త్రిస్సుర్ (కేరళ) : ప్రముఖ అణు శాస్త్రవేత్త, మార్క్సిస్టు సైద్దాంతిక నేత డాక్టర్ ఎం.పి. పరమేశ్వరన్ (91) మంగళవారం త్రిస్సుర్ లో కన్నుమూశారు. ఆయన జనవరి 18, 1935 న జన్మించారు. ఆయన పూర్తి పేరు ఎం.పి.పరమేశ్వరన్ (మడపట్ పరమేశ్వరన్ పరమేశ్వరన్).
భారతదేశంలో ప్రజా సైన్స్ ఉద్యమానికి ఒక బలమైన పునాది వేసిన మహనీయుడు, శాస్త్రవేత్త, రచయిత, ప్రజా విజ్ఞాన ఉద్యమకారుడు ఎం.పి. పరమేశ్వరన్ ఇక మన మధ్య లేరు. శాస్త్రాన్ని ప్రయోగశాలలకే పరిమితం చేయకుండా సామాన్య ప్రజల జీవితాల్లోకి తీసుకెళ్లాలన్నది ఆయన జీవిత ధ్యేయం. ఆయన కృషి ముఖ్యంగా కేరళలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రజా విజ్ఞాన ఉద్యమానికి కొత్త దిశను చూపింది.
1935 జనవరి 18న కేరళలో జన్మించిన ఎం.పి.పరమేశ్వరన్ ఇంజినీరింగ్ విద్యను అభ్యసించి, మాస్కోలోని Moscow Power Engineering Instituteలో అణు ఇంజినీరింగ్‌లో ఉన్నత విద్య, డాక్టరేట్ పొందారు. ముంబయిలోని భాభా అణు పరిశోధనా కేంద్రంలో (BARC) శాస్త్రవేత్తగా పనిచేశారు. అయితే కొంతకాలానికే శాస్త్ర పరిశోధన మాత్రమే తన జీవిత లక్ష్యం కాదని, శాస్త్రాన్ని ప్రజల కోసం ఉపయోగించాలనే ఆలోచన ఆయనలో బలపడింది. 1975లో BARC ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజా విజ్ఞాన ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేశారు.
కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ – ప్రజా ఉద్యమంగా మారిన శాస్త్రం ...
1962లో ఏర్పడిన Kerala Sasthra Sahithya Parishad (KSSP) మొదట శాస్త్ర సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే సంస్థగా ప్రారంభమైంది. ఎం.పి.పరమేశ్వరన్ వంటి కార్యకర్తల కృషితో అది క్రమంగా ఒక గొప్ప ప్రజా విజ్ఞాన ఉద్యమంగా ఎదిగింది.
“Science for Social Revolution” – “సామాజిక విప్లవం కోసం శాస్త్రం” అనే నినాదంతో శాస్త్రాన్ని ప్రజల జీవితాలతో అనుసంధానించింది.
ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్యం, విద్య, పర్యావరణం, వ్యవసాయం, శక్తి, అక్షరాస్యత వంటి సమస్యలను శాస్త్రీయ దృక్పథంతో అర్థం చేసుకోవాలని KSSP ప్రజలకు వివరించింది. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా శాస్త్రీయ దృక్పథం.. ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకుండా “దీనికి ఆధారం ఏమిటి ?” అని ప్రశ్నించే అలవాటును ప్రజల్లో పెంచడమే పరమేశ్వరన్ ఆశయం. శాస్త్రీయ దృక్పథం అంటే దేవుడిని లేదా విశ్వాసాన్ని వ్యతిరేకించడం కాదని, ప్రతి విషయాన్ని పరిశీలించి, ఆధారాలతో నిజానిజాలను తెలుసుకోవడమే శాస్త్రీయ ఆలోచన అని ఆయన ఉద్యమం ప్రజలకు తెలియజేసింది.
అక్షరాస్యత నుంచి ప్రజా చైతన్యం వరకు ....
ఎం.పి.పరమేశ్వరన్ అక్షరాస్యతను కేవలం చదవడం, రాయడం వరకు పరిమితం చేయలేదు. చదివిన విషయాన్ని అర్థం చేసుకోవడం, ప్రశ్నించడం, సమాజ సమస్యలపై ఆలోచించడం కూడా అక్షరాస్యతలో భాగమేనని భావించారు. Bharat Jan Vigyan Jatha, Bharat Gyan Vigyan Jatha వంటి కార్యక్రమాల ద్వారా శాస్త్రం, అక్షరాస్యత, సామాజిక చైతన్యాన్ని దేశవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు. పర్యావరణం, ప్రజా అభివృద్ధి అభివృద్ధి పేరుతో ప్రకృతిని నాశనం చేయడాన్ని ఆయన ప్రశ్నించారు. “అభివృద్ధి ఎవరి కోసం? ఎలాంటి అభివృద్ధి?” అనే ప్రశ్నలను ప్రజల ముందుకు తీసుకువచ్చారు. ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి జరగాలని, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఉపయోగపడాలని ఆయన నమ్మారు.
ప్రజా సైన్స్ ఉద్యమానికి ఆయన చేసిన గొప్ప సేవ ....
ఎం.పి.పరమేశ్వరన్ గొప్పతనం ఆయన శాస్త్రవేత్త కావడంలో మాత్రమే లేదు. శాస్త్రాన్ని ప్రజల భాషలో చెప్పగలిగిన రచయిత. ప్రజల మధ్య తిరిగి శాస్త్రీయ చైతన్యాన్ని కలిగించిన ఉద్యమకారుడు. శాస్త్రాన్ని సామాజిక మార్పుకు సాధనంగా భావించిన దార్శనికుడు. కేరళలో ప్రారంభమైన ప్రజా విజ్ఞాన ఉద్యమానికి ఆయన అందించిన ప్రేరణ దేశంలోని అనేక ప్రజా సైన్స్ సంస్థలకు మార్గదర్శకంగా నిలిచింది.
ఈరోజు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, మూఢనమ్మకాలు, శాస్త్రీయ ఆధారాలు లేని ప్రచారాలు విస్తరిస్తున్న సమయంలో పరమేశ్వరన్ ఆలోచనలు మరింత అవసరం. “శాస్త్రం ప్రయోగశాలల్లో మాత్రమే ఉండకూడదు; అది ప్రజల జీవితాల్లోకి రావాలి.” ఇదే ఎం. పి. పరమేశ్వరన్ జీవిత సందేశం. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ప్రజల్లో శాస్త్రీయ ఆలోచనను పెంపొందించాలనే ఆయన ఆశయం, ప్రజా సైన్స్ ఉద్యమం ద్వారా కొనసాగుతూనే ఉంటుంది. ప్రజా సైన్స్ ఉద్యమాన్నే జీవితంగా భావించి, దాని కోసం జీవితాంతం కష్టించిన ఎం. పి. పరమేశ్వరన్‌కు ఘన నివాళి. - కేలం ఆదినారాయణ. జన విజ్ఞాన వేదిక గౌరవ అధ్యక్షులు.. పల్నాడు జిల్లా.








కామెంట్‌లు (0)