సోమవారం, 06 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

త్వరలో మొబైల్ ఛార్జీల మోత..!

2 గంటల క్రితం

phone
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 07, 2026, 01:13 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- టారిఫ్ ధరలు 15 శాతం పెరగొచ్చు

- సెంట్రమ్ ఇన్‌స్టిట్యూషనల్ రీసెర్చ్ నివేదిక

న్యూఢిల్లీ : ఇప్పటికే పెరిగిన మొబైల్ ఛార్జీలతో సతమతమవుతున్న సామాన్యుడి జేబుకు మరోసారి చిల్లు పడనుంది. టెలికాం రంగంలో ధరల పెంపునకు టెల్కోలకు అనుకూలమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రాబోయే మూడు నుంచి నాలుగు నెలల్లో మొబైల్ టారిఫ్ ధరలు మరో 12 నుంచి 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని సెంట్రమ్ ఇన్‌స్టిట్యూషనల్ రీసెర్చ్ తన తాజా నివేదికలో హెచ్చరించింది. మార్కెట్‌‌లో గుత్తాదిపత్యం పెరగడంతో టెలికాం సంస్థలు తమ ఆదాయాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. దీంతో సామాన్య వినియోగదారులపై అదనపు భారం పడనుంది. ప్రస్తుతం దేశంలోని టెలికాం మార్కెట్ కేవలం మూడు ప్రయివేటు సంస్థల చేతుల్లోకి పరిమితం కావడంతో.. ఆ సంస్థలు ఏకపక్షంగా ధరల పెంపునకు సిద్ధమవుతున్నాయి. జూన్ త్రైమాసికంలోనే వినియోగదారుల నుంచి సగటు ఆదాయం రాబడి (ఎఆర్‌‌పియు)1 నుంచి 1.5 శాతం పెరిగింది. ప్రతీ ఏడాది టెల్కోల ఆదాయాలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ వినియోగదారులు 2జి నుంచి 4జి, 5జి నెట్‌వర్క్‌లకు మారుతుండటంతో తమకు వ్యయాలు పెరుగుతున్నాయనే సాకుతో ప్రజలపై భారం మోపనున్నాయి. ఈ ధరల పెంపు పట్ల వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే డేటా, కాల్ ఛార్జీల పెంపుతో అల్లాడుతున్న సామాన్యుడిపై ఇప్పుడు మరోసారి 15 శాతం వరకు భారం పడటం తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా జియో, ఎయిర్‌టెల్ వంటి సంస్థలు 5జి విస్తరణ పేరుతో తమ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసుకుంటున్న తరుణంలో ఆ ఖర్చులను కూడా వినియోగదారుల నెత్తినే రుద్దుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో సంస్థలు వోడాఫోన్ ఐడియా వాటాను కూడా కైవసం చేసుకుంటూ మార్కెట్‌లో పట్టు సాధిస్తున్నాయి. ఈ పోటీ నేపథ్యంలో వోడాఫోన్ ఐడియా తన 5జి నెట్‌వర్క్‌ను వంద నగరాల్లోకి విస్తరిస్తున్నప్పటికీ.. ధరల పెంపు నిర్ణయంలో ప్రయివేటు సంస్థలన్నీ ఏకతాటిపైకి వస్తుండటం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. రాబోయే రోజుల్లో కమ్యూనికేషన్ ఖర్చులు మరింత ప్రియం కానుండటంతో సామాన్యుడి బడ్జెట్‌పై ఇది మరింత భారం మోపనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్