విజయవాడ : ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని .... అమరావతి రైతులు లేవనెత్తుతున్న న్యాయమైన కోర్కెలను సత్వరమే పరిష్కరించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరింది. దీనికి సంబంధించి ఆదివారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఓ ప్రకటనను విడుదల చేశారు. రాజధాని కోసం భూములను సమీకరించి 12 సంవత్సరాలు గడిచినా, చట్టబద్ధంగా నెరవేర్చాల్సిన అంశాలను ఇంకా పరిష్కరించకుండా కాలయాపన చేయటం ప్రభుత్వానికి తగదు అని అన్నారు. పూలింగ్ నుండి గ్రామ కంఠాల మినహాయింపు, సమంజసమైన నష్టపరిహారం చెల్లింపు, రైతుల ప్లాట్లలో నిర్మాణాలకు నిబంధనల సడలింపు, తదితర అనేక అంశాలను పరిష్కరించకుండా ప్రభుత్వం, సిఆర్‌డిఏ కాలయాపన చేయటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనీ, మళ్లీ ఆందోళనకు సిద్ధమవుతున్నారని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు రైతుల గోడు వినకుండా పెడ చెవిన పెట్టడం సరికాదన్నారు. బడా సంస్థలకు, కాంట్రాక్టర్లకు ఉదారంగా భూములను ఇస్తూ, రాయితీలను ప్రకటిస్తూ, నిబంధనలను సడలిస్తున్న పాలకులు అమరావతి రైతులు, ప్రజలకు చట్టబద్ధంగా నెరవేర్చాల్సిన అంశాలను పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. రాజధాని అసైన్డ్ భూములు, గ్రామకంఠాలు, తదితర విషయాలలో అవినీతి, అక్రమాలు, పక్షపాత వైఖరి చోటుచేసుకుంటున్నాయని రైతులు చేస్తున్న విమర్శలపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. స్వతంత్ర విచారణ జరిపించాలన్నారు. రైతులతో చర్చలు జరపాలన్నారు. నిర్ణీత కాలవ్యవధిలో సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి రైతులు, ప్రజల సమస్యల పరిష్కారానికి జరిగే ఆందోళనకు సిపిఐ(యం) మద్దతు ఇస్తుందని వి.శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
రాజధాని అమరావతి రైతుల న్యాయబద్దమైన కోర్కెలను జాప్యం లేకుండా పరిష్కరించాలి : సిపిఐ(యం)
12 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 27, 2026, 03:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)