సంతాప సభలో వక్తలు
యార్లగడ్డ జోయకు నివాళి
ప్రజాశక్తి-చందర్లపాడు : రాజకీయంగా ఎన్నో సమస్యలు వచ్చినా నిబద్ధతతో నిలబడి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చేందుకు కమ్యూనిస్టు యోధురాలు యార్లగడ్డ జోయ ఎంతో కృషి చేశారని పలువురు వక్తలు కొనియాడారు. ఎన్‌టిఆర్ జిల్లా చందర్లపాడులోని తునికిపాటి కల్యాణ మండపంలో మంగళవారం సిపిఎం ఎన్‌టిఆర్ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ అధ్యక్షతన యార్లగడ్డ జోయ సంతాప సభ నిర్వహించారు. ఈ సభలో సిపిఎం నాయకులు మాట్లాడుతూ జోయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సిపిఎం ఉమ్మడి కృష్ణా జిల్లా సభ్యులుగా పనిచేసిన ఆమె పార్టీ నందిగామ డివిజన్ కార్యదర్శిగా బాధ్యత నిర్వహించారని, మహిళా సంఘం, రైతు ఉద్యమాలలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. విజయ మిల్క్ డెయిరీ డైరెక్టర్‌గా, చందర్లపాడు పాల కేంద్రం డైరెక్టర్‌గా బహుముఖ బాధ్యత నిర్వహించారని, అఖిలభారత కిసాన్ కమిటీ సభ్యులుగా ఉన్నారని పేర్కొన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర, పాల ఉత్పత్తిదారుల సమస్యల పరిష్కారం, వ్యవసాయ సంక్షోభంపై ప్రభుత్వాలు దృష్టి సారించేలా అనేక పోరాటాలు నిర్వహించారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, రైతు సంఘం రాష్ట్ర సీనియర్ నాయకులు వై కేశవరావు, ఎంబివికె బాధ్యులు ఆర్ తులసీరావు, స్వరూపరాణి, పి మురళీకృష్ణ, పి విజయ, ప్రజాశక్తి ఎడిటర్ బి తులసీదాస్, సిపిఎం నందిగామ కమిటీ సభ్యులు కటారపు గోపాల్, చనుమోలు సైదులు తదితరులు పాల్గొన్నారు.
యార్లగడ్డ జోయ చిత్రపటానికి మాజీ హోం శాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు, నందిగామ మాజీ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, జగ్గయ్యపేట నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసిపి చందర్లపాడు మండల కన్వీనర్ కందుల నాగేశ్వరరావు, జడ్‌పిటిసి చైర్మన్ ముక్కపాటి నరసింహారావు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ వెలగపూడి వెంకటేశ్వరరావు, రాయల జానకి రామయ్య తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)