సోమవారం, 06 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆశలు అడియాసలేనా?

2 గంటల క్రితం

fishermen
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 07, 2026, 01:20 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- లభ్యంకాని ఆరుగురు 
మత్స్యకారుల ఆచూకీ

- రోజంతా విస్తృత గాలింపు

- కన్నీటి సంద్రంలా 
హార్బర్‌ పరిసర ప్రాంతాలు

ప్రజాశక్తి- కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : సముద్రంలో శనివారం బోటు బోల్తా పడిన సంఘటనలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ సోమవారం రాత్రికీ తెలియకపోవడంతో వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. విశాఖలోని ఫిషింగ్ హార్బర్‌ ‌పరిసర ప్రాంతాలు కన్నీటి సంద్రంలా మారాయి. ఎక్కడ చూసినా విషాద వదనాలే. గల్లంతైన వారి కోసం అధికారులు చేపట్టిన చర్యలపై ఎంతగానో ఆశలు పెట్టుకున్న బాధిత కుటుంబాలు సోమవారం సాయంత్రానికి ఆశలు వదులుకున్నట్లుగా వారి మాటలనుబట్టి తెలుస్తోంది. ప్రభుత్వం, అధికారులు సకాలంలో స్పందించి ఉంటే తమ వారు సురక్షితంగా ఒడ్డుకు వచ్చే వారిని పలువురు రోదిస్తూ చెప్పుకొచ్చారు. గల్లంతైన మత్స్యకారులు ఉపాధి కోసం విజయనగరం జిల్లా భోగాపురం మండలం మక్కాం గ్రామం నుంచి విశాఖకు వచ్చారు. నలుగురు ఒకే కుటుంబానికి చెందినవారు. వారికి బంధువైన మత్స్యకారుడు బండియ్య విశాఖ భీమిలి మండలం నాగమయ్యపాలేనికి చెందినవారు. గల్లంతైనా వారిలో ఆయన అల్లుడు గరగయ్య కూడా ఉన్నారు. ఇటీవల వివాహం జరిగిన అప్పలరాజు కూడా గల్లంతయ్యారు. ఉపాధి కోసం వచ్చిన వీరంతా విశాఖ పాత నగరం జాలారిపేటలో నివసిస్తున్నారు. దీంతో, అటు విజయనగరం, ఇటు విశాఖ తీర ప్రాంతాల్లోని మత్స్యకార గ్రామాలన్నింటా విషాదం అలుముకుంది.

​మత్స్యకారుల నిరసన

ఆరుగురు మత్స్యకారుల కుటుంబాలవారు, వారికి మద్దతుగా పెద్ద సంఖ్యలో మత్స్యకారులు ఫిషింగ్ హార్బర్ లోని జెడి ఫిషరీష్ కార్యాలయ సమీప ప్రాంతంలోకి సోమవారం ఉదయానికే చేరుకుని నిరసన చేపట్టారు. గల్లంతైన మత్స్యకారుల కోసం ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారో తెలియడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెకనైజ్డ్ బోటు ఆపరేటర్స్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు వాసుపల్లి జానకిరామ్ వారికి మద్దతుగా మాట్లాడుతూ మత్స్యకారులు గల్లంతైన విషయాన్ని విశాఖ జిల్లా కలెక్టర్‌‌తో సహా అందరూ అధికారులకు తాను చాలా ముందుగానే సమాచారం ఇచ్చానన్నారు. అధికారులు వేగంగా స్పందించి ఉంటే గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ వెంటనే తెలిసేందని పేర్కొన్నారు. గల్లంతైన మత్స్యకారులను రక్షిస్తామని కూటమి ప్రభుత్వం, మంత్రులు, అధికారులు ప్రకటనలు చేయడం మినహా వారు చేపట్టిన చర్యలపై సందేహాలు ఉన్నాయన్నారు.

ముమ్మరంగా గాలిస్తున్నాం : గోపీనాథ్ జెట్టి

విశాఖ సముద్ర తీరానికి సమీపంలో గల్లంతైన ఐఎన్‌‌డి-ఎపి-ఎంఎం-విఎస్-83 మెకనైజ్డ్ ఫిషింగ్ బోటులోని ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌ నిరంతరాయంగా కొనసాగుతుంద‌ని విశాఖ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, కోస్టల్ సెక్యూరిటీ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న గోపీనాథ్ జెట్టి తెలిపారు. జిల్లా సంయుక్త కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌‌తో కలిసి సోమవారం క‌లెక్ట‌రేట్ విసి హాలులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన గాలింపు చర్యల వివరాలను వెల్లడించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, బలమైన గాలులు, ఎత్తైన అలల కారణంగా బోటు ప్రమాదానికి గురై గల్లంతైంద‌న్నారు. బోటులో మొత్తం ఏడుగురు మత్స్యకారులు ఉండగా, వారిలో కారి చిన్నాను పనామా జెండాతో ప్రయాణిస్తున్న ఎంవి యూనివర్స్ వెల్తీ వాణిజ్య నౌక సురక్షితంగా రక్షించింద‌ని తెలిపారు. మిగిలిన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంద‌ని చెప్పారు. ప్రస్తుతం భారత తీర రక్షక దళానికి చెందిన రెండు నౌకలు, భారత నౌకాదళానికి చెందిన రెండు నౌకలు ప్రమాదం జరిగిన ప్రాంతంలో నిరంతర గాలింపు నిర్వహిస్తున్నాయ‌ని తెలిపారు. నౌకాదళం, తీర రక్షక దళానికి చెందిన డోర్నియర్ విమానాలు, హెలికాప్టర్లు సముద్రంపై వైమానిక గాలింపు కొనసాగిస్తున్నాయ‌ని తెలిపారు. విశాఖపట్నంలోని ప్రాంతీయ ఆపరేషన్స్ స్టేషన్ ద్వారా ఎలక్ట్రానిక్ నిఘా కూడా నిరంతరం కొనసాగుతోందని చెప్పారు.

విశాఖకు సుర‌క్షితంగా చేరుకున్న చిన్నా

బోటు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ కారి చిన్నాను నేవీ హెలీకాప్టర్‌ సాయంతో ఐఎన్ఎస్ డేగాకు సోమవారం రాత్రి ఏడు గంట‌ల ప్రాంతంలో రక్షణ సిబ్బంది తీసుకొచ్చారు. ప్రాథమిక వైద్య పరీక్షల అనంతరం మెరుగైన పరీక్షలు, వైద్యం కోసం అంబులెన్స్‌‌లో ‌షీలానగర్‌ ‌సమీపంలోని కిమ్స్ ఐకాన్‌ ఆస్పత్రికి తరలించారు.

గాలింపు చర్యలు ముమ్మరం: మంత్రి అచ్చెన్నాయుడు

మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని నేవీ, కోస్ట్ గార్డు అధికారులను మంత్రి కె అచ్చెన్నాయుడు ఆదేశించారు. మత్స్యకారులు క్షేమంగా తిరిగి వచ్చేలా అన్ని వనరులనూ వినియోగించి సహాయక చర్యలు కొనసాగించాలని సూచించారు. ఈ మేరకు నేవీ, కోస్ట్ గార్డు అధికారులతో మంత్రి సోమవారం సమీక్షించారు. రెండో రోజూ ప్రత్యేక నౌక, రెస్క్యూ బోటు, హెలికాఫ్టర్ సహాయంతో నేవీ, కోస్ట్ గార్డు సంయుక్తంగా విస్తృత గాలింపు చేపడుతున్నట్లు మంత్రికి అధికారులు వివరించారు. గల్లంతైన వారిలో కారి గంగయ్య, అమర అప్పలరాజు, కారి సితోడు, మేడ చిన అమ్మోరు, కారి చిన్నయ్య, రాగుతూ బండియ్య ఉన్నారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్