గురువారం, 15 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

డేటా సెంటర్లపై నీతి ఆయోగ్ మార్గదర్శకాల ప్రకారం నిపుణులతో అధ్యయనం చేయించాలి : సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ

1 గంట క్రితం

A specific study must be conducted on the establishment of data centers in the states: CPI(M) State Committee
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026, 04:46 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • డేటా సెంటర్లపై నీతి ఆయోగ్ మార్గదర్శకాల ప్రకారం నిపుణులచే అధ్యయనం చేయించాలి..

  • నిపుణుల నివేదికలు వచ్చే వరకు డేటా సెంటర్ల అనుమతులు నిలిపివేయాలి - సిపిఐ(యం)


విజయవాడ : రాష్ట్రాల్లో డేటా సెంటర్ల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చే సమయంలో పంచ సూత్రాలపై నిర్దిష్ట అధ్యయనం చేయాలని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నీతి ఆయోగ్ తెలియజేసిన ఐదు అంశాలపై నిపుణులతో అధ్యయనం జరిపించాలని, ఆ అధ్యయన నివేదికలు వచ్చేవరకు డేటా సెంటర్లకు ఇచ్చిన అనుమతులు అన్నింటిని నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. దీనికి సంబంధించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఓ ప్రకటనను విడుదల చేశారు. డేటా సెంటర్లపై నీతి అయోగ్ నివేదికలో పేర్కొన్న ఏ అంశం మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం జరిపించలేదన్నారు. విద్యుత్తు సరఫరా చేసేందుకు అవసరమైన గ్రిడ్ ఉందా ? లేదా ? అలాగే డేటా సెంటర్లు, సాధారణ విద్యుత్తు డిమాండ్ మధ్య తేడాను కూడా నిశితమైన పరిశీలన చేయలేదు అని చెప్పారు. దీర్ఘకాలిక నీటి లభ్యత, నిల్వలపై కూడా అధ్యయనం చేయకపోగా, ఈ డేటా సెంటర్‌లకు ఎంత నీటి సరఫరా అవసరమో కూడా బహిర్గతం చేయకుండా రహస్యంగా ప్రభుత్వం తొక్కి పెట్టిందని విమర్శించారు. పర్యావరణ, సామాజిక, ఆర్థిక ప్రభావ అంచనా నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల చేత రూపొందించలేదన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ చేయకపోగా డేటా సెంటర్ల వర్గీకరణను కుట్రపూరితంగా ఏ కేటగిరి నుండి బి కేటగిరీకి మార్చేసిందన్నారు. 2006 కేంద్ర పర్యావరణ నిబంధనల్నింటినీ ఉల్లంఘించిందన్నారు. ప్రమాదకర వ్యర్ధాలు, ఈ వేస్టు, బ్యాటరీలు, విపరీత శబ్ద కాలుష్యం వల్ల ప్రజలపై కలిగే దుష్ఫలితాలపై కూడా అధ్యయనం చేయకపోగా లక్షలాదిమంది ప్రజల నివాసాల మధ్య భారీ డేటా సెంటర్ల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారని చెప్పారు. దీర్ఘకాలం పాటు రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల సబ్సిడీలు, పన్ను రాయితీల రూపంలో వేలకోట్ల రూపాయలు రాయితీలు డేటా సెంటర్లకు కల్పించారని, దీనివల్ల రాష్ట్ర ఖజానాకు దీర్ఘకాలంలో కోట్లాది రూపాయలు రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లుతుందన్నారు. పైగా వేల కోట్ల రూపాయల ప్రజల పన్నుల ఆదాయాన్ని కూడా డేటా సెంటర్ల మౌలిక సదుపాయాలు కల్పనలు ప్రభుత్వం వినియోగిస్తుందని, పైగా పెద్దగా ఉపాధి అవకాశాలు కూడా కల్పించబడటం లేదని చెప్పారు. ఈ డేటా సెంటర్లకు వ్యతిరేకంగా ఉత్తరాంధ్రలో ప్రజలు, మేధావులు, పౌర సంస్థలు, సంఘాలు, పర్యావరణవేత్తలు, యువకులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారని, వీటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకపోగా తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నదని ధ్వజమెత్తారు. ఈ నియంతృత్వ చర్యలు నిలిపివేయాలని, తక్షణం డేటా సెంటర్‌కి ఇచ్చిన అనుమతులన్నింటిని నిలిపివేయాలని, డేటా సెంటర్లవల్ల కలిగే తీవ్ర దుష్ఫలితాలపై నీతి అయోగ్ సూచించిన ఐదు సూత్రాల కనుగుణంగా నిపుణుల చేత నిశిత అధ్యయనం జరిపించాలని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అన్ని రాయితీలు, పన్ను మినహాయింపులు, భూములను వెనక్కి తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నదని వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.
cpim


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్