మంగళవారం, 10 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎన్నికల అక్రమాల పై రేపు నిరసన : వి.శ్రీనివాసరావు

33 నిమిషాల క్రితం

LIVE CPIM AP press conference on local body election results
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026, 03:36 అపరాహ్నం | 4 నిమిషాల చదవడం

  • భాగస్వామ్య సదస్సు పేరుతో కార్పొరేట్ టూరిజం : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

  • పదిశాతం పెట్టుబడులు కూడా రాలేదు

  • రెండు శాతం కూడా ఉపాధి లేదు

  • ప్రజా సమస్యలు గాలికొదిలి పబ్లిసిటీ మొగ్గు

  • ధరలు అదుపు చేయలేక నోట్ల రద్దు చర్చ


విజయవాడ : భాగస్వామ్య సదస్సుల పేరుతో పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి కల్పించలేని ప్రభుత్వం ఆ పేరుతో కార్పొరేట్ టూరిజం నిర్వహిస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. మంగళవారం విజయవాడలోని బాలోత్సవ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం జరిగిన కార్యదర్శివర్గ సమావేశంలో చర్చించిన అంశాలను వెల్లడించారు.


పెట్టుబడుల పేరుతో 2016 నుండి నిర్వహిస్తున్న సదస్సుల ద్వారా చేసుకున్న ఎంఓయుల్లో పదిశాతం పెట్టుబడులు కూడా రాలేదని, కనీసం రెండుశాతం ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ జరిగిన ఒప్పందాల ప్రకారమే 50 లక్షల మందికి ఉపాధి రావాల్సి ఉందని, కానీ కొద్దిమందికి కూడా దక్కలేదని అన్నారు. కోనసీమలో రిలయన్స్ కంపెనీ గ్యాస్ కంపెనీ ఏర్పాటు సమయంలో లక్ష ఉద్యోగాలు వస్తాయని చెప్పారని 3200 మందికి మంచి ఇవ్వలేదని తెలిపారు. 30 వేలమందికి ఉపాధి అన్న కియాలో 12 వేలమందికి కూడా ఇవ్వలేదన్నారు. స్పిన్నింగ్ మిల్లులు, డైరీలు, చక్కల ఫ్యాక్టరీలు మూతపడ్డాయని, నష్టాలతో చిన్న పారిశ్రామికవేత్తలకు కన్నీళ్లు వస్తున్నాయని తెలిపారు. కియా గురించి అరిగిపోయిన రికార్డులా చెప్పడం తప్ప మరొకటి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు ఇవ్వకపోడం పక్కనబెడితే స్టీలు ప్లాంటులో పదివేల మందిని ఉద్యోగం నుండి తొలగించడంతో లక్షమందిపై ప్రభావం పడిందని తెలిపారు. ప్రభుత్వం పెట్టుబడి సదస్సులతోపాటు శ్రామిక సదస్సులు కూడా పెట్టి కార్మికుల హక్కులకు కాపాడాలని అన్నారు.


50 లక్షల ఉద్యోగాలెక్కడ ?

రాష్ట్రంలో 2016 నుండి 2025 వరకూ జరిగిన భాగస్వామ్య సదస్సుల పేరుతో చేసుకున్న ఒప్పందాల ప్రకారం పెట్టుబడులు రాలేదని, ఉపాధి కల్పించలేదని తెలిపారు. 2016లో 328 ఒప్పందాలు రూ.4.67 లక్షల కోట్లకు జరిగాయని, 10 లక్షల ఉద్యోగాలు ఇస్తాయని చెప్పారని, వచ్చింది 3200 మాత్రమేనని తెలిపారు. కియా సంస్థలో 30 వేల మందికి ఉపాధి అని చెప్పి 12 వేలమందికి మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు. 2017లో రూ.10.54 లక్షల కోట్లతో 665 ఒప్పందాలు జరిగాయని 22.34 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పారని అవేమీ కార్యరూపం దాల్చలేదన్నారు. 2018లో రూ.4.40 లక్షల కోట్లతో 734 ఒప్పందాలు జరిగాయని 11 లక్షల ఉద్యోగాలు హామీకే పరిమితం అయ్యాయన్నారు. 2023లో 13 లక్షల కోట్లు, 22 లక్షల ఉద్యోగాలు, 2025లో రూ.13.26 లక్షల కోట్లు 16.31 లక్షల ఉద్యోగాలు ఇస్తాయని చెప్పారని వీటిల్లో పదిశాతానికి మించి కార్యరూపం రాల్చలేదని తెలిపారు. ఎంఓయు చేస్తున్న కంపెనీల విశ్వసనీయతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని, కొన్ని బోగస్ లేదా ప్రాజెక్టును అమలు చేయగల ఆర్థిక సామర్థ్యం లేని సంస్థలనే ఆరోపణలు ఉన్నాయని, రాష్ట్రం తగినంత డ్యూడిలిజెన్స్‌ను తప్పనిసరి చేయలేదని శ్రీనివాసరావు తెలిపారు.


కాలుష్యంలో కాగుతున్న విశాఖ ....

ఇప్పటికే విశాఖ నగరంలో కాలుష్యం పెరిగిపోతుంటే డేటా సెంటర్ల పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు. అక్కడ వేడి పెరగడంతోపాటు కాలుష్యంతో పిల్లలు గాలిపీల్చుకోలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితి కొనసాగితే పదేళ్లలో విశాఖ నగరంలో జీవనం కష్టమవుతుందని అన్నారు. ఈ కాలుష్యానికి తోడు ఇథనాల్ అయిల్ కూడా తోడైందని విమర్శించారు. బిజెపికి చెందిన పారిశ్రామికవేత్తలకు లాభాలు కట్టబెట్టేందుకు తప్ప ఇథనాల్ వల్ల ఉపయోగం లేదని తెలిపారు. కేరళ, కర్నాటకలు ఈ సమస్యపై ఆందోళనలు సాగుతున్నాయన్నారు. దీనిపై నిపుణుల కమిటీ వేసి విచారణ చేయాలని కోరారు.


సిపిఎం పురోగతి ...

మున్సిపల్, పరిషత్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడంలో రాష్ట్ర ఎన్నికల సంఘం విఫలమైందని, జరగబోయే పంచాయతీ, పెండింగ్ మున్సిపల్ ఎన్నికలు అయినా స్వేచ్ఛగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం జరిగిన స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్షాలను అణచివేసేందుకు పోలీసులను వినియోగించారని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. సిపిఎం, సిపిఐ కార్యకర్తలపై అనేక ప్రాంతాల్లో దాడులు చేశారని, వారు గెలిస్తే తమ అవినీతిని ప్రశ్నిస్తారనే భయంతో ప్రభుత్వం కూడా ఏకపక్షంగా వ్యవహరించిందని విమర్శించారు. ఈ ఎన్నికల్లో నిర్బంధాన్ని, దౌర్జన్యాలు, దాడులను ఎదుర్కొంటూనే సిపిఎం మెరుగైన ఫలితాలు సాధించిందని తెలిపారు. ముఖ్యంగా వామపక్ష ఐక్యతను నిలబెట్టుకున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లోనూ వామపక్షాలు ఉమ్మడిగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. 2021తో పోలిస్తే ఈసారి సిపిఎం పురోగతి సాధించిందని, పోటీచేసిన ప్రాంతాల్లో గతంలో 7.4 శాతం ఓట్లు వస్తే ఈ ఎన్నికల్లో 8.2 శాతం ఓట్లు వచ్చాయని, సిపిఎంకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. నిర్బంధాన్ని ఎదుర్కొని ధైర్యంగా పనిచేసిన నాయకులు కార్యకర్తలను అభినందించారు.


ముఖ్యమంత్రి ప్రకటన ఆత్మవంచన ....

తమ సుపరిపాలనకు ఈ ఎన్నికల్లో ప్రజలు మద్దతు ఇచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం ఆత్మవంచనని, బలవంతంగా రిగ్గింగు చేసుకుని, బెదిరించి, భయపెట్టి ప్రజల విశ్వాసాన్ని నమ్మించి మోసం చేసి ఇప్పుడు ప్రజాతీర్పు అనడం ప్రజలను అవమానించడమేనన్నారు. 2021లో వైసిపికీ ఇలాంటి ఫలితాలే వచ్చాయని, ఇప్పుడు టిడిపి కీ అలాగే వచ్చాయని పార్టీ మారిందే తప్ప అంకెలు, పద్ధతులు మారలేదని అన్నారు. 2024 ఎన్నికల ముందు వైనాట్ 175 అన్న జగన్ 11 సీట్లకు పరిమితం అయ్యారని, ఇప్పుడు 100 శాతం స్ట్రైక్ రేట్ అంటున్న టిడిపికి కూడా అదేగతి పడుతుందని అన్నారు. 2029 ఎన్నికల్లో టిడిపి గుణపాఠం నేర్చుకోక తప్పదని హెచ్చరించారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగి ఉంటే 3.6 శాతం పెరుగుద కాదు కదా అంతకుమించి తరుగుదల ఉండేదని చంద్రబాబు గుర్తించాలన్నారు. ఈ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై సిపిఐ(యం), సిపిఐ 11వ తేదీ నిరసన పిలుపును జయప్రదం చేయాలని కోరారు.


అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓటమిపై మాట్లాడుతూ మత మార్పిడులు కారణం కావచ్చనడం ప్రమాదకర విశ్లేషణ అన్నారు. మత ప్రాతిపదికపై రాష్ట్రంలో విభజన రాజకీయాలు ప్రవేశపెట్టవద్దని హెచ్చరించారు. జిఓ3 రద్దు, 1/70 అమలుపై గట్టి చర్యలు తీసుకోకపోవడం, భూపట్టాలు ఇవ్వకపోవడం, కార్పొరేట్లకు పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లు, బాక్సైట్ గనులు కట్టబెట్టే ప్రయత్నాలను వ్యతిరేకంగా తీసుకుని ప్రజలు తీర్పు ఇచ్చారని గుర్తించాలన్నారు. ఆ సమస్యలను పరిష్కరించి యువత విశ్వాసాన్ని చూరగొనాలన్నారు. 30 ఏళ్లకు సరిపడ కొత్త నాయకత్వం వచ్చిందని చంద్రబాబు చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కుటుంబ వారసులను తెచ్చి పార్టీలో సమర్థులను వెనక్కు నెట్టడం యువతను ప్రోత్సహించే పద్దతేనా అని ప్రశ్నించారు.


తుఫాను బాధితులను ఆదుకోండి ...

వరుసగా వచ్చిన ఆర్నబ్, మురసు తుఫానులకు సంబంధించి ఇప్పటి వరకూ ఎన్యూమరేషన్ చేయలేదని, పరిహారం అందలేదని అన్నారు. పదికేజీల బియ్యం ఇస్తామని ప్రకటించినా ఇవ్వలేదని, కొబ్బరిచెట్లు, ఇళ్లు, పంటలు దెబ్బతిన్నాయని, నష్టపోయిన కౌలురైతుల వివరాలూ ఇంతవరకు నమోదు చేయలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎన్యూమరేషన్ పూర్తి చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు.


ధరలు అదుపుచేయలేక నోట్ల రద్దు చర్చ ...

పెరిగిన ధరలు అదుపుచేయలేక ప్రజలను పక్కదారి పట్టించేందుకు పెద్దనోట్ల రద్దు చర్చను ముఖ్యమంత్రి ముందుకు తెచ్చారని శ్రీనివాసరావు విమర్శించారు. నోట్ల రద్దు జరిగి పదేళ్లయిందని అయినా దేశంలో నల్లడబ్బు విచ్చలవిడిగా చెలామణి అవుతోందని అన్నారు. ఉగ్రవాదమూ తగ్గలేదని తెలిపారు. షేర్ మార్కెట్లోకి డార్క్ మనీ పెద్ద ఎత్తున వచ్చి పడుతోందని పేర్కొన్నారు. యుపిఐ లావాదేవీలు పెరిగితే అమెరికన్ కంపెనీలకు లాభాలు తప్ప ప్రజలకు ఒరిగేదేమీ ఉండదన్నారు. రూ.500 నోట్ల రద్దు సమస్యలను పరిష్కరించకపోగా కొత్త సమస్యలకు కారణం అవుతుందని హెచ్చరించారు.
011

022


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్