విజయవాడ : దక్షిణ ఎనర్జీ పరిశ్రమ అగ్ని ప్రమాదంలో మరణించిన కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరింది. దీనికి సంబంధించి మంగళవారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు. పరవాడ ఇండస్ట్రియల్ జోన్‌లో ఈరోజు తెల్లవారుజామున జరిగిన దక్షిణ ఎనర్జీ పరిశ్రమ అగ్నిప్రమాద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నదన్నారు. గోవాడకు చెందిన వేపాడ వెంకటేష్ (34), త్రినాథ్ (24) మృతి చెందడం ఎంతో బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు సిపిఐ(యం) ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. మరణించినవారి కుటుంబాలు ఒక్కొక్కరికి కోటి రూపాయలు చొప్పున పరిహారం చెల్లించాలని, గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తోందన్నారు. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం .... కంపెనీ యాజమాన్యం, ఫ్యాక్టరీలపై తనిఖీలు జరపాల్సిన కార్మికశాఖ, ఫ్యాక్టరీస్ ఇన్‌స్పెక్టరేట్ యంత్రాంగం పూర్తిగా విఫలమవడమేనన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కంపెనీల్లో తనీఖీలు నిలుపుదల చేయడంతో యాజమాన్యాలు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయన్నారు. లేబర్ కోడ్స్ పేరుతో కార్మికులకు రక్షణ బలహీనపర్చారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు పరిశ్రమల యాజమాన్యాలకు దాసోహం అవుతూ ... కార్మికుల ప్రాణాలను గాలికి వదిలేయడం దుర్మార్గమన్నారు. అభివృద్ధి పేరుతో కంపెనీలకు ఎర్రతివాచీలు పరచడం తప్ప, కార్మికుల భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా తీవ్ర నిర్లక్ష్యంగా ప్రభుత్వాలు వ్యవహరించడాన్ని సిపిఐ(యం) ఖండిస్తున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దక్షిణ ఎనర్జీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే అన్ని పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయించేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నదని వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.










కామెంట్‌లు (0)