- ప్రశ్న రావణ్‌పై ఉపా కేసు ఉపసంహరించి విడుదల చేయాలి
- వామపక్ష పార్టీల డిమాండ్
- ప్రకాష్ రాజ్‌పై మౌఖిక దాడి అప్రజాస్వామికం
- లెఫ్ట్ పార్టీల నాయకుల ఆగ్రహం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అంతం చేసే ప్రయత్నం జరుగుతోందని, ప్రశ్నించేవారిపై కేసులు పెట్టి వేధించే చర్యలకు కూటమి ప్రభుత్వం పాల్పొడుతోందని వామపక్ష పార్టీల నాయకులు తెలిపారు. ఇటువంటి చర్యలను ఉపసంహరించు కోకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. వామపక్ష పార్టీల సమావేశం సోమవారం సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో ఎస్‌యుసిఐ(సి) రాష్ట్ర కార్యదర్శి బిఎస్ అమర్‌నాథ్ అధ్యక్షతన జరిగింది. అనంతరం బాలోత్సవ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అంతం చేసే విధంగా తీవ్ర పరిణామాలు జరుగుతున్నాయని, ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. పవన్‌కల్యాణ్‌ను విమర్శించారనే పేరుతో యూట్యూబర్ మీద ఉపా చట్టం, రాజద్రోహం కింద కేసులు పెట్టడం అన్యాయమని అన్నారు. ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ప్రభుత్వం వెంటబడి వేధించడం దారుణమని తెలిపారు. విమర్శించారని ఉపా కేసు పెడితే జనసేన, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు పోలీసులను నెట్టి పోలీసు స్టేషన్ గోడలు దూకి రావణ్‌పై దాడికి ప్రయత్నించారని, దీన్నేమనాలని ప్రశ్నించారు. ప్రశ్నించేవారి గొంతు నొక్కుతూ వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ప్రయత్నాలను విరమించుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు. రావణ్‌ను కేంద్రంగా చేసుకుని బిజెపి.. దళితులను, క్రైస్తవులను టార్గెట్ చేస్తోందని తెలిపారు. ఇందులోకి ప్రకాష్ రాజ్‌ను కూడా లాగి అతనిపైనా కేసు పెట్టి వేధించాలని డిమాండ్ చేస్తోందని విమర్శించారు. రావణ్, ప్రకాష్‌రాజ్ కలిసి పనిచేస్తున్నారని రాష్ట్ర మంత్రి దుర్గేష్ అనుమానం వ్యక్తం చేస్తూ ఆడియో రికార్డులు కూడా ఉన్నాయంటున్నారని, వారి ఫోన్లను ట్యాప్ చేసే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. దీనిపై ఆయన వివరణ ఇవ్వాలన్నారు. ఇదే పద్ధతులు అనుసరిస్తే భవిష్యత్‌లో ప్రజాస్వామ్య హక్కులకు రక్షణ ఉండదని, దీనిపై అధికార పార్టీ సమాధానం చెప్పాలన్నారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణే తమ ధ్యేయమన్న టిడిపి ఈ నిరంకుశ చట్టాలను ప్రయో గించడాన్ని ఎలా అనుమతిస్తుందని ప్రశ్నించారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 1,549 సోషల్ మీడియా కేసులు పెట్టారని, వాటిల్లో 1,344 మందిని అరెస్టు చేయడం ఆందోళనకరమని అన్నారు. ప్రభుత్వ తీరును ప్రశ్నించిన కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా ఖాతాలను నిలిపేశారని అన్నారు. ఇంకోవైపు రాముడి పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన బిజెపి ఇప్పుడు ఆ రాముడికే శఠగోపం పెట్టిందని, దేవాలయంలో దోపిడీ జరిగినా ప్రధాని మాట్లాడడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో బిజెపి మెల్లిగా వారి పద్ధతులను దిగుమతి చేస్తోందని, దీనికి టిడిపి మద్దతిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ హత్య కేసులో నిందితులు ఎక్కడున్నారో తెలిసినా పట్టుకునేందుకు పది రోజులు ఆలోచించారని, ప్రశ్నించిన వారిని మాత్రం ఎలాంటి విచారణ చేయకుండా, వాస్తవాలు నిర్ధారించకుండా గంటల్లోనే అరెస్టు చేస్తున్నారని అన్నారు. అలాగే స్టాండప్ కమెడియన్లనూ వేధించారని, రైతు సమస్యలపై పోరాడుతున్న అప్పలరాజుపై పీడీ యాక్టు పెట్టారని గుర్తు చేశారు. బుట్టాయిగూడెంలో గిరిజనుల కోసం నిలబడిన గిరిజన నాయకులపై రౌడీషీట్ ఓపెన్ చేశారని తెలిపారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడే సంప్రదాయం తెలుగు ప్రజలకు ఉందని, కేంద్ర ఆధిపత్యాన్ని సహించరని తెలిపారు. వెంటనే వేధింపులు ఆపాలని, అన్యాయంగా బనాయించిన కేసులను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు దోనేపూడి శంకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరెస్టుల పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారని అన్నారు. గతంలో పవన్‌కల్యాణ్ ప్రశ్నించే గొంతు పేరుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని, ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఒక మతాన్ని వెనకేసుకొచ్చారని ఆయనకు వర్తించని ఉపా చట్టం రావణ్‌కు ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. విమర్శలు చేస్తే సమాధానం చెప్పాలని, ఉపా, రాజద్రోహం కేసులు పెట్టడం సరికాదని అన్నారు. వాటిని వెనక్కు తీసుకోకపోతే ఆందోళన చేపడతామని తెలిపారు. ఎస్‌యుసిఐసి నాయకులు అమర్‌నాథ్ మాట్లాడుతూ.. ఉపా చట్టం ప్రజాస్వామ్య, చట్టబద్ధ పాలనకు పూర్తి వ్యతిరేకమని తెలిపారు. అధికార పార్టీలో ఉన్న వ్యక్తులు కుల, మతతత్వాన్ని పెంచి పోషిస్తున్నారని, అయినా వారిపై ఎటువంటి చర్యలూ లేవని తెలిపారు. న్యూడెమోక్రసీ నాయకులు కె పోలారి మాట్లాడుతూ.. పవన్‌కల్యాణ్ మాట్లాడిన మాటలనే రావణ్ మాట్లాడారని, అది అన్యాయం ఎలా అవుతుందని ప్రశ్నించారు. నిజంగా నేరమైతే ఇద్దరిపైనా కేసులు పెట్టాలని అన్నారు. ఎంసిపిఐ (యు) నాయకులు ఖాదర్ బాషా మాట్లాడుతూ.. ప్రశ్నిస్తే ఉపా కేసులు పెట్టడం అన్యాయమని తెలిపారు. సిపిఐఎంఎల్ నాయకులు జాస్తి కిషోర్ మాట్లాడుతూ.. దేశంలో రాజకీయ, సామాజిక కల్లోలం పెరుగుతోందని అన్నారు. గతంలో కె నాగేశ్వర్, జర్నలిస్టు కెవిఆర్, ఇప్పుడు రావణ్‌పై వేధింపులకు దిగడం సరికాదని, ప్రభుత్వం ఇటువంటి చర్యలను వెనక్కు తీసుకోకపోతే భవిష్యత్ కార్యాచరణ రూపొందించి ఆందోళన చేపడతామని అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, న్యూడెమోక్రసీ నాయకులు ఎస్ సత్యనారాయణ పాల్గొన్నారు. సమావేశానికి హాజరుకాలేకపోయిన సిపిఐఎంఎల్ (లిబరేషన్), ఆర్‌ఎస్‌పి, ఫార్వార్డ్ బ్లాక్, సిపిఐఎంల్ (న్యూడెమోక్రసీ) పార్టీలు నిర్ణయాలకు మద్దతు ప్రకటించాయి.







కామెంట్‌లు (0)