ట్రేడ్ యూనియన్ల ఆందోళన
కొచ్చిన్ : లాభాల్లో నడుస్తున్న కొచ్చిన్ షిప్‌యార్డ్ అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను తక్షణమే ఆపేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ కొచ్చిన్ షిప్‌యార్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, కొచ్చిన్ షిప్‌యార్డ్ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్, కొచ్చిన్ షిప్‌యార్డ్ ఎంప్లాయీస్ యూనియన్, కొచ్చిన్ షిప్‌యార్డ్ వర్కర్స్ యూనియన్ నాయకులు కార్మికులతో కలిసి షిప్‌యార్డ్ ప్రధాన ద్వారం వద్ద ఆందోళన చేపట్టారు. ప్రతిపాదిత వాటా విక్రయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, ఈ వ్యూహాత్మక నౌకా నిర్మాణ సంస్థ పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉండాలని డిమాండ్ చేశాయి. ఈ షిప్‌యార్డ్‌లో ముందుగా కేంద్ర ప్రభుత్వ వాటా 75 శాతం ఉండగా, 2017 ఐపిఓ తరువాత అది 67.91 శాతానికి తగ్గిందని, తాజా ఓఎఫ్‌ఎస్ తరువాత అది సుమారు 62 శాతానికి పడిపోతుందని యూనియన్లు ఆందోళన వ్యక్తం చేశాయి. స్థిరంగా లాభాల్లో కొనసాగుతున్న షిప్‌యార్డ్‌ను ప్రైవేటీకరించడానికి ఎలాంటి కారణం లేదని కొచ్చిన్ షిప్‌యార్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు ఎం. అనిల్‌కుమార్ విమర్శించారు. షిప్‌యార్డు యాజమాన్యంలో ప్రభుత్వ వాటాను తగ్గించే ఏ చిన్న ప్రయత్నాన్ని అయినా యూనియన్లు వ్యతిరేకిస్తూనే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.








కామెంట్‌లు (0)