ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కోల్‌కతా ఆర్‌జికార్‌ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్‌కి సుప్రీంకోర్టు బెయిల్‌

1 గంట క్రితం

Sandip Ghosh
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026, 03:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : కోల్‌కతాలోని ఆర్‌జి కార్‌ మెడికల్‌ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ఘోష్‌కి సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. సందీప్‌ ఘోష్‌ బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరిస్తూ కోల్‌కతా హైకోర్టు ఫిబ్రవరి 23న ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు జస్టిస్‌ ఎం.ఎం.సుందరేష్‌, పి.బి.వర్లేలతోకూడిన ధర్మాసనం శనివారం అనుమతించింది. ఘోష్ సుదీర్ఘకాలం పాటు జైలులో ఉన్న విషయాన్ని, విచారణ జరుగుతున్న తీరును పరిగణనలోకి తీసుకున్నట్లు ధర్మాసనం తెలిపింది. ఆయన రెండేళ్లకు పైగా కస్టడీలో ఉన్నారని, ఇప్పటివరకు 147 మంది సాక్షులలో కేవలం ఏడుగురిని మాత్రమే విచారించారని, దీంతో కేసు పరిస్థితి అర్థమైందని పేర్కొంది. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, నిందితుడు జైలులో గడిపిన కాలాన్ని, విచారణ ఏ దశలో ఉందనే అంశాలను దృష్టిలో ఉంచుకుని, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నామని, ఈ అప్పీల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపింది. బెయిల్‌కు సంబంధించిన నిబంధనలు, షరతులను ట్రయల్ కోర్టు నిర్ణయిస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


ఘోష్‌పై ఉన్న కేసును దర్యాప్తు చేసిన సిబిఐ, 2024, ఆగస్టు 24న ఆయన పేరును చార్జ్‌షీటులో చేర్చింది. అవినీతి నిరోధక చట్టం కింద నేరాలతో పాటు, బిఎన్‌ఎస్‌లోని సెక్షన్లు 120బి, 409, 420, 468, 471 కింద నేరపూరిత కుట్ర, నమ్మక ద్రోహం, మోసం, ఫోర్జరీ, ఫోర్జరీ పత్రాలను ఉపయోగించడం వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. అలాగే కళాశాలలో ఆర్థిక అవకతవకలు, మెరిట్ స్కోర్‌లను తారుమారు చేయడం ద్వారా అనర్హులైన అభ్యర్థులకు వసతి కల్పించారనే ఆరోపణలు ఉన్నాయి. 2025,జనవరి 7న విచారణ కోర్టు ఆయన బెయిల్ దరఖాస్తులను తిరస్కరించిన తర్వాత, ఆపై 2026 ఫిబ్రవరి 23న కోల్‌కతా హైకోర్టు కూడా వాటిని కొట్టివేసింది. 2024 ఆగస్టు 9న ఆర్‌జి కార్‌ ఆస్పత్రిలో ట్రైనీ వైద్యురాలి అత్యాచారం కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్