- మరింత మెరుగైన ఆరోగ్య సదుపాయాలు కల్పించండి
- ముఖ్యమంత్రికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి లేఖ
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో: రాప్తాడులో ఉన్మాది దాడి బాధిత బాలికల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని, వారికి మరింత మెరుగైన ఆరోగ్య సదుపాయాలు కలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు శనివారం ఆయన లేఖ రాశారు. అనంతపురం జిల్లా రాప్తాడు పాఠశాలలో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన గోపిక, లక్ష్మి ప్రాణాలను కాపాడేందుకు సకాలంలో అనంతపురం ప్రభుత్వ వైద్యులు సమన్వయంతో అభినందనీయమైన కృషి చేశారని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన సిబ్బంది, పరికరాలు అందుబాటులో ఉంచగలిగితే ఎంతటి క్లిష్టమైన వాటిని కూడా అక్కడి వైద్యులు, సిబ్బంది ఎదుర్కోగలరని మరోసారి రుజువైందని పేర్కొన్నారు. ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి బెంగుళూరులో వైద్యం పొందుతున్న గోపిక రాప్తాడు మండలం అయ్యవారిపల్లె గ్రామానికి చెందిన బోయ వెంకట్రాముడు, పార్వతమ్మ కుమార్తెని, వీరికి ఈ అమ్మాయితోపాటు ఒక కుమారుడు ఉన్నాడని తెలిపారు. వ్యవసాయ కూలీపనులు చేసుకుంటూ ఇద్దరి పిల్లలను చదివించుకుంటున్నారని, ఉమ్మడి ఆస్తిలో ఒకటిన్నర ఎకరం మెట్టపొలం మాత్రమే ఉందని పేర్కొన్నారు. గోపిక ప్రస్తుతం బెంగుళూరులో వైద్యం పొందుతోందని, గోపికకు అండగా వెనువెంటనే స్పందించి గాయాలపాలైన విద్యార్థిని లక్ష్మి రాప్తాడు గ్రామానికి చెందిన నాగరాజు, రమాదేవి పెద్ద కుమార్తెని, వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారని వివరించారు. దళిత కుటుంబానికి చెందిన వీరికి ఎలాంటి ఆస్తులూ లేవని పేర్కొన్నారు. ఆర్డిటి వారి సహాయంతో నిర్మించుకున్న చిన్న ఇల్లు మాత్రమే ఉందని, స్నేహితురాలిపై జరుగుతున్న దారుణాన్ని సాహసంతో అడ్డుకోబోయిన లక్ష్మిపై ఆ ఉన్మాది దాడిచేయడంతో రెండు కాళ్లు తీవ్రంగా గాయమయ్యాయని వివరించారు. ప్రస్తుతం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందుతోందని, బెంగుళూరులో చికిత్స పొందుతున్న గోపిక ఆరోగ్యాన్ని ప్రభుత్వ వైద్య సిబ్బందికి చెందిన ఒకరు అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. అనంతపురంలో చికిత్స పొందుతున్న లక్ష్మి దగ్గర అలాంటి ఏర్పాటులేదని, రెండు రోజుల్లో ఈ అమ్మాయిని ఆసుపత్రి నుండి డిశ్చార్జీ చేస్తున్నట్లు వైద్యులు తెలిపారని పేర్కొన్నారు. స్వయంగా తాను ఈ నెల 13న సిపిఎం బృందంతో పరామర్శించిన సందర్భంగా వారి కుటుంబ సభ్యులు పలు వివరాలు చెప్పారని పేర్కొన్నారు. ప్రస్తుతం లక్ష్మి కోలుకుంటున్నప్పటికీ వైద్య సిబ్బంది సహాయం అవసరం ఉందని, ఈ రెండు కుటుంబాలు వ్యవసాయ కూలీ పనులమీద ఆదారపడి జీవిస్తున్నాయని సిఎంకు రాసిన లేఖలో తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం వైద్య సహాయం అందిస్తున్నప్పటికీ ఈ అమ్మాయిల భవిష్యత్, చదువులు, ఇతర అవసరాలు, తల్లితండ్రులకు మానసిక ధైర్యం కలిగించేందుకు ప్రభుత్వం ఈ కుటుంబాలకు ఐదు ఎకరాల వ్యవసాయ భూమితో పాటు, రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని, లక్ష్మి తల్లికి శాశ్వత ఉద్యోగం కల్పించాలని కోరారు. ఈ దాడికి కారణమైన ఉన్మాది గత కొన్ని నెలలుగా గంజాయి తీసుకోవడం, అరాచకంగా ప్రవర్తించడం చేస్తున్నాడని స్థానికులు తెలిపారని వివరించారు. గంజాయి, డ్రగ్స్ నివారించడంపై ప్రభుత్వ మరింత దృష్టిని పెట్టడం, గంజాయి అమ్ముతున్న, సహకరిస్తున్న వారిని అన్ని రాజకీయ పార్టీలు బహిష్కరించడం వెంటనే చేయాల్సిన అత్యవసర కర్తవ్యంగా ఈ ఘటన మరోసారి రుజువు చేసిందని తెలిపారు. డ్రగ్స్‌ను పూర్తిగా అరికట్టడానికి పటిష్టమైన చర్యలు ప్రభుత్వం చేపట్టాలని కోరారు. గతంలో నెల్లూరులో డ్రగ్స్ మాఫియా చేతిలో హత్యకు గురైన పెంచలయ్య కుటుంబానికి ఇప్పటికీ ప్రభుత్వం నుండి పూర్తిస్థాయిలో సహాయం అందలేదని, ఇలాంటి ఘటనల్లో నిర్లక్ష్యమైనా, కాలయాపనైనా డ్రగ్స్ వ్యతిరేక పోరాటాన్ని నీరు గారుస్తుందని వివరించారు. విశ్వాసాన్నిచ్చే నిర్దిష్ట చర్యలు లేకుండా కేవలం ప్రచారానికే పరిమితమైతే అది ఎలాంటి ఫలితాలు ఇవ్వదని సిఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ అంశాలపై సకాలంలో వేగవంతమైన చర్యలు తీసుకోవాలని కోరారు. 







కామెంట్లు (0)