బుధవారం, 28 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చెప్పిందేమిటి ? చేస్తుందేమిటి ? : వి.శ్రీనివాసరావు

2 గంటల క్రితం

What is Said vs What is Done V Srinivasa Rao
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 28, 2026, 04:49 అపరాహ్నం | 4 నిమిషాల చదవడం

కూటమి నాయకులు చెప్పేవి అసత్యాలు, అర్థసత్యాలు

చెప్పిందేమిటి చేస్తుందేమిటి ?

నీటిఛార్జీలు, అధిక ధరలు, డేటా సెంటర్లపై ప్రజలకు సమాధానం చెప్పాలి

జిఓ 160 రద్దు చేయాలి - జల్‌జీవన్ మిషన్లో పెద్దఎత్తున అవినీతి

యుద్ధ ప్రాతిపదికన ‘ఆర్నబ్‌’ సహాయక చర్యలు

50 శాతం పెరిగిన ధరలు : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు


విజయవాడ : స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటి ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, తదితరులు చేస్తున్న ప్రకటనలు అసత్యాలు, అర్థసత్యాలని, ప్రజలను తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. బుధవారం విజయవాడలోని బాలోత్సవ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావుతో కలిసి శ్రీనివాసరావు మాట్లాడారు. సిఎం, డిప్యూటి సిఎం, తదితరులు కలిసి ప్రజలకు అన్నీ చేశామని చెబుతున్నారని, ఏమి చెప్పారు, ఏమి చేశారో ఆ ప్రజలకు చెప్పాలన్నారు. 160 జిఒ ను తీసుకొచ్చి గ్రామాల్లో తాగే నీటిపై పన్నులు వేశారన్నారు. ఊరికి బయట ఉండే చెరువులు కుంటల నిర్వహణలో పది శాతం, గ్రామం లోపల నూటికి నూరు శాతం ప్రజల నుండి వసూలు చేస్తామని పేర్కొన్నారని తెలిపారు. ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవడంతో జిఓ ను వెంటనే కనబడకుండా చేశారని, ఇది మోసమని అన్నారు. జల్‌జీవన్ మిషన్ పేరుతో ఊరు ఊరుకూ ఉచితంగా మంచినీళ్లు ఇస్తామని నమ్మబలికి ఇప్పుడు కుళాయిలకు ఛార్జీలు వసూలు చేస్తామని చెప్పారని విమర్శించారు. చాలాచోట్ల కుళాయిలు బిగించి పైపు కనెక్షన్ ఇవ్వలేదని, డబ్బులు లేవని వదిలేశారని తెలిపారు. 160వ నెంబరు జిఓను ఎందుకు బ్లాక్ చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. జిఓను ఉపసంహరించుకుని నిజాయితీని నిరూపించుకోవాలని కోరారు. జల్‌జీవన్ మిషన్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని, కాంట్రాక్టర్లు వందల కోట్ల రూపాయలు తినేశారని, వాటిని కూడా ప్రజల నుండి వసూలు చేస్తారని చెప్పారు. ప్రజలపై భారాలు వేసే ఈ జిఓను వ్యతిరేకించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు 50 శాతంపైగా పెరిగాయని, రెండు నెలలుగా ఈ ధరలు పెరుగుదల ఎక్కువగా ఉందని, దేశంలో అత్యధికంగా రాష్ట్రంలో 6.3 శాతం ద్రవ్యోల్బణం ఉందని తెలిపారు. దీనికి కారణం మోడీ, చంద్రబాబు అని అన్నారు. మరోవైపు రేషన్ ‌షాపుల్లో రెండు మూడు రోజులు ఇచ్చి లేవని బోర్డు పెడుతున్నారని, ఇవి ఎక్కడికి పోతున్నాయో చెప్పాలని అడిగారు. కాకినాడ, గంగవరం పోర్టుకా ? లేదా బ్లాక్ మార్కెట్‌కు వెళుతున్నాయా ? తెలపాలన్నారు. ఎల్‌నినో తో పంటలు తగ్గాయని సొమ్ము చేసుకునేందుకు ధరలు 40 నుండి 60 శాతం పెంచారని ... ఇదేనా ప్రజలకు చేస్తున్న ఘనకార్యం అని ప్రశ్నించారు. పెరుగుతున్న ధరలను తగ్గించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు. రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులను చౌక ధరలకు ప్రజలకు అందించాలని కోరారు. బ్లాక్ మార్కెట్‌కు వెళ్లిన సరుకును బయటకు తీయాలని, నియంత్రణ విధించాలని అన్నారు. వస్తువులు బ్లాక్ మార్కెట్ ‌కు వెళ్లేందుకు వీలుగా గతంలో చట్టం, స్టాకు పెట్టుకునేందుకు ప్రభుత్వమే చట్టం చేసిందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధరల నియంత్రణకు తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. ధరలు అదుపుచేయకపోతే ఎన్నికల్లో ప్రతిఘటన ఉంటుందని వి.శ్రీనివాసరావు హెచ్చరించారు.


డేటా సెంటర్ ‌పై మాట మార్చిన ప్రభుత్వం ....

డేటా సెంటర్‌పై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ ... ఉద్యమకారులపై ముఖ్యమంత్రి విమర్శలు చేస్తున్నారని, వాస్తవంగా డేటా సెంటర్‌పై ఆరు నెలల్లో మాటలు మార్చింది ప్రభుత్వమేనని వి.శ్రీనివాసరావు అన్నారు. మొదట ఒక టిఎంసి నీరు మాత్రమే అవసరమని, తరువాత మూడు టిఎంసి లు అని, ఇప్పుడు ఆరు టిఎంసి లు నీరు అవసరం ఉందని చెబుతున్నారని తెలిపారు. ఇప్పుడు కొత్తగా కూలింగు టవర్ ఏర్పాటు చేస్తామంటున్నారని అన్నారు. విశాఖ టిడిపి ఎంపి శ్రీ భరత్ దీనిపై అంత అవగాహన లేదని చెప్పారన్నారు. తొలుత 1.60 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని మంత్రి లోకేష్ చెప్పగా ఇప్పుడు ఆరు డేటా సెంటర్లు కలిపి 20 వేల ఉద్యోగాలు మాత్రమే వస్తాయని చెబుతున్నారని మాట మార్చింది ఎవరో ఇప్పుడు సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. ఎంత నీరు కావాలో, విద్యుత్ కావాలో, పర్యావరణ ముప్పేమిటో ప్రభుత్వానికి ఇప్పటికీ స్పష్టత లేదని, ఉద్యమకారులు అడుగుతున్న ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వలేదని అడిగారు. ఎఐ కి డేటా సెంటర్స్ అవసరం అని, కాని రాష్ట్రంలో డేటా సెంటర్స్ వల్ల ఎఐ ఎలా అభివృద్ధి చెందుతుందో సమాధానం చెప్పాలన్నారు. అదానీ, గూగుల్ డేటా సెంటర్లకు సబ్సిడీలు ఇస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఇతరులపై నెపం వేయడం సముచితమా ? అని ప్రశ్నించారు. డేటా సెంటర్ పేరుతో విశాఖ నెత్తిన పర్యావరణ ముప్పు తెచ్చి పెడుతున్నారని ధ్వజమెత్తారు. డేటా సెంటర్‌కు అసలు పర్యావరణ అనుమతి లేదని శ్రీనివాసరావు తెలిపారు.


ఈవిఎం లపై దేశవ్యాప్త చర్చ పెట్టింది టిడిపినే ....

ఈవిఎం మిషన్ల పేరుతో పార్టీలపై నెపం వేస్తున్నారని, 2009 ఎన్నికల తరువాత ఈవిఎం మిషన్లను పట్టుకుని ఢిల్లీకి వచ్చి అవి వద్దని దేశం మొత్తం సమస్యను లేవనెత్తింది మొదట టిడిపియేనని వి.శ్రీనివాసరావు గుర్తు చేశారు. చివరకు ఈవిఎం దొంగతనం నెపంతో టిడిపి కార్యకర్త జైలుకు వెళ్లారని అన్నారు. అప్పుడు ఓడిపోయి ఈవిఎం తప్పుడుదని చెప్పి గెలిచిన తరువాత మంచిదని చెప్పి ప్రతిపక్షాలపై నిందలు వేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తుండటం సరికాదని అన్నారు. సర్ ‌లో రాష్ట్రంలో 32 లక్షల ఓట్లు తొలగించారని వివరించారు. 40 వేల మంది ఓట్లను ఫారం 7 ద్వారా తొలగించాలని ప్రయత్నిస్తున్నారని, అందులో 20 వేలు ఇఆర్ఓ లే అభ్యంతరాలు లేవనెత్తారని తెలిపారు. దీనిపై ప్రజలకు ఏమి సమాధానం చెబుతారని అడిగారు. ప్రజలు పోరాడుతుంటే వారిపై అపవాదులు మోపి మోసం చేయాలనుకోవడం సరికాదని మండిపడ్డారు. యువత, ప్రజల్లో అనేకమంది తెలివిగలిగినవారేనని, అందరినీ మోసం చేయడం సాధ్యం కాదని చెప్పారు. చంద్రబాబు తెలివిగలవారే.. కానీ తానొక్కరే తెలివివైన వారన్నట్లుగా మాట్లాటం సరికాదని ఇప్పటికైనా ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని వి.శ్రీనివాసరావు కోరారు.


మహిళలకు ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యం ....

ఎన్నికల సమయంలో మహిళలకు అనేక హామీలు గుప్పించి ఇప్పుడు మోసం చేశారని వి.శ్రీనివాసరావు ఆరోపించారు. వారికి నెలకు రూ.1500 ఇస్తామని ఇవ్వలేదని, డ్వాక్రా వడ్డీలు రద్దు చేయలేదని, ఉచిత బస్సు అని చెప్పి బస్సుల సంఖ్య తగ్గించి కొత్తగా వచ్చే విద్యుత్ బస్సులు ప్రైవేటు వారికి ఇచ్చారని, వాటిల్లో ఉచిత బస్సులు అమలు చేయరని తెలిపారు. ఉద్యోగాలు ఇవ్వలేదని, రైతులకు గిట్టుబాటు ధరలు లేవని అన్నారు. ఈ విషయాలన్నీ ఎజెండాకు రాకుండా ఉండటానికి అవనసర విషయాలను ముందుకు తెచ్చి పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.


అర్నబ్‌లో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు - నెలరోజులు సరిపడా రేషన్

అర్నబ్ తుఫానుతో 25 వేల ఎకరాలకుపైగా పంట నష్టం జరిగి ఉంటుందని వి.శ్రీనివాసరావు తెలిపారు. కొన్ని గ్రామాలకు వెళ్లే రోడ్లు కూడా దెబ్బతిన్నాయని, తక్షణం యుద్ధ ప్రాతిపదికన సహాయక కార్యక్రమాలు ప్రారంభించాలని కోరారు. తుఫాను బాధిత ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ నెల రోజులపాటు రేషన్ ఇవ్వాలని కోరారు. తుఫాను సహాయక చర్యల్లో సిపిఎం కార్యకర్తలు పాల్గొంటారని, పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. సిపిఎం పార్టీ తరఫున బాధితులకు సంఘీభావం ప్రకటించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్