సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు
ఏజెన్సీ గిరిజనుల గొంతు నొక్కొద్దు
జిఓ 3ను పునరుద్ధరించాలి, 1/70 చట్టం కేసులో జోక్యం చేసుకోవాలి
పొగాకు రైతులను మోసం చేయొద్దు
భోగాపురం నిర్వాసితులకు అన్యాయం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో
బీహార్‌లోని బంకీపూర్ తీర్పుతో నరేంద్ర మోడీ పడవ మునుగుతోందని రుజువైందని, అందులో కూర్చున్న సిఎం చంద్రబాబు, టిడిపి కూడా మునగడం ఖాయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం బాలోత్సవ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బిజెపి జాతీయ అధ్యక్షులు ప్రాతినిధ్యం వహించిన బంకీపూర్ ఉప ఎన్నికల్లో సగానికి సగం ఓట్లు కోల్పోయి బిజెపి ఘోర పరాజయం పాలయిందని, దీనికి కారణమైన అక్కడ ప్రజలకు సిపిఎం తరపున అభినందనలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అవినీతి అక్రమాలతో విసిగిపోయిన ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. విద్యార్థులపై మోడీ అణచివేతకు ప్రజలు ప్రతీకారం తీర్చుకున్నారన్నారు. ఉప ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్‌లోనూ బిజెపి ఓడిపోయిందని, గుజరాత్‌లో గెలిచినా గతంలో వచ్చిన ఓట్ల కంటే సగం తగ్గాయని తెలిపారు. బిజెపికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని అన్నారు. అయోధ్యలో రామమందిరం పేరుతో ప్రజల మనోభావాలు రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన తరువాత రామమందిరం నిధులు దోచుకున్నారని అన్నారు.
ఢిల్లీలో విద్యార్థులపై దారుణమైన లాఠీఛార్జి జరిగిందని, దాన్ని సుప్రీంకోర్టు కూడా ఖండించిందని అన్నారు. అయినా పాఠం నేర్చుకోకుండా అదే సమయంలో చంద్రబాబు.. మోడీతో సభ పెట్టి స్తోత్ర పాఠాలు చెప్పారని, ముఖ్యమంత్రి స్థాయిని కూడా మర్చిపోయి దిగజారడం కంటే అవమానం మరొకటి లేదని అన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రైవేటు ఆధ్వర్యంలో ఉందని, దానికి ప్రభుత్వ నిధులు వందల కోట్లు ఖర్చు పెట్టి వేలమంది పిల్లలను వారి తల్లిదండ్రుల అనుమతి లేకుండా తరలించి వారిని కష్టపెట్టి మోడీని మెప్పించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. హాస్టల్లో ఉన్న పిల్లలను తీసుకెళ్లి ప్రధానికి భజన చేయించడం సరికాదని అన్నారు. ఎయిర్‌పోర్టుకు భూమిని దానం చేసింది రైతులని, కేటాయించింది ప్రభుత్వమని, అయినా దానిలో ప్రభుత్వ వాటా లేదని అన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం వల్ల కార్పొరేట్ కలలకు రెక్కలు వచ్చాయని, భూములిచ్చిన రైతులకు న్యాయం జరగలేదని అన్నారు. స్థానికులకు ఉద్యోగం ఇస్తామని చెప్పి 30 మందిని మాత్రమే తీసుకున్నారని, అది కూడా హౌస్ కీపింగ్ పనులు చేయిస్తున్నారని అన్నారు. ఇది చదువుకున్న ఉత్తరాంధ్ర యువతను అవమానించడం కాదా అని ప్రశ్నించారు. శ్రీకాకుళం నుండి తూర్పుగోదావరి జిల్లా వరకూ ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వొద్దని మౌఖిక ఆదేశాలు కూడా ఇచ్చారని విమర్శించారు. స్థానికులకు ఉద్యోగాలివ్వకుండా ఉత్తరాంధ్ర ఎలా వెలిగిపోతుందని ప్రశ్నించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు వల్ల కార్పొరేట్లు వెలిగిపోతున్నారని, ఉత్తరాం ధ్ర ప్రజలు కాదని అన్నారు. గతంలో వాజ్‌పేయి హ యాంలో దేశం వెలిగిపోతోందని ఊదరగొట్టారని, ఏమి జరిగిందో చూశారని అన్నారు.
ఏజెన్సీ గిరిజనుల గొంతు నొక్కొద్దు
ఏజెన్సీలో పిల్లలను థింసా నృత్యం కోసం తీసుకొచ్చారని, అక్కడ జిఓ 3 పునరుద్ధరణకు చర్యలు తీసుకోలేదని అన్నారు. కార్పొరేట్ సేవలో మునిగిపోయి ప్రజలకిచ్చిన వాగ్దానాలను విస్మరించారని విమర్శించారు. ఏజెన్సీలో భూములు కార్పొరేట్లకు ఎలా ఇవ్వాలనే చర్చ తప్ప ప్రజలకు, నిరుద్యోగులకు న్యాయం చేయాలనే శ్రద్ధ కనిపించడం లేదని అన్నారు. విసిగిపోయిన గిరిజన యువత దీనిపై ప్రతిరోజూ ఊరేగింపులు, ధర్నాలు చేస్తున్నారని, వారి సమస్య పరిష్కరించకుండా పాలకులు మాత్రం మమ్మల్ని నమ్మండి అని చెబుతున్నారని, ఎన్నాళ్లు నమ్ముతారని ప్రశ్నించారు. ఆగస్టు 8న బంద్ చేస్తామంటే ఆందోళనలు, నిరసనలు, బంద్‌లు నిషేధమని ఎస్‌పి ప్రకటన చేశారని, ఇంతకంటే అప్రజాస్వామికం మరొకటి లేదని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీనే అమలు చేయాలని గిరిజనులు కోరుతున్నారని అన్నారు. శాంతియుత ఆందోళనలు ప్రజల హక్కని సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే ఇక్కడ నిషేధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఎస్‌పి చట్ట విరుద్ద నోటిఫికేషన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. 7వ తేదీలోగా నోటిఫికేషన్ వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 7వ తేదీలోగా జిఓ 3ను పునరుద్ధరిస్తూ ఆర్డినెన్సు తేవాలని లేదా, అది సాధ్యం కాకపోతే కనీసం జిఓ అయినా ఇవ్వాలని కోరారు. అలా అయితేనే వాళ్లు శాంతిస్తారని, నిరసనలు, బంద్ ఆదివాసీ సంఘాలన్నీ కలిసి చేస్తున్నాయని పేర్కొన్నారు. న్యాయమైన గిరిజన యువత ఉద్యమానికి సిపిఎం మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. విశాఖలో గూగుల్ వాళ్లకు రూ.22 వేల కోట్లు కేటాయిస్తూ రాత్రికి రాత్రి జిఓ ఇచ్చిన పాలకులు నెలల తరబడి ఆందోళన చేస్తున్న ఆదివాసీల గోడు వినడానికి సమయం లేకపోవడం అన్యాయమని అన్నారు. యువత గోడు విననని చెప్పిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా చివరకు వారి గోడు విని సానుకూలంగా స్పందించాల్సి వచ్చిందని అన్నారు. చంద్రబాబు మాత్రం యువత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఏలూరు జిల్లాల్లో బిజెపి, టిడిపి, వైసిపి మూడు పార్టీలకు చెందిన భూస్వాములు కలిసి 1/70కి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేస్తే వారి కోసమే ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదని తెలిపారు. గతంలో జిఓ నెంబరు 3పై దాఖలైన కేసులో నాటి ప్రభుత్వాలు జోక్యం చేసుకోకపోవడంతో అది రద్దయిందని, ఇప్పుడు 1/70 చట్టం కేసులోనూ జోక్యం చేసుకోవడం లేదని, ఇది కూడా పోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఆగస్టు 7వ తేదీలోపు వీటిపై స్పష్టమైన ప్రకటన చేయాలని, జిఓ 3ను పునరుద్దరించాలని, 1/70 చట్టం పై సుప్రీం కోర్టులో కౌంటర్ వేయాలని డిమాండ్ చేశారు.
పొగాకు రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం
పొగాకు కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఐటిసి పొగాకు కొనకపోయినా ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదని అన్నారు. పైగా కిలో రూ.250కి కొనాల్సిన పొగానుకు రూ.100కు కొంటున్నారని, కనీస ధరను అమలు చేయాల్సిన ప్రభుత్వం కిలోకు రూ.10 బోనస్ ఇస్తామని, రూ.50 వేలు అప్పు ఇస్తామని చెప్పడం అన్యాయమని తెలిపారు. ఇప్పటికే అప్పుల్లో మునిగిపోయిన రైతుల్ని మరింత అప్పులపాలు చేయొద్దని కోరారు. రైతులు గిట్టుబాటు ధర కోరుతుంటే ప్రభుత్వం పట్టించుకోకుండా బడా వ్యాపారస్తుల కొమ్ముకాస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ఎకరాకు రూ.4 లక్షల నుండి రూ.5 లక్షల వరకూ నష్టపోతున్నారని అన్నారు. ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందని, పొగాకు కొనడం చేతగాకపోతే అదే చెప్పాలని, అంతేగానీ వారిని మోసం చేయొద్దని సూచించారు. పొగాకు రైతులు, ఆదివాసీలు, భోగాపురం రైతుల విషయంలో ప్రభుత్వం మోసం చేసిందని, దీన్ని ఎక్కువ కాలం ప్రజలు సహించరని హెచ్చరించారు.
డిఎస్‌సి స్పోర్ట్స్ కోటాపై విచారణ చేయాలి
డిఎస్‌సిలో స్పోర్ట్స్ కోటాలో ఇచ్చిన ఉద్యోగాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, దీనిపై విచారణ జరపాలని కోరారు. ఈ విచారణ చేయడంతోపాటు కొత్త జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, 20 వేల పోలీస్ కానిస్టేబుల్ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.








కామెంట్‌లు (0)