ఐదుసార్లు ఛాంపియన్ బ్రెజిల్‌పై నార్వే గెలుపు
12న క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్‌తో ఢీ
న్యూజెర్సీ: ఫిఫా ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదైంది. ఐదుసార్లు ఫిఫా ప్రపంచ కప్ విజేత బ్రెజిల్.. ఈసారి రౌండ్16 దాటలేకపోయింది. న్యూజెర్సీ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్ 1-2గోల్స్‌తో నార్వే చేతిలో ఓటమిపాలైంది. ఈ ఓటమి తర్వాత బ్రెజిల్ స్టార్ ఆటగాడు నెయ్ మార్ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫిఫా వరల్డ్‌కప్‌లో నార్వే క్వార్టర్‌ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి. స్టార్ ప్లేయర్ ఎర్లింగ్ హాలాండ్ అద్భుతమైన గేమ్‌తో ఆకట్టుకున్నాడు. అతను రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 1990 వరల్డ్‌కప్ తర్వాత రౌండ్16లో బ్రెజిల్ ఓడిపోవడం ఇదే తొలిసారి. ఈ వరల్డ్‌కప్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న హాలాండ్ మరోసారి అదే దూకుడు ప్రదర్శించాడు. దీంతో ఈ టోర్నీలో హాలండ్ చేసిన గోల్స్ సంఖ్య ఏడుకు చేరింది. అలాగే గోల్డెన్ బూట్ రేసులో ఉన్న ఎంబాపే(ఫ్రాన్స్), మెస్సీ(అర్జెంటీనా)తో సంయుక్తంగా హాలండ్ రేసులో నిలిచాడు. అలాగే 25 ఏళ్ల హాలండ్ నార్వే తరపున 54 మ్యాచుల్లో 62 గోల్స్ చేశాడు. నార్వే తరపున ఆడిన చివరి 14 మ్యాచుల్లో హాలాండ్ మొత్తం 27 గోల్స్ చేసి తన ఫామ్‌ను చాటుకున్నాడు. ఈ మ్యాచ్‌లో హాలాండ్ 79, 90వ నిమిషాల్లో రెండు గోల్స్ చేశాడు. అలాగే వరుసగా 14 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో గోల్ చేసి రికార్డు సృష్టించాడు. క్రిస్టియన్ వియేరి (1998) తర్వాత తన తొలి నాలుగు ప్రపంచకప్ మ్యాచ్‌ల్లోనూ గోల్స్ చేసిన ఎనిమిదో యూరోపియన్ ఆటగాడిగా హాలాండ్ నిలిచాడు. ఇక బ్రెజిల్ తరపున నేయ్‌మార్ 90 నిమిషంలో గోల్ చేశాడు. వాస్తవానికి ఆరంభంలో బ్రెజిల్‌కు పెనాల్టీ దొరికింది. కానీ నార్వే గోల్‌కీపర్ ఓర్జన్ నైలాండ్ అద్భుతంగా సేవ్ చేయడంతో.. గోల్ చేసే అవకాశాన్ని ఆ జట్టు కోల్పోయింది. దాదాపు రెండో అర్థ భాగం చివరి దశ వరకు రెండు జట్లు హోరాహోరీగా పోరాడాయి. ఈ విజయంతో నార్వే క్వార్టర్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. జూలై 11న క్వార్టర్స్‌లో ఇంగ్లండ్‌తో నార్వే తలపడనుంది.







కామెంట్‌లు (0)