గురువారం, 15 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన పోలీసులు

1 గంట క్రితం

Police solve chain-snatching cases
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026, 04:07 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ఇద్దరు నిందితుల అరెస్టు

రూ.40 లక్షల విలువైన బంగారం స్వాధీనం


ప్రజాశక్తి – కాకినాడ : కాకినాడ, డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల్లో వరుస చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను కాకినాడ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 15 కేసులకు సంబంధించి సుమారు రూ.40 లక్షల విలువైన 280 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు ఒక మోటార్‌ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను గురువారం ఎస్పీ వివరించారు. కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్‌ ఆదేశాల మేరకు ప్రత్యేక పోలీసు బృందాలు ఈ కేసులను ఛేదించాయి. కాకినాడ అదనపు ఎస్పీ (అడ్మిన్‌) డాక్టర్‌ మహంతి కిషోర్‌ కుమార్‌ పర్యవేక్షణలో క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.వి. త్రినాధ్‌, కాకినాడ రూరల్‌ ఇన్‌స్పెక్టర్‌ డి. చైతన్య కృష్ణ, ఐటీ కోర్‌ ఇన్‌స్పెక్టర్‌ డి. దుర్గా శేఖర్‌ రెడ్డి, క్రైమ్‌ ఎస్‌ఐ ఎస్‌. విల్సన్‌ బాబు, ఇంద్రపాలెం ఎస్‌ఐ ఎం. వీరబాబు నేతృత్వంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులను గుర్తించారు. ఈ నెల 15న మధ్యాహ్నం 1.30 గంటలకు కాకినాడ రూరల్‌ మండలం ఎస్‌. అచ్యుతాపురంలోని జనచైతన్య లేఅవుట్‌లో ఖాళీ స్థలం వద్ద లంకా దొరబాబు (46), మందపల్లి వీర్రాజు (41)లను ఇంద్రపాలెం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో నిందితులు గత మూడేళ్లుగా కాకినాడ గాంధీనగర్‌, గోకులం, సర్పవరం, రాయుడుపాలెం, సామర్లకోట, పెద్దాపురం ప్రాంతాలతో పాటు కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు వెల్లడైంది. ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని ఈ చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. చెడు అలవాట్లకు బానిసై, అప్పులు తీర్చడంతో పాటు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నేరాలకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైందని పేర్కొన్నారు. ఇంద్రపాలెం, సర్పవరం, కాకినాడ రెండో పట్టణం, సామర్లకోట, పెద్దాపురం పోలీస్‌ స్టేషన్లతోపాటు కోనసీమ జిల్లా రామచంద్రాపురం పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన మొత్తం 15 కేసులను ఛేదించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడంలో కృషి చేసిన పోలీసు అధికారులను, సిబ్బందిని ఎస్పీ బిందు మాధవ్‌ ప్రత్యేకంగా అభినందించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్