అమరావతి : సాంకేతిక కారణాలతో ఓటర్లను ఇబ్బంది పెట్టొద్దని కోరుతూ .... బుధవారం సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు.. ఛీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కి లేఖ రాశారు. దీనికి సంబంధించిన ఓ ఓటరు పడుతున్న ఆవేదన ప్రకటనను బుధవారం విడుదల చేశారు.
'' నాపేరు వంకాయలపాటి శ్రీనివాసరావు. నేను ప్రస్తుతం విజయవాడలో ఉంటున్నాను. సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి బాధ్యతల్లో ఉన్నాను. 2026 ‘సర్’ ప్రక్రియ సందర్భంగా నేను ఓటరుగా నమోదై ఉన్నాను. నాకు ఇటీవల నోటీసు జారీ చేశారు. అందులో 2002 లిస్టుకి ప్రస్తుత ఓటర్ల లిస్టుకి మధ్య తండ్రి పేరులో వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు. ఆగష్టు 21 మధ్యాహ్నం 12 గంటలకు “అసలు ధృవీకరణ పత్రాలు”తో సర్కిల్ II జోనల్ కమిషనర్ ముందు హాజరు కమ్మని తెలియచేసి ఉన్నారు. ఆ వ్యత్యాసం ఏమిటి? నేను ఏ రకమైన ధృవీకరణ పత్రాలు ఇవ్వాలో తెలియజేయలేదు. ఇందులో గమనిక పేరుతో 2 వ పేజీలో ఇచ్చిన అంశాలు ఓటరును భయపెట్టేవిగా ఉన్నాయి. 44 లక్షల మంది ఓటర్లను ఇలా మానసిక హింసకు గురిచేయడం సరైందేనా? తండ్రి పేరులో ఉన్న తప్పు ఏమిటి? తెలుగులో అన్ని సరిగ్గానే ఉన్నాయి. మన రాష్ట్రంలో తెలుగు పదాలనే ప్రమాణికంగా తీసుకోవాలి. ఇంగ్లీషులో ఒక అక్షరం బదులు మరో అక్షరం ఉంటే ఎవరిది బాధ్యత? దీన్ని ఎవరు రాశారు? నేను 2016లో ఢిల్లీలో ఓటరును. 2018లో అక్కడ నుండి విజయవాడకు ఓటరు కార్డు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాను. మీ రికార్డుల్లో ఉంటుంది. ఢిల్లీ EPIC కార్డులో ‘VENKATA SWAMY'అనే వుంది. ఆధార్‌లోనూ అదే వుంది. కానీ 2002 ఓటరు లిస్టులో లేదా ప్రస్తుతం విజయవాడలో ఓటరు లిస్టు ఆంగ్ల పదాల్లో ఉన్న తేడాకు బాధ్యత ఎవరిది? ఈ విషయంపై నోటీసు ఇచ్చి ఇలా ఆఫీసుల చుట్టూ తిప్పుకోవడం సమంజసం కాదు. పేరులో వచ్చిన తేడాకు బాధ్యత ఎవరిదో తేల్చండి. నాదే బాధ్యత అయితే తెలియజేయండి. లేదా మీ తప్పయితే సరిదిద్దండి. అందుకు నన్ను ఇబ్బంది పెట్టడం ఏ విధంగానూ న్యాయం కాదు. మీ బాధ్యతను నా మీద పెట్టడం సముచితం కాదు. నాలాగే రాష్ట్రంలో దాదాపు 44 లక్షల మంది ఓటర్లను ఇబ్బంది పెడుతున్నారు. ఇందులో అత్యధిక భాగం సాంకేతిక పరమైన తప్పులు. అధికారుల స్థాయిలోనే సరిదిద్దగలిగినవి. ఇందు వెంట సంబంధిత పత్రాలు జతచేస్తున్నాను. పరిశీలించి నా ఓటు హక్కును కాపాడాలని కోరుతున్నాను. `` అని ఓటరు రాసిన వివరణను వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)