ఆటోలోనే నలుగురు చిన్నారుల జననం
అంబులెన్స్ లేకపోవడంతో శిశువులందరు మృతి
మాండ్లా (మధ్యప్రదేశ్) : భారతీయ జనతా పార్టీ ఏలుబడిలోని మధ్యప్రదేశ్‌లో హృదయవిదారక ఘటన జరిగింది. కాన్పు కోసం ఆస్పత్రికి వెళుతూ ఒక మహిళ ఆటోరిక్షాలోనే ప్రసవించి, నలుగురికి జన్మనిచ్చింది. అయితే సకాలంలో అంబులెన్స్ రాకపోవడంతో జన్మించిన కాసేపటికే ఆ నలుగురు శిశువులు మరణించారు. ఈ సంఘటన మంగళవారం మాండ్లా జిల్లాలో చోటు చేసుకుంది. అంబులెన్స్ వెంటనే వచ్చి వుంటే తమ పిల్లలు బతికేవారని ఆమె భర్త గణేష్ సింగారం, వారి కుటుంబం ఆవేదనవ్యక్తం చేశారు. ఏడో నెల్లోనే రజనీ సింగారానికి నొప్పులు రావడంతో ఆమెను ప్రైవేటు వాహనంలో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారని, అయితే ఆమె పరిస్థితి విషమంగా వుండడంతో వెంటనే ఆటోలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు పంపామని జిల్లా చీఫ్ మెడికల్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ డి.జె.మొహంతి చెప్పారు. కానీ అక్కడకు వెళ్ళేలోగానే ఆమె నలుగురిని ప్రసవించారని, వారిలో ముగ్గురు ఆడపిల్లలు కాగా, ఒక మగపిల్లాడని తెలిపారు. ఒక్కొక్కరు 1.5కిలోల బరువు వున్నారని చెప్పారు. ప్రస్తుతం తల్లి ఆరోగ్యం బాగానే వుంది. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ సర్వీసు అందుబాటులో లేనందునే తాము ఆటోలో తీసుకెళ్ళాల్సి వచ్చిందని, అదే తమ పిల్లల ప్రాణాలు తీసిందని ఆమె కుటుంబం వాపోతోంది. అయితే పూర్తిగా ఎదగకుండానే ఆ నలుగురు పుట్టారని, అందువల్లే వారు చనిపోయారని ఆరోగ్య శాఖ అధికారులు చెప్పడం గమనార్హం.







కామెంట్‌లు (0)