పోలవరం నిర్వాసితులకు పూర్తి పరిహారం చెల్లించాలి..
వన్‌టైమ్ సెటిల్మెంట్ పేరుతో అన్యాయం చేయొద్దు - సిపిఐ(యం)
విజయవాడ : పోలవరం నిర్వాసితులకు పూర్తి పరిహారం చెల్లించాలని, వన్‌టైమ్ సెటిల్మెంట్ పేరుతో అన్యాయం చేయొద్దు అని సిపిఐ(యం) డిమాండ్ చేసింది. శనివారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం అధ్యక్షతన విజయవాడ యం.బి.విజ్ఞానకేంద్రంలో సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు, అన్ని జిల్లాల కార్యదర్శులు హాజరయ్యారు.
సమావేశం ఆమోదించిన తీర్మానం..
'' వన్‌టైం సెటిల్మెంట్ పేరుతో 3,300 మంది పోలవరం నిర్వాసితులకు అన్యాయం చేయొద్దని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రస్తుత ధరలకనుగుణంగా పరిహారం, పునరావాసం కల్పించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. పోలవరం నిర్వాసితులకు అతి తక్కువ పరిహారం ఇచ్చి చేతులు దులుపుకొని పంపించేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఇప్పటికే నిర్వాసితులకు చాలా అన్యాయం జరిగింది. ఏళ్ల తరబడి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఉపాధి లేదు. సంక్షేమం నిర్లక్ష్యం చేయబడింది. ఇలాంటి పరిస్థితుల్లో 2013 భూసేకరణ చట్టాన్ని అనుసరించి ఇవ్వాల్సిన పరిహారం భూమికి భూమి, నివాస స్థలం, ఆరఅండఆర్ ప్యాకేజీ మొత్తం కూడా యదావిధిగా వాళ్ళకి ఇవ్వాలి. 41.15 మీటర్ల వద్ద మొదటి దశ అనే పేరుతో మొత్తం నిర్వాసితులను కుదించేశారు. మొత్తం లక్ష 6 వేల మంది నిర్వాసితులకు 35,000 మందికి మాత్రమే మొదటి దశ పేరుతో ఇస్తున్నారు. 2018లో 22,000 మందికే ఇవ్వాలని నిర్ణయించారు. సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్ర చేసి పెద్ద ఎత్తున పోరాటం జరిపిన తర్వాత దానికి మరి కొన్ని జోడించి 35,000 చేశారు. ఆ కాంటూర్ లెక్కలే తప్పని మేము చెబుతున్నాం. ఒకే ఊర్లో అటు సగం ఇటు సగం రెండు దశల కింద విడగొట్టారు. కొద్దిపాటి వరదలకు మునిగిపోతున్న గ్రామాలను కూడా రెండో దశలో చేర్చారు. ప్రభుత్వం కేవలం తన ఖర్చుని తగ్గించుకోవడానికి మొదటి దశ, రెండో దశ అని పెట్టి వాళ్ళని విడదీసి ఇప్పుడు మొదటి దశలో కూడా ఆ కొంత మందికి వన్ టైం సెటిల్మెంట్ చేస్తామని చెప్పడం అభ్యంతరకరం. ఇది గిరిజనులకి అన్యాయం చేయటమే. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.
చట్టబద్ధంగా 2013 భూసేకరణ చట్టం ప్రకారం మిగతా అందరూ నిర్వాసితులకి ఇచ్చినట్టే ఇవ్వాలి. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కింద రూ. 6 లక్షల 45 వేల పరిహారం (గిరిజనులకి) ఎప్పుడో నిర్ణయించినటువంటిది. ధరలు పెరిగాయన్న పేరుతో డ్యామ్ నిర్మించే కాంట్రాక్టర్లకి ప్రతి సంవత్సరం అప్డేట్చేసి చెల్లిస్తున్నారు. పెరిగిన ధరలకనుగుణంగా అని చెప్పి ఉన్నదానికన్నా పెంచి ఇస్తున్నారు. అక్కడ పని సరిగ్గా చేయకపోయినా దానికి వాళ్ళ దగ్గర డెమరేజ్ వసూలు చేయాల్సింది పోయి ప్రభుత్వమే ఎదురు ఇస్తున్నది. నిర్వాసితులకు మాత్రం ఎప్పుడో 2015-16లో నిర్ణయించినటువంటి దాన్నే ఇప్పుడు కూడా ఇస్తాం అంటున్నారు. 10,12 సంవత్సరాల తర్వాత కూడా పాత పరిహారం ఇస్తామనడం చాలా అన్యాయం. ఈరోజు ధరల ప్రకారం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఒకటి, రెండు దశలతో నిమిత్తం లేకుండా పూర్తి స్థాయిలో పునరావాస చట్టం ప్రకారం అన్ని పరిహారాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాము. దీని కోసం జరిగే ప్రజా పోరాటానికి సిపిఐ(యం) పూర్తి మద్దతు ప్రకటిస్తున్నది. ``







కామెంట్లు (0)