- ఇరాన్ మత పెద్ద ముజ్తబా ప్రతిన
- నన్ను హత్య చేస్తే క్షిపణుల వర్షమే !
- ట్రంప్ బెదిరింపు
టెహ్రాన్, వాషింగ్టన్ : ఇరాన్ సుప్రీం నేత, తన తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలన్నది తమ జాతి డిమాండ్ అని, తప్పకుండా అది జరిగి తీరుతుందని ఇరాన్ ప్రస్తుత మత పెద్ద ఆయతుల్లా ముజ్తబా ఖమేని శనివారం పేర్కొన్నారు. ఈ మేరకు రాతపూర్వక సందేశాన్ని టెలిగ్రామ్‌లో పోస్టు చేశారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో మరణించిన ఖమేనీ అంత్యక్రియలు పూర్తయిన నేపథ్యంలో ముజ్తబా సందేశం వెలువడింది. నేరస్తులు, హంతకులు జరిపిన రెండు యుద్ధాల్లో మరణించిన అమర నాయకుడు, ఇతర అమరవీరుల రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిన చేస్తున్నామని ఆ సందేశంలో ముజ్తబా పేర్కొన్నారు.
వేలాది క్షిపణులతో దాడులే !
తనను హత్య చేస్తానని ఇరాన్ బెదిరిస్తోందని, ఒకవేళ అదే జరిగితే ఇరాన్‌పై మూకుమ్మడిగా వెయ్యికి పైగా క్షిపణులతో దాడులు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. వెంట వెంటనే వేలాదిగా క్షిపణుల వర్షం కురుస్తుందన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే తాను ఆదేశాలు కూడా జారీ చేసి వుంచానన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ‘‘ఆదేశాలు ఇప్పటికే జారీ అయ్యాయి. ఇరాన్‌ను సమూలంగా నిర్మూలించడానికి, నాశనం చేయడానికి ఏడాది పాటు అవసరమైతే అంతకన్నా ఎక్కువ కాలమే దాడులు చేయడానికి పూర్తి సన్నద్ధతతో అమెరికా మిలటరీ సిద్ధంగా వుంది.’’ అని పేర్కొన్నారు.
ఇక కాల్పుల విరమణ ముగిసినట్లేనని ఇరాన్‌కు ఇప్పటికే తెలియచేశామని చెప్పారు. అయితే చర్చలు కొనసాగించాలని వారు కోరారు. అందుకు అమెరికా అంగీకారం తెలిపిందన్నారు. కాగా ఈ వ్యాఖ్యలను ఇరాన్ ఖండించింది. అటువంటి అభ్యర్ధనేదీ తాము చేయలేదని తెలిపింది. అయితే చర్చల కోసం మధ్యవర్తి ఖతార్ చేసిన అభ్యర్ధనను తాము తోసిపుచ్చలేదని పేర్కొంది. గత వారమంతా ఇరాన్‌పై అమెరికా పదేపదే దాడులు జరిపింది. ఇందుకు ప్రతిగా ఇరాన్ కూడా అమెరికా మిలటరీ స్థావరాలపై దాడులు జరిపింది. అమెరికా, ఇరాన్ చర్చలపై ట్రంప్‌తో సౌదీ యువరాజు, ప్రధాని మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సద్ ఫోన్లో మాట్లాడారు. సౌదీ-అమెరికా సహకారం, వివిధ రంగాల్లో దాన్ని పెంచుకునే విషయమై ఉభయ పక్షాలు చర్చలు జరిపాయని సౌదీ పత్రికా సంస్థ తెలిపింది. సముద్ర మార్గాల భద్రత, ప్రాంతీయ భద్రత, సుస్థిరతకు దోహదపడే ఇతర అంశాలు, కృషి గురించి కూడా వారు చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు హర్మూజ్‌పై చర్చించేందుకు గానూ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి శనివారం ఒమన్ బయలుదేరి వెళ్ళారు.







కామెంట్లు (0)