నేడు ఇంగ్లండ్‌తో నాల్గో టి20
రాత్రి 10.00గం.లకు
బ్రిస్టల్: మూడో టి20లో చిత్తుగా ఓడిన టీమిండియా ఇక నాల్గో టి20పై దృష్టి సారించింది. ఐదు టి20ల సిరీస్ 0-2తో వెనుకబడ్డ టీమిండియా.. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సిరీస్ రేసులో నిలువనుంది. మరోవైపు బ్యాటర్ల వైఫల్యం జట్టు మేనేజ్‌మెంట్‌ను కలచివేస్తోంది. ముఖ్యంగా మూడో టి20లో కేవలం 76 పరుగులకే ఆలౌట్ కావడం, పవర్ ప్లేలోనే 4 వికెట్లు కోల్పోడంతో పలు విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. మరోవైపు బౌలర్లు సమిష్టిగా రాణించడంలోనూ విఫలమౌతున్నారు. ఇంగ్లండ్ బ్యాటర్లు మన బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని భారీ స్కోర్ సాధిస్తుంటే.. అదే పిచ్‌పై మన బ్యాటర్లు విఫలమౌతున్నారు. తొలి టి20 వర్షం కారణంగా రద్దు కావడంతో ఐదు టి20ల సిరీస్‌లో టీమిండియా గెలిస్తేనే సిరీస్ కోల్పోయే ప్రమాదం నుంచి బయటపడనుంది. భారత పిచ్‌లపై భారీ స్కోర్లు నమోదు చేసే మన బ్యాటర్లు విదేశీ గడ్డపై ఘోర వైఫల్యమవుతున్నారు. యువ క్రికెటర్లను నమ్ముకొని విదేశీ పర్యటనకు బయల్దేరిన టీమిండియా.. ఈ సిరీస్‌కు ముందు ఐర్లాండ్‌తో రెండు టి20ల సిరీస్‌లోనూ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇక ఇంగ్లండ్ గడ్డపై అడుగిడి గెలుపు బోణీ కొట్టిన దాఖలాలు లేవు. దీంతో టీమిండియాకు మరో వైట్‌వాష్ తప్పదేమో!
పవర్‌ప్లేలోనే 4 వికెట్లు కోల్పోవడంతోనే ఓటమి: శ్రేయస్ అయ్యర్
ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన మూడో టీ20లో 125 పరుగుల తేడాతో టీమిండియా ఘోర పరాజయిన్న చవిచూసింది. దీంతో మ్యాచ్ అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. భారత జట్టు ఆడిన తీరు అత్యంత ఘోరంగా ఉందని, ఇంతటి భారీ పరుగుల తేడాతో ఓడిపోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నాడు. ఈ పిచ్ 200 పరుగులు సాధించే అంత సులువుగా ఏమీ లేదని, కానీ బౌలింగ్ లో తాము ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయామని అయ్యర్ ఒప్పుకున్నాడు. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే.. 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన తాము, పవర్‌ప్లేలోనే 4 కీలక వికెట్లు కోల్పోవడం కోలుకోలేని దెబ్బ తీసిందన్నాడు. అక్కడే మ్యాచ్ ఇంగ్లాండ్ వైపు పూర్తిగా మలుపు తిరిగిందని, చేజింగ్ చేసేటప్పుడు ఒక పద్ధతి ప్రకారం ఇన్నింగ్స్ నిర్మించాల్సి ఉండగా.. ఆ విషయంలో బ్యాటర్లు తమ వ్యూహాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యామన్నాడు. ఈ వైఫల్యాన్ని తాము అంగీకరిస్తున్నామని, ప్రతి ఆటగాడు తమ బాధ్యతను గుర్తించాల్సిన అవసరం ఉందని అయ్యర్ హితవు పలికాడు. గతాన్ని మర్చిపోయి మళ్లీ సమీక్షించుకుని, బ్రిస్టల్‌లో జరగబోయే తదుపరి మ్యాచ్‌లో పుంజుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశాడు.
జట్లు(అంచనా)...
ఇండియా: శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), అభిషేక్ శర్మ, సూర్యవంశీ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, తిలక్ వర్మ, హర్షిత్ రాణా, దూబే, ఆర్స్‌దీప్, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్.
ఇంగ్లండ్: బ్రూక్(కెప్టెన్), సాల్ట్, బట్లర్(వికెట్ కీపర్), బేథెల్, బాంటమ్, సామ్ కర్రన్, విల్ జాక్స్, ఆర్చర్, డాసన్, రషీద్, టంగ్.







కామెంట్‌లు (0)