనాలను మరింత విస్తరింపజేసి సంఘటితం చేసేలా, అలాగే తమ ఆధునీకరణ చర్యలను మరింత ముందుకు తీసుకెళ్ళేళా వుండాలని చైనా అధ్యక్షులు జిన్‌పింగ్ పేర్కొన్నారు. ఉత్తర కొరియా మంత్రి పాక్ థా సంగ్‌తో బీజింగ్‌లో సమావేశమైన సందర్భంగా జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్ థా డిపిఆర్‌కె ప్రభుత్వ వ్యవహారాల కమిషన్ ఉపాధ్యక్షులు, కొరియా వర్కర్స్ పార్టీ కేంద్ర కమిటీ పొలిటికల్ బ్యూరో అధ్యక్ష వర్గ సభ్యులు కూడా.
ఇరు దేశాల మధ్య సంబంధాలు శాశ్వతమైన స్నేహబంధం, పరస్పరం కష్ట సుఖాలను పంచుకోవడం, పరస్పర సహాయ సహకారాల ద్వారా నిర్వచించబడ్డాయని అన్నారు. చైనా-డిపిఆర్‌కె స్నేహం, పరస్పర సహకార ఒప్పందం అనేది ద్వైపాక్షిక సంబంధాలకు కీలకమైన రాజకీయ, చట్టబద్ధమైన పునాదులను వేసిందన్నారు. ఈ ఒప్పందం 65వ వార్షికోత్సవాన్ని ఒక అవకాశంగా తీసుకుని ఇరు దేశాల, పార్టీల నాయకులు, వృద్ధతరం ఆశలు, ఆశయాలు, కాంక్షలను మరింత ముందుకు తీసుకెళ్ళేందుకు కృషి చేయాలని ఇరువురు నేతలు అంగీకరించారు. అలాగే ఇరు దేశాల ప్రజల మధ్య సాంప్రదాయ స్నేహ సంబంధాలను ప్రోత్సహించాలని, రాబోయే సంవత్సరాల్లో ద్వైపాక్షిక సంబంధాలు మరింత క్రియాశీలంగా వుండేలాచర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఆచరణాత్మక సహకారాన్ని ఇరు పక్షాలు నిలకడగా ముందుకు తీసుకెళ్ళాలని జిన్‌పింగ్ పేర్కొన్నారు. ప్రజా మద్దతును బలోపేతం చేసుకుంటూండాలన్నారు. పరస్పర సార్వభౌమాధికర, భద్రతా, అభివృద్ధి ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు వ్యూహాత్మకంగా సమన్వయం చేసుకోవాలని కోరారు.







కామెంట్‌లు (0)