- ఆటోమొబైల్ కంపెనీల పాత ప్రతిపాదన మళ్లీ చర్చకు
- పాత వాహనాల రక్షణ కీలకం
న్యూఢిల్లీ : దేశంలో ఇథనాలు ఇంధనం అమలు అంశంలో ఆటోమొబైల్ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇ-20 పెట్రోల్ అమలు నేపథ్యంలో పాత వాహనాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇ-10 పెట్రోల్‌ను కూడా అందుబాటులో ఉంచాలని ఆటోమొబైల్ పరిశ్రమ గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ విషయం ఆటోమొబైల్ పరిశ్రమలో మళ్లీ చర్చనీయాంశంగా మారింది. 2021లో నీతి ఆయోగ్ రూపొందించిన ‘రోడ్‌మ్యాప్ ఫర్ ఇథనాల్ బ్లెండింగ్ ఇన్ ఇండియా: 2020-25’నివేదికలో ఇ-20ను దశలవారీగా అమలు చేస్తున్నప్పటికీ పాత వాహనాల కోసం ఈ-10ను ప్రొటెక్షన్ గ్రేడ్ గా కొనసాగించాలని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియోమ్) ప్రతిపాదించింది. ఇటీవల ఇ-20 ఇంధనంపై తీవ్రంగా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిని కేంద్ర ప్రభుత్వం ఖండించిన నేపథ్యంలో ఈ నివేదికలోని అంశాలు మరోసారి ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఈ-10 ఇంధనాన్ని పూర్తిగా తొలగించి ఇ-20నే తప్పనిసరి చేస్తే ప్రస్తుతం రోడ్లపై ఉన్న పాత వాహనాల ఇంజన్ల పనితీరు, ఇంధన సామర్థ్యం, భద్రతపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆటోమొబైల్ రంగం హెచ్చరించింది. పాత వాహనాలను ఇ-20కు అనుగుణంగా మార్చడం అధిక వ్యయంతో కూడుకున్నదని.. ఇథనాల్ తక్కువ క్యాలరీ విలువ కారణంగా మైలేజీ సుమారు 6 శాతం తగ్గే అవకాశముందని పేర్కొంది. అలాగే ఇంధన లీకేజీలు, కొన్ని విడిభాగాలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉందని నివేదికలో ప్రస్తావించింది. అయితే ఇ-20 ఇంధనం వల్ల ఇంజిన్లు దెబ్బతింటున్నాయనే ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తోసిపుచ్చింది. ఈ ఇంధనాన్ని అమల్లోకి తీసుకురావడానికి ముందు (సియోమ్), ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఆర్‌ఎఐ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, వాహన తయారీ సంస్థలతో కలిసి విస్తృత స్థాయిలో పరీక్షలు నిర్వహించామని, ఇంజన్ వైఫల్యాలకు ఇ-20 కారణమని నిర్ధారించే శాస్త్రీయ ఆధారాలు లేవని స్పష్టం చేసింది. అలాగని ఇథనాల్ పెట్రోల్‌తో వాహనాలకు రక్షణ ఉంటుందని కేంద్రం కూడా నిరూపించకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఇది కేవలం నితిన్ గడ్కరీ కుటుంబ వ్యాపారం కోసం ఇథనాల్ ప్రయోగం జరుగుతోందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ పాత వాహనాల వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ ఇంధన లభ్యతపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి.







కామెంట్‌లు (0)