న్యూఢిల్లీ : అక్టోబర్ 16న సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ సెంట్రల్ పార్క్లో ‘లెహ్రా దో తిరంగా’ (త్రివర్ణ పతాకాన్ని ఎగురవేద్దాం) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రకటించారు. జంతర్ మంతర్ వద్ద జాతీయ జెండాను ఎగురవేసిన సిజెపి నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్లను అరెస్టు చేసి ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపడాన్ని నిరసిస్తూ ఆయన ఈ నిరసనకు పిలుపునిచ్చారు. గురువారం దీప్కే న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. జాతీయ జెండాను ఎగురవేయడాన్ని చట్ట ఉల్లంఘనగా ఎలా పరిగణిస్తారని కేంద్రాన్ని నిలదీశారు.జాతీయ జెండాను ఎగురవేయడాన్ని నేరంగా చిత్రీకరిస్తూ ప్రజాస్వామ్య హక్కులను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేష్ కుమార్కు మోడీ ప్రభుత్వం ఎందుకు రక్షణ కల్పిస్తోందని దీప్కే ప్రశ్నించారు. ఎన్నికల్లో బిజెపి విజయం సాధించేందుకు జ్ఞానేష్ కుమార్ సహాయపడుతున్నారనే అనుమానాలు ఎందుకు రాకూడదని నిలదీశారు. ఒకవేళ ఆయన బిజెపికి అనుకూలంగా వ్యవహరించడం లేదని ప్రభుత్వం భావిస్తే, మరి ఆయనకు ఇంతటి రక్షణ కల్పించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. “త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడాన్ని మీరు చట్ట ఉల్లంఘనగా పేర్కొన్నారు. ఎవరి కోసం ఈ చర్యలు తీసుకుంటున్నారు? జ్ఞానేష్ కుమార్ కోసమా? ఆయన మోడీకి ఏమి ఇస్తున్నారు? ఎన్నికల్లో బిజెపికి సహాయపడుతున్నందుకే ఆయనకు రక్షణ కల్పిస్తున్నారా?” అని ప్రశ్నించారు. ఢిల్లీలో నిరసనలను అడ్డుకునేందుకు ప్రభుత్వం అసాధారణ రీతిలో భద్రతా చర్యలు చేపట్టిందని మండిపడ్డారు. ఢిల్లీని స్తంభింపజేశారని, రైళ్లను నిలిపివేశారని, మెట్రో సేవలను కూడా అడ్డుకున్నారని అన్నారు. దేశ రాజధాని ఢిల్లీని భారత్–పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలా మార్చేశారని దుయ్యబట్టారు. అన్ని రకాల భద్రతా బలగాలను ఢిల్లీకి తరలించారని అన్నారు. విద్యార్థి సంఘాల నేతలు, ప్రతిపక్ష నేతలు, మాజీ ముఖ్యమంత్రులను సైతం వీధుల్లో ఈడ్చుకెళ్లారని అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు, జాతీయ జెండాను గౌరవంగా ఎగురవేసే హక్కు పౌరులకు ఉన్నాయని, ప్రభుత్వ చర్యలు ఈ హక్కులను ప్రశ్నార్థకం చేస్తున్నాయని మండిపడ్డారు.
సిఇసి బిజెపి విజయానికి సహకరించారు : ఐషీ ఘోష్
సిఇసి జ్ఞానేష్ కుమార్ బిజెపి ఎన్నికల విజయానికి సహకరించారంటూ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) నాయకురాలు ఐషీ ఘోష్ విమర్శించారు. ఢిల్లీలోని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న బిజెపి తమకు నమ్మకం లేదని, ప్రజలపైనే విశ్వాసం ఉందని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి పౌరులంతా ఐక్యంగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. “జ్ఞానేష్ కుమార్ బిజెపి దేశవ్యాప్తంగా ఎన్నికల్లో గెలిచేందుకు సహాయపడ్డారు. మాకు బిజెపిపై ఆశలు లేవు. దేశ ప్రజలపైనే ఆశలు ఉన్నాయి. మనమందరం ఏకం కావాల్సిన సమయం ఇది. భగత్ సింగ్ పోరాడి, మహాత్మా గాంధీ త్యాగం చేసిన ఈ దేశాన్ని మనం కాపాడుకోవాలి” అని ఐషీ ఘోష్ అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను, పౌర హక్కులను పరిరక్షించేందుకు ప్రజలు ముందుకు రావాలని ఆమె కోరారు. 2022లో ఉత్తరాఖండ్లో హత్యకు గురైన రిసార్ట్ రిసెప్షనిస్ట్ అంకితా భండారీ కేసును కూడా ఐషే ఘోష్ ప్రస్తావించారు. అంకితా భండారీ తల్లిదండ్రుల పట్ల అధికారులు వ్యవహరించిన తీరు దారుణంగా ఉందని, వారిని ఈడ్చుకెళ్లి హింసించారని ఆమె ఆరోపించారు. తీవ్రమైన నేరాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోకుండా, వారికి శిక్ష పడకుండా చూస్తున్నారంటూ విమర్శించారు. అత్యాచారాలకు పాల్పడిన వారికి పూలమాలలు వేసి స్వాగతం పలుకుతున్నారని వ్యాఖ్యానించారు.
ఢిల్లీని చుట్టుముట్టిన పోలీసులు
అక్టోబర్ 16న సిజెపి నిర్వహించనున్న ‘లెహ్రా దో తిరంగా’ కార్యక్రమం నేపథ్యంలో ఢిల్లీని పోలీసులు చుట్టుముట్టారు. కన్నాట్ ప్లేస్, జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఢిల్లీలో పలు పారామిలిటరీ బలగాల కంపెనీలను మోహరించినట్లు వెల్లడించాయి. శాంతిభద్రతలను పరిరక్షించడంతోపాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించేందుకు వ్యూహాత్మక ప్రాంతాల్లో పోలీసులను మోహరించనున్నట్లు పేర్కొన్నాయి. అవసరమైన చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేసి, నిరసనకారులు, సాధారణ ప్రయాణికుల రాకపోకలను నియంత్రించనున్నట్లు తెలిపాయి.








కామెంట్లు (0)