విజయవాడ : ఈ రోజు (సోమవారం) ఢిల్లీలో యువజన, విద్యార్థులపై అమానుషంగా జరిగిన లాఠీచార్జిని, పోలీసులు చేసిన దౌర్జన్యాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. లాఠీచార్జికి ఆదేశమిచ్చిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నదన్నారు. దీనికి సంబంధించి సోమవారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేశారు. గత 23 రోజులుగా సోనమ్ వాంగ్‌చుక్ ఢిల్లీలో నిరసనదీక్ష చేస్తుంటే స్పందించనటువంటి ప్రభుత్వం విద్యార్థుల గొంతు నొక్కాలనే ప్రయత్నం చేయడం అప్రజాస్వామికమన్నారు. నీట్ ఎగ్జామ్స్ లీకేజీ కారణంగా అనేకమంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని, లక్షలాది మంది మానసిక క్షోభకు గురయ్యారని అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారానికి వచ్చాక 22 సార్లు పరీక్షల వైఫల్యం జరిగిందని గుర్తు చేశారు. అయినా సిగ్గు లేకుండా ధర్మేంద్ర ప్రధాన్ మంత్రిగా కొనసాగడం సిగ్గుచేటు అని అన్నారు. వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశమంతటా ఆయన రాజీనామా చేయాలని కోడై కూస్తున్నా సరే ప్రధానమంత్రి మాత్రం అతనిని అక్కున చేర్చుకొని కాపాడటం దేశానికే తలవంపులు తెచ్చిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ పోరాటానికి నాయకత్వం వహిస్తున్నటువంటి విద్యార్థి సంఘాలు, సిజెపి, తదితర సంఘాలను ఆహ్వానించి ఉన్నత స్థాయిలో ప్రధానమంత్రి లేదా విద్యాశాఖ క్యాబినెట్ మంత్రి స్థాయిలో చర్చలు జరిపి దానికి పరిష్కారానికి ముఖ్యంగా పరీక్షల విధానంలో ఉన్న లోటుపాట్లను సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మన రాష్ట్ర ఎంపీలు ఈ లాఠీచార్జికి నిరసనగా గళం విప్పాలని కోరారు. ప్రతిపక్షాలతో కలిసి ఈ విద్యా విధానాన్ని పరీక్షా విధానంలో ఉన్న లొసుగులను సరిదిద్దడానికి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేయాలని, విద్యార్థుల తరపున నిలబడాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తున్నదని పేర్కొన్నారు.
ఢిల్లీ విద్యార్థులపై లాఠీఛార్జికి సిపిఐ(యం) ఖండన : నిరసనలకు పిలుపు
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 20, 2026, 03:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)