రైల్వేకు రూ. 60 వేల జరిమానా
చెన్నై : రిజర్వేషన్ చేసుకున్న ఒక ప్రయాణీకుడి సీట్‌ను టిటిఇ అక్రమించకున్న కేసులో దక్షిణ రైల్వేకు కేరళలోని ఒక వినియోగదారుల కమిషన్ రూ. 60 వేల జరిమానా విధించింది. ‘సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ప్రయాణీకుడు తన కష్టార్జితంతో బుక్ చేసుకున్న సీట్‌ను టిటిఇ అక్రమంగా ఆక్రమించుకుని, ఆ నిస్సహాయ ప్రయాణికుడిని వేరే సీటుకు వెళ్లేలా చేయడం స్పష్టంగా సేవలో లోపం, అన్యాయమైన వాణిజ్య విధానం కిందకే వస్తుంది’ అని ఉత్తర్వుల్లో పేర్కొంది. టికెట్ ధరను తిరిగి చెల్లించాలని, అలాగే మానసిక వేదన, ఇబ్బందులకు పరిహారంగా ఫిర్యాదుదారుకు రూ. 50 వేలు, ఖర్చుల కింద రూ. 10 వేలు చెల్లించాలని దక్షిణ రైల్వేను కమిషన్ ఆదేశించింది. ఉత్తర్వు కాపీ అందిన తేదీ నుండి 45 రోజుల్లోపు ఈ మొత్తాన్ని చెల్లించాలి, లేనిపక్షంలో, చెల్లింపు జరిగే తేదీ వరకు దీనిపై 6 శాతం వడ్డీ వర్తిస్తుందని కమిషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఎర్నాకుళం జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ అధ్యక్షులు డి.బి. బిను, సభ్యులు వి. రామచంద్రన్ వి, టిఎన్ శ్రీవిద్య ఆదేశాలు ఇచ్చారు.
ఈ కేసు పూర్తి వివరాల ప్రకారం కేరళలో అలువా నుండి తిరువనంతపురానికి తన భార్యతో కలిసి ప్రయాణించడానికి రెండు రైలు టికెట్లను ఫిర్యాదుదారుడు బుక్ చేసుకున్నారు. అయితే అలువాలో రైలు ఎక్కేసమాయానికే ఫిర్యాదుదారులకు కేటాయించిన సీటులో టిటిఇ తన సూట్‌కేస్‌ను ఉంచి గొలుసుతో లాక్ చేసి ఆక్రమించుకున్నారు. దీన్ని ప్రశ్నించగా, వేరే సీటులో సర్దుకుపోవాలని టిటిఇ చెప్పారని, అంతేకాకుండా తోటి ప్రయాణికుల సమక్షంలో తనను, తన భార్యను టిటిఇ వేధించారని కూడా ఫిర్యాదుదారు ఆరోపించారు. న్యాయం కోసం వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.







కామెంట్‌లు (0)