శనివారం, 26 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తుఫాన్‌తో నష్టపోయిన ఉత్తరాంధ్ర రైతులను ఆదుకోవాలి : సిపిఐ(యం)

11 గంటల క్రితం

Farmers in North Andhra affected by the cyclone must be supported: CPI(M)
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 03:42 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఎకరాకు రూ.50వేలు నష్టపరిహారం ఇవ్వాలి.

  • బాధితులందరికీ ఉచిత రేషన్ ఇవ్వాలి.

  • కూలీల కుటుంబానికి రూ.10 వేలు ఇవ్వాలి. -సిపిఐ(యం)


విజయవాడ : తుఫాన్‌తో నష్టపోయిన ఉత్తరాంధ్ర రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ(యం) డిమాండ్ చేసింది. దీనికి సంబంధించి శనివారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఓ ప్రకటనను విడుదల చేశారు. గడిచిన మూడు, నాలుగు రోజులుగా వాయుగుండం ప్రభావంతో వచ్చిన తుఫాన్ ఉత్తరాంధ్ర జిల్లాల రైతాంగానికి తీవ్రమైన నష్టాన్ని కలిగించిందన్నారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాలలో వందలాది గ్రామాలలో వేలాది ఎకరాలలో రైతులు వేసిన వరి, పత్తి, మిర్చి, అరటి, బొప్పాయి వంటి పంటలు చేతికి వచ్చే దశలో నీటిపాలయ్యాయని తెలిపారు. పేదలు ఉపాధి కోల్పోయారని అన్నారు. తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ఉత్తరాంధ్ర, ఏజెన్సీ ఆదివాసీ రైతులను ఆదుకోవాలని, ఎకరాకు రూ. 50 వేలు నష్టపరిహారం ఇవ్వాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నదని పేర్కొన్నారు. పేదలు కోలుకునే వరకు నిత్యావసరాలతో రేషన్, కూలీలకు రూ.10 వేలు ఆర్ధిక సహాయం చేయాలని డిమాండ్ చేస్తున్నదన్నారు. అసలే కరువుతో అల్లాడుతున్న ప్రజలపై మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుగా తుఫాను వచ్చి పడిందని... అందువల్ల యుద్ధ ప్రాతిపదికపై తుఫాను బాధిత ప్రజానీకాన్ని ఆదుకోవాలని వి.శ్రీనివాసరావు కోరారు.


తుఫాను తీరం దాటినా మూడు రోజులుగా ఒడిశాలో కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి విజయనగరం జిల్లాలోని నాగావళి, జంఝావతి, స్వర్ణముఖి, వేగావతి నదులు ఉగ్రరూపం దాల్చాయని, దీంతో నదీతీర గ్రామాలు ముంపునకు గురయ్యాయని వి.శ్రీనివాసరావు ప్రకటనలో తెలిపారు. వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగి రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారని, అసలే అంతంత మాత్రంగా ఉన్న పంటలు ఈ తుఫాన్‌తో వచ్చిన వర్షాలతో చేతికొచ్చే దశలో పంటలు దెబ్బ తినడంతో రైతాంగం తీవ్రమైన ఆందోళనలో ఉన్నారని వివరించారు. శ్రీకాకుళం జిల్లా 28 మండలాల్లో 382 గ్రామాల్లో సుమారు 30 వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయన్నారు. పాలకొండ, బూర్జ, లావేరు మండలాల్లోని అనేక గ్రామాలలో రైతులు వేసిన పంటలన్నీ పూర్తిగా నీటమునిగి దెబ్బతిన్నాయని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో రోడ్లు దెబ్బ తినడంతో 40 గ్రామాలకు పైగా రాకపోకలు నిలిచిపోయాయని చెప్పారు.


తోటపల్లి, జంఝావతి, మడ్డువలస ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండటంతో వచ్చిన నీటిని వచ్చినట్టు కిందికి వదిలి పెడుతున్నారని, దీంతో నదీతీర గ్రామాలు ముంపునకు గురయ్యాయని శ్రీనివాసరావు తెలిపారు. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయన్నారు. నాగావళి ఉధృతివల్ల పలు గ్రామాలను వరద చుట్టుముట్టిందన్నారు. ఎగువన ఉన్న ఛత్తీస్ గఢ్, ఒడిశా నుండి వస్తున్న వరద నీటితో తుఫాను కారణంగా విజయనగరం జిల్లాలో పంట నష్టం జరిగిందని తెలిపారు. రాజోలి మండలంలో సుమారు 200 ఎకరాలు అరటి, పత్తి, మొక్కజొన్న పాడైందని అన్నారు. సోసేరు గ్రామానికి చెందిన రైతు 15 ఎకరాల్లో పంట దశకు వచ్చిందని, తుఫానుతో నేలమట్టం అయ్యి లక్షల రూపాయల పెట్టుబడిపోయిందని వివరించారు. నెల్లిమర్ల మండలంలో 120 ఎకరాల పత్తి, 15 ఎకరాల్లో మొక్కజొన్న నేలకొరిగిందని తెలిపారు. చిపురుపల్లి మండలంలో 100 ఎకరాలకు పైన పత్తి, బొప్పాయి, మొక్కజొన్న నేలకొరిగి లక్షల్లో పంట నష్టం వాటిల్లిందన్నారు. పోలవరం జిల్లాలోని చింతూరు డివిజన్ పరిధిలో శబరి నది ఒక్కసారిగా పోటెత్తడంతో చింతూరు మండలం కుయిగూరు, సోకిలేరు, జల్లివారి గూడెంలలో వరదనీరు గ్రామాల్లో ప్రవేశించిందని తెలిపారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి వరద పోటెత్తుతోందన్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్‌వద్ద శుక్రవారం సాయంత్రానికి 4 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం రికార్డు అయిందని, దీంతో కోనసీమ లంక గ్రామాల్లో ప్రజలు బిక్కు బిక్కుమంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పంటలన్నింటినీ గుర్తించి ఎకరాకు రూ.50 వేలు చొప్పున నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నదని వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.
cpim letter


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్